పెద్ద జయంతికి కొండంత ముస్తాబు

Mon,May 27, 2019 02:09 AM

- మల్యాల: వైశాఖ మాసే కృష్ణాయాం! దశమ్యాం మందవాసరే!!
- పూర్వాభాద్రా ప్రభూతాయా! ఆంజనేయాయ మంగళం!!

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి 30వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. 29న జరిగే పెద్ద జయంతికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, పక్క రాష్ర్టాల నుంచీ అంజన్న దీక్షాపరులు లక్షలాదిగా తరలిరానుండగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. వైశాఖ బహుళ దశమి రోజున ఏటా ఆలయ ఆచార సంప్రదాయానుసారం స్వామి వారి తిరునక్షత్ర జయంతి నిర్వహించడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞం నిర్వహించి జయంతి రోజున పూర్ణాహుతి కార్యక్రమం చేస్తారు.

కొండగట్టులోనే రెండు జయంతులు
కొండగట్టు పుణ్యక్షేత్రంలోనే ఆంజనేయ స్వామి వారికి రెండు జయంతులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. చైత్ర పౌర్ణమి రోజున ఉత్తర భారత దేశంతో పాటు దక్షిణ భారత దేశంలో హనుమాన్ జయంతి జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజాధి కార్యక్రమాలు, యజ్ఞాలు నిర్వహిస్తారు. కానీ, చైత్ర పౌర్ణమి రోజున కొండగట్టులో స్వామివారి చిన్న జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎలాంటి ప్రత్యేక ఉత్సవాలు, యజ్ఞయాగాదులు లేకుండా కేవలం అభిషేకాలు, అర్చనలు మాత్రమే నిర్వహిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షలాది మంది దీక్షాపరులు కాలినడక, ఇతర మార్గాల్లో కొండగట్టుకు తరలి వస్తారు. అత్యంత నిష్టతో ఆచరించిన మండల(41), అర్ధమండల(21), ఏకాదశ(11)రోజుల దీక్షలను స్వామివారి సన్నిధిలో విరమించి, మొక్కులు చెల్లించుకొని తిరిగి వెళ్తారు.

ఆర్జిత సేవలు బంద్
జయంతి ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి వేడుకలు ముగిసే దాకా ఆలయంలో అభిషేకాలు, వాహనపూజలు, సత్యనారాయణవ్రతాల వంటి ఆర్జిత సేవలను నిలిపి వేస్తున్నట్లు ఈవో అమరేందర్ తెలిపారు. జయంతి ఉత్సవాలు ముగిసిన తర్వాతి మరుసటి రోజు శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ఏర్పాట్లను ఈవోతో పాటు ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఏఈ లక్ష్మణ్‌రావు పర్యవేక్షిస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి
పెద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్‌లో చిన్న జయంతికి చేసిన ఏర్పాట్లకు తోడు అదనంగా క్యూలైన్లు, మాల విరమణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో అమరేందర్ తెలిపారు. పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడీలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల రికార్డులను ఎల్‌ఈడీల ద్వారా ప్రసారం చేస్తామన్నారు. మండుతున్న ఎండలకు అనుగుణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిన్న జయంతికి వేసిన బారికేడ్లు, క్యూలైన్ల నిర్మాణం, చలువ పందిళ్లు, చలివేంద్రాలు వంటి వాటికి చిన్న చిన్న మార్పులు, మరమ్మతులు చేస్తున్నారు. టికెట్ విక్రయ కేంద్రాలు, కేశఖండనం, మాల విరమణ, లడ్డూ పులిహోర విక్రయ కేంద్రాల వద్ద క్యూలైన్లు, బారికేడ్లను నిర్మించారు. ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనాలకు సైతం ప్రత్యేక క్యూలైన్లు నిర్మించారు. గుట్ట మీద ఉన్న ఐదు సులభ్ కాంప్లెక్స్‌లతో పాటు దీక్షా విరమణ మండపం వెనక, గుట్ట మీద మెట్ల దారికి సమీపంలో, ఘాట్ రోడ్డుకు ఇరువైపులా, నాచుపెల్లి మార్గంలో 75 తాత్కాలికి మరుగుదొడ్లు నిర్మించారు. పారిశుధ్య నిర్వహణకు జగిత్యాల డీపీవో అదనపు సిబ్బందిని సమకూర్చారు. పంచాయితీరాజ్ ఉద్యోగులు, రెవెన్యూ, జగిత్యాల మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది పారిశుధ్య నిర్వహణలో పాలుపంచుకోనున్నారు. గుట్ట మీద, వాహన పూజల షెడ్డు వద్ద, వై జంక్షన్ వద్ద, గుట్ట కింద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు సలహాలు సూచనలిచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లను పెట్టారు. కొత్త పుష్కరిణి వద్ద మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు నిర్మించారు.

3 లక్షల లడ్డూ ప్రసాదం
భక్తులకు ప్రీతిపాత్రమైన స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. ఉత్సవాలకు వచ్చే దీక్షాపరులు, భక్తుల కోసం ఆలయ అధికారులు ముందుస్తుగానే 3లక్షల లడ్డూలను తయారుచేసి పెట్టారు. అవి సరిపోని పక్షంలో వెంటనే తయారుచేసేందుకు అదనపు సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచినట్లు ప్రసాద తయారీ ఇన్‌చార్జి ధర్మేంధర్ తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అప్పటికప్పుడే పులిహోర తయారుచేసి అందిస్తామని పేర్కొన్నారు.

98
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles