జయహో కాళేశ్వరం

Fri,May 17, 2019 01:23 AM

-ఎత్తిపోతల పథకంపై పటాపంచలవుతున్న కుట్రలు
-భగ్నం చేస్తున్న రాష్ట్ర సర్కారు, ప్రజలు
-తాజాగా వ్యతిరేకులకు చెంపపెట్టులా హైకోర్టు తీర్పు
-ఎలాంటి ఆటంకాలూ లేకుండా ప్రాజెక్టు పూర్తి చేసుకోవచ్చని స్పష్టీకరణ
-ఇక పనుల్లో మరింత వేగం
-ఇప్పటికే నందిమేడారంలో నాలుగుమోటర్ల వెట్న్‌
-రైతులు, మేధావుల హర్షం
-ఇకనైనా తీరుమార్చుకోవాలని ప్రతిపక్షాలకు హితవు
కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి/ పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మూడేళ్ల క్రితం ‘ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌'కు అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నట్లుగానే 2016 మే 2న ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం సమీపాన పునాదిరాయి వేశారు. కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం పంప్‌హౌస్‌ పనులకు భూమిపూజ చేశారు. అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు. బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, అండర్‌టన్నెళ్లు, భారీ రిజర్వాయర్లతోపాటు ఎస్సారెస్పీ పునర్జీవం పోసే పంప్‌హౌస్‌లను శరవేగంగా పూర్తి చేయిస్తున్నారు. అలాగే నందిమేడారం, లక్ష్మీపూర్‌ వద్ద భూగర్భంలో అందరూ అబ్బుర పడేలా భారీ పంప్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పనులను కాలంతోపాటే పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల పనులు తుది దశకు చేరుకోగా, నీటి తరలింపు పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే నందిమేడారం పంప్‌హౌస్‌లో నాలుగు మోటర్లకు వెట్న్‌ నిర్వహించి, మేడారం జలాశయంలోకి నీటిని ఎత్తిపోశారు. ఇటు లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌లో మోటర్ల వెట్న్‌,్ర రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌ల్లో డ్రైరన్‌కు అంతా సిద్ధం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే జూలై నుంచి కాళేశ్వరం నీటిని కొంతమేరకైనా ఇవ్వాలన్న లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.

కుట్రలు పటాపంచలు..
ప్రాజెక్టు పనులను చూసి ఎందరో మేధావులు, ఇంజినీరింగ్‌ నిపుణులు, వివిధ దేశాల ప్రతినిధులు ఒక అద్భుతమంటూ కీర్తిస్తున్నారు. కానీ, ఇది ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. లక్షలాది మందికి మేలు చేసే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే తమకు పుట్టగతులుండవన్న ఉద్దేశంతో ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినప్పటి నుంచే కుట్రలు పన్నుతున్నారు. భంగపాటు ఎదురవుతున్నా లేనిపోని కొర్రీలు పెడుతూ కోర్టులు, ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమర్థవంతంగా తిప్పి కొడుతున్నారు. 2016 మార్చి31న శాసనసభా వేదికగా ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌పై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ చేసిన సందర్భంగా.. ‘ప్రజల సహకారంతోనే ప్రాజెక్టులు కట్టితీరుతాననీ, తమనెవరు ఆపలేరనీ, ఆపుదామనుకుంటే అది భ్రమేనని’ చెప్పినట్లుగానే.. సీఎం ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఒక్కో అవాంతరాన్ని అధిగమిస్తూ, అంతర్రాష్ట్ర సమస్యలు లేకుండా చేశారు. భూసేకరణ విషయంలో రైతులను ఒప్పించి మెప్పించారు. అయినా కొందరు కుట్రదారులు, నిర్వాసిత రైతులను రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు. తిరిగి వాస్తవాలు తెలుసుకుని రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

తాజాగా హైకోర్టు తీర్పుపై హర్షం..
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద రాష్ట్ర సర్కారు, దేశంలో ఎక్కడా లేని విధంగా మెరుగైన ప్యాకేజీని ఇస్తున్నది. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు కూడా ఈ నెల 3 నుంచి 12 రోజుల పాటు (ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ) పునరావాసం, పునరోపాధి చెక్కులు అందజేసింది. 95 శాతం మంది రైతులు ఆనందోత్సాహాల మధ్య చెక్కులు అందుకున్నారు. ఐదు శాతం మంది మాత్రం కొందరు ప్రతిపక్ష నాయకుల కుట్రలతో ప్యాకేజీని తిరస్కరించి, హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం చారిత్రక తీర్పునిచ్చింది. ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఆపే ప్రసక్తి లేదనీ, లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ప్రాజెక్ట్‌ను కేవలం రెండు, మూడు ఎకరాల భూయజమానుల కోసం ఆపలేమని స్పష్టం చేసింది. పరిహారం చెల్లింపులో జాప్యం జరిగితే తమ వద్దకు రావాలని సూచించింది. పరిహారం వద్దనుకునే 60 మంది రైతులు తమ పరిహారాన్ని వారి లాయర్లకు అందజేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో మేడిగడ్డ నుంచి యాదాద్రి జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు దాకా లైన్‌ క్లియర్‌ అయింది. తుది దశకు చేరుకున్న కాళేశ్వరం పనుల్లో మరింత వేగం పెరగనుండగా, రైతులు, మేధావులు హర్షం వ్యక్తం చేశారు. లక్షలాది మందికి మేలు చేసే ప్రాజెక్టును అడ్డుకోవడం సరైంది కాదనీ, కోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని స్పష్టం చేశారు.

తోటి రైతుల కోసం సహకరించినం..
మాది ధర్మారం మండలం నంది మేడారం. మేము ముగ్గురు అన్నదమ్ములం. మాకు పొత్తులో 20 ఎకరాల పట్టా భూమి ఉండె. ఇందులో 12 ఎకరాలు మా ఊళ్లే పెద్ద చెరువుల ఎల్లంపల్లి పంప్‌హౌస్‌ నిర్మాణంలో కోల్పోయినం. 2012లో అప్పటి సర్కారు ఎకురానికి 3.50 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో మా చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు మరో ఎనిమిదెకరాలు ఇచ్చినం. అప్పుడు మా ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ సార్‌ సహకారంతో ప్రభుత్వం మా భూమికి తగ్గ పరిహారం ఎకురానికి 9.25లక్షలు ఇచ్చి, మాకు మేలు చేసిన్రు. కేసీఆర్‌ రైతుల కోసం ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నందుకే మేమంతా భూములిచ్చి సహకరించినం.

- మిట్ట రాజయ్య, రైతు నంది మేడారం (ధర్మారం)
నలుగరికి మేలైతదని మా భూములు వదులుకున్నం..
మాది ధర్మారం మండలం నంది మేడారం. మేము ముగ్గురు అన్నదమ్ములం. మాకు మా ఊరు చెరువు సమీపాన 12 ఎకరాల పట్టా భూమి ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మా చెరువును విస్తరించేందుకు భూమి తీసుకున్నరు. దీంతో మేం ముగ్గురం అన్నదమ్ములం మా జాగాను ఇస్తే, ఎకురానికి 9.25లక్షలు ఇస్తమన్నరు. భూమిని రెవెన్యూ శాఖ పేరు మీద పట్టా చేయగానే డబ్బులు ఇచ్చిన్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రైతులకు ఎంతో మేలైతదనే మేం భూములు వదులుకున్నం. ఇంతటి పెద్ద ప్రాజెక్టును అడ్డుకోవాలని కొందరు కేసులేస్తే, వారికి బుద్ధి వచ్చేలా కోర్టు తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉంది.

- గోళ్ల సంతోష్‌ , యువరైతు, నంది మేడారం
20రోజుల్లోనే పరిహారం
రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్‌. ఆయన ఏ పని చేసినా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే చేస్తాడు. రాజేశ్వర్‌రావుపేటలో నిర్మిస్తున్న రివర్స్‌ పంప్‌ హౌస్‌ కోసం నేను రెండెకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వగా కేవలం 20 రోజుల్లోనే ఎకరాకు రూ. 13లక్షల చొప్పున రూ.26లక్షల పరిహారం అందించిన్రు. కొద్దిమంది రైతుల నుంచి భూములు సేకరించి వందలాది మంది రైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టును కడుతున్నరు. రివర్స్‌ పంపింగ్‌ పనులతో ఇక్కడ భూగర్భజలాలు పెరిగి నీటి కష్టాలు తీరుతాయి.
-పిప్పెర సాయన్న, రైతు, రాజేశ్వర్‌రావుపేట (ఇబ్రహీంపట్నం)

రైతుల సంక్షేమం కోసమే ప్రాజెక్టులు..
రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు కడుతున్నది. రైతు రాజ్యం రావాలని రైతుకు కష్టం రాకూడదని నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్‌కు అన్నదాతలు రుణపడి ఉంటారు. రాజేశ్వర్‌రావుపేటలో రివర్స్‌ పంపింగ్‌ పనుల్లో భాగంగా ఎకరం భూమి ప్రభుత్వానికి ఇచ్చిన. మాకు కేవలం ఇరవై రోజుల్లోనే ఎకరాకు రూ. 13 లక్షల పరిహారం వచ్చింది. మా గ్రామంలో పది పన్నెండు మంది రైతుల నుంచి భూములు సేకరించి వేల ఎకరాలకు నీరదించే మంచి కార్యక్రమానికి పూనుకోవడం ఎంతో అనందంగా ఉంది. ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న పనికి రైతుల మద్దతు ఎల్లవేళాలా ఉంటుంది.
-నోముల కృష్ణమూర్తి, రైతు, రాజేశ్వర్‌రావుపేట (ఇబ్రహీంపట్నం)

ప్రతిపక్షాలకు గుణపాఠం
మధ్యమానేరు ప్రాజెక్టు కింద భూములు పోయి ఇళ్లు మాత్రమే మిగిలాయి. మానువాడ గ్రామానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద పరిహారం చెల్లించేందుకు జీవో జారీ చేసింది. అందుకు మేం ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం. ప్రాజెక్టు విషయంలో కోర్టుకు వెళ్లిన వారికి ఈ తీర్పు గుణపాఠంతో పాటు రైతులకు నిర్వాసితులకు ప్రజలకు మేలు జరగనుంది. ఈ విషయంలో అన్నివర్గాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.
- తిరుపతి, మానువాడ (బోయినపల్లి)

121
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles