శరవేగంగా టీఎస్టీపీపీ

Sat,May 18, 2019 01:09 AM

-పూర్తిగా స్వరాష్ట్ర అవసరాల కోసమే నిర్మాణం
-అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వినియోగం
-యుద్ధప్రాతిపదికన పనులు
-2020 కల్లా పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ జ్యోతినగర్ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా పూర్తిగా స్వరాష్ట్ర అవసరాల కోసం 2016 జనవరి 29న ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎస్టీపీపీ) నిర్మాణ పనులను మొదలు పెట్టారు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1600 మెగావాట్లు కాగా, 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లను నిర్మిస్తున్నారు. మే 2015లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కాగా, 2016 ఆగస్టులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనుల శిలాఫలకాన్ని రిమోట్‌తో ప్రారంభించారు. 10,598.98కోట్ల వ్యయంతో బీఎచ్‌ఈఎల్ సంస్థతోపాటు మరికొన్ని సంస్థలు పనులు చేస్తుండగా, కొత్త థర్మల్ పవర్ స్టేషన్ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించారు. ఒడిశాలోని మందాకిని-బీ మైన్ నుంచి బొగ్గు సరాఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. పర్యావరణ అనుమతులు కూడా సాధించగా, ప్రాజెక్ట్ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 డిసెంబర్ 8న పనులను పరిశీలించారు. అప్పుడు 2020 కల్లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి పనుల్లో మరింత వేగం పెంచారు. ఇప్పటికే ఒకటి, రెండు యూనిట్లకు సంబంధించిన బాయిలర్ పనులతోపాటు, చిమ్నీ, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఇతర సివిల్ పనులను శరవేగంగా చేపడుతున్నారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల కోసం రెండు మార్గాలతో ఒకే చిమ్నీని అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు.

79
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles