ప్రజల్లో ఐక్యతను చాటడమే దేశభక్తి

Thu,May 16, 2019 01:19 AM

రామడుగు: సమాజంలో కులమతాలకు అతీతంగా ఐక్యతను చాటడమే దేశభక్తి అని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. రామడుగు మండలం గోపాల్‌రావుపేట బస్టాండ్‌ కూడలిలో స్థానిక సామాజిక సేవకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య జనగనమన 110వ రోజు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన రూరల్‌ ఏసీపీ ఉషారాణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బస్టాండు కూడలిలోని ‘ఏపూరి ఎల్లయ్య’ భవనంపై జాతీయ పతాకాన్ని సీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా సీఐ ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంటలో 2017 ఆగష్టులో నిత్యజనగనమన కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. కేవలం జనవరి 26న, ఆగస్టు 15వ తేదీన మాత్రమే జెండాకు వందనం చేసినంత మాత్రాన అది దేశభక్తి అనిపించుకోదన్నారు. బతికున్నంత వరకూ త్రివర్ణ పతాకంపై గౌరవం ఉండాలన్నారు. మనమంతా దేశంపట్ల అంకిత భావంతో ఉన్నప్పుడే అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతామన్నారు.

ప్రతి ఒక్కరూ భారతీయులమనే భావనతో ఉండాలన్నారు. గోపాల్‌రావుపేటలో నిత్య జనగణమన కార్యక్రమంలో పాల్గొని జెండావందనం చేయడం సంతోషం కలిగించిందన్నారు. సామాజిక చైతన్యాన్ని అందించే నిత్య జనగణమన కార్యక్రమం చేపడుతున్న కొత్త సతీశ్‌, ఎడవెల్లి మహిపాల్‌రెడ్డి, ఎడవెల్లి పాపిరెడ్డి, ఏపూరి ఎల్లయ్యలను సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ ఏసీపీ ఉషారాణి, సీఐ రమేశ్‌, ఎస్‌ఐ రవి, సర్పంచ్‌ కర్ర సత్యప్రసన్న, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు నిర్మల, గ్రామస్తులు పాల్గొన్నారు.

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles