ఆశల సాగుకు..

Sat,May 25, 2019 01:51 AM

-సేద్యానికి సిద్ధంగా అన్నదాతలు
-ఈ సారి వర్షాలు అనుకూలిస్తాయనే సంకేతాలు
- రైతుబంధు ధీమాతో ముందుకు..
- రోహిణీ కార్తె ప్రవేశంతో పనులు మొదలు పెట్టేందుకు..
- 1,24,425 హెక్టార్లలో అంచనాలు
- అందుబాటులో విత్తనాలు, ఎరువులు
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:వానాకాలం, యాసంగి దిగుబడులు ఆశించిన స్థాయిలో రావడం, రైతుబంధు కింద పెట్టుబడి అందుతుండడం, ఈ సారి వానలు కూడా అనుకూలిస్తాయనే సంకేతాలతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. జూన్ మొదటి వారంలోనే వర్షాలు పడే అవకాశముందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో రైతులు ఆశల సాగుకు సిద్ధమవుతున్నారు. రోహిణీ కార్తె ప్రారంభంలో నార్లు పోసుకుంటే సకాలంలో నాట్లు పడి, ముందుగానే కోతకు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తుంటారు. ఈ రోహిణీ కార్తె శనివారం నుంచే ప్రవేశిస్తుండడంతో సంప్రదాయం ప్రకారం చాలా మంది వరినార్లు పోసుకునేందుకు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు విత్తనాలు తెచ్చి ఇంట్లో భద్రపరుచుకున్నారు. ఆయకట్టు, ఆయకట్టేరత ప్రాంతాల్లో నీటి వసతి ఉన్న చాలా మంది నేటి నుంచే వరినార్లు పోసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వానాకాలం సీజన్ కోసం నార్లు పోసుకునేందుకు ఇప్పటికే మడులు సిద్ధం చేసుకుంటున్నారు. రుతుపవనాలు వచ్చి సకాలంలో వర్షాలు కురిస్తే సకాలంలో విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

1,24,425 హెక్టార్లలో సాగు అంచనా..
వానాకాలంలో జిల్లాలో వరి, పత్తి, మక్క పంటలను ప్రధానంగా సాగు చేస్తారు. ఇందుకు తగినట్లుగానే వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. 1,24,425 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనాలు తయారుచేశారు. గత సీజన్‌లో 52 వేల హెక్టార్లుగా వరి సాగు ప్రణాళిక ఇవ్వగా, ఈ సారి 55 వేలకు పెంచారు. అలాగే పత్తి గత సీజన్‌లో 64 వేల హెక్టార్ల నుంచి 55 వేలకు తగ్గించారు. మక్క గత సీజన్‌లో 16 వేల హెక్టార్ల ఇస్తే ఈసారి 12 వేలకు ఇచ్చారు. 2,425 హెక్టార్లలో ఇతర పంటలు సాగు కావచ్చని అంచనా వేశారు.

అందుబాటులో విత్తనాలు, ఎరువులు..
సాగు ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు అందుకు తగినట్లుగా విత్తనాలు, ఎరువులు తెప్పిస్తున్నారు. 37,976 క్వింటాళ్ల విత్తనాలు, 72,984 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే కొన్ని సబ్సిడీ విత్తనాలు సిద్ధంగా ఉంచారు. జిల్లాలో ప్రధాన పంటల్లో ఒకటైన మక్క ఏటేటా సాగు విస్తీర్ణం పడిపోతుండగా, అందుకు అనుగుణంగానే 12 వేల హెక్టార్లలో మక్క సాగవుతుందని అంచనా వేశారు.

116
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles