కేసుల దర్యాప్తును పకడ్బందీగా చేపట్టాలి

Sun,May 19, 2019 01:53 AM

కరీంనగర్ క్రైం: వివిధ రకాల కేసుల దర్యాప్తులను పోలీసులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమచక్రవర్తి సూచించారు. శనివారం కమిషనరేట్ కేంద్రంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాన న్యాయమూర్తి పోలీసు అధికారులతో మాట్లాడుతూ, దర్యాప్తుల్లో లోపాల వల్ల నిందితులు శిక్షింపబడలేకపోతున్నారన్నారు. దర్యాప్తులు పకడ్బందీగా చేపట్టడం ద్వారా శిక్షలు పడి నేరాలు నియంత్రణలోకి వస్తాయని పేర్కొన్నారు. వివిధ రకాల కేసుల్లో ఆయా నేరాలకు సంబంధించిన ఫొటోలు, సీడీలను కూడా జత పర్చాలని సూచించారు. గాయాలు, లైంగిక దాడులకు సంబంధించిన నేరాలను అన్ని కోణాల్లో పరిశీలించి, జాగ్రత్తగా దర్యాప్తు చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించాలనీ, అవగాహన లేని విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపాలని సూచించారు. కొన్ని ముఖ్యమైన నేరాలు దర్యాప్తులో లోపం వల్ల నీరుగారిపోతున్నాయని పేర్కొన్నారు. వివిధ రకాల కేసుల్లో దొర్లుతున్న తప్పులు, సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనరేట్ వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను సీపీ కమలాసన్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ, ప్రజలతో దురుసుగా ప్రవర్తించవద్దనీ, కేసుల దర్యాప్తుల్లో నాణ్యత ప్రమాణాలను పెంపొందించుకోవాలని సూచించారు. గతేడాది సమష్టి కృషి వల్లే నేరాలను తగ్గించగలిగామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. యూనిఫాం సర్వీస్ డెలివరీపై అన్ని స్థాయిలకు చెందిన పోలీసులకు అవగాహన ఉండాలన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో సమర్థవంతమైన సేవలందించిన వారికి రివార్డులు అందజేశారు. రివార్డులు అందుకున్న వారిలో సీఐ దేవారెడ్డి (టూటౌన్), ఏవో వీరస్వామి (కొత్తపల్లి), రిసెప్షనిస్ట్ సౌందర్య, బ్లూకోల్ట్స్ సంతోష్, రాజేశం (చొప్పదండి), క్రైం పార్టీ ఏ సుధాకర్, రాజశేఖర్, వినోద్‌బాబు (గన్నేరువరం), రాజయ్య, శ్రీనివాస్‌రావు (ఎల్‌ఎండీ), ఎస్‌ఐ వై. కృష్ణారెడ్డి (వీణవంక), నజీమహ్మద్ (హుజూరాబాద్), దత్తు ప్రసాద్, ఆంజనేయులు, రాజేందర్ (ట్రాఫిక్), ఆనందం, క్రిష్ణ, శంకర్ (స్పెషల్ బ్రాంచి) ఉన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, రవీందర్, ఏసీపీలు అశోక్, కృపాకర్, రాగ్యానాయక్, శ్రీనివాస్‌తోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

124
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles