యాదవుల సంక్షేమానికి కృషి

Thu,May 23, 2019 01:09 AM

-బీరన్న దేవాలయ అభివృద్ధికి తోడ్పాటునందిస్తాం
-రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్
-ఎలుబాక, నాగంపేటలో బీరన్న జాతర ఉత్సవాలకు హాజరు

వీణవంక: తెలంగాణలోని యాదవుల అభివృద్ధి సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదనీ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాయితీపై గొర్రె పిల్లలను అందజేస్తుండడమే దీనికి నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎలుబాక గ్రామంలో యాదవుల ఆధ్వర్యంలో వారం రోజులుగా బీరన్న జాతర నిర్వహిస్తుండగా చివరి రోజు బుధవారం మంత్రి ఈటల రాజేందర్ బీరన్న దేవాలయాన్ని సందర్శించారు. స్వామి వారికి పూజలు చేశారు. మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా యాదవులు మంత్రికి గొర్రెపిల్లను బహూకరించారు. శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం యాదవులను ఉద్దేశించి మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. యాదవుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు వివరించారు. కుల సంఘాల కోసం కమ్యూనిటీ భవనాలను నిర్మించిందని చెప్పారు.

ఎలుబాక గ్రామంలో యాదవుల విజ్ఞప్తి మేరకు గతంలోనే బీరన్న దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. ప్రహరీ నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. భవిష్యత్తులోనూ దేవాలయ అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మారముల్ల కొమురయ్య, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు పోలు లక్ష్మణ్, జమ్మికుంట మార్కెట్ వైస్‌చైర్మన్ పెద్ది మల్లారెడ్డి, సర్పంచ్ కొత్తిరెడ్డి కాంతారెడ్డి, నాయకులు మాడ సాధవరెడ్డి,వాల బాలకిషన్, తుమ్మేటి సమ్మిరెడ్డి, పింగిళి రమేశ్, ముసిపట్ల తిరుపతిరెడ్డి, యాదవ సంఘం నాయకులు ఎర్రయ్య, రాజకొమురయ్య, రవి, శంకర్, మల్లయ్య, రాములు, సదయ్య, తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట రూరల్: మండలంలోని నాగంపేట గ్రామంలో బుధవారం బీరన్న ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు గొల్ల, కురుమలు, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి.. బీరన్న దేవున్ని దర్శించుకున్నారు. పంటలు సమృద్ధి పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బీరన్న ఉత్సవ కమిటీ విజ్ఞప్తి మేరకు ఆలయ ప్రహరీ కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, బీరన్న నాగవెల్లి పట్నం తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల గొల్ల, కుర్మలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎంగల కుమార్ పెద్దకురుమ ఆధ్వర్యంలో జరిగిన బీరన్న ఉత్సవంలో గ్రామ సర్పంచ్ చందుపట్ల స్వాతి, సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

115
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles