అద్వితీయం.. జలదృశ్యం

Fri,April 26, 2019 01:07 AM

- నందిమేడారాన రెండో మోటర్ వెట్న్ విజయవంతం
- కాళేశ్వరాన చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
- సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆధ్వర్యాన పరీక్ష
- ఎలాంటి అవాంతరాలు లేకుండా సక్సెస్
- 200 ఆర్పీఎం స్పీడ్‌తో నీటి ఎత్తిపోత
- మేడారం రిజర్వాయర్‌కు తరలిన గోదారమ్మ
- హర్షం వ్యక్తం చేసిన ఇంజినీర్లు, అధికారులు
- రైతుల మోముల్లో చిరునవ్వులు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ ధర్మారం: తెలంగాణ వరదాయినీ కాళేశ్వరం ప్రాజెక్టు చెంత అద్వితీయ జలదృశ్యం ఆవిష్కృతమైంది. అపరభగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన యజ్ఞంలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. ఆరో ప్యాకేజీలో భాగంగా నందిమేడారం పంప్‌హౌస్ వేదికగా, చరిత్రాత్మక ఘట్టం సాక్షాత్కరించింది. బుధవారం మొదటి మోటర్‌కు వెట్న్ విజయవంతం కాగా, గురువారం రెండో మోటర్‌కు నీటి ఎత్తిపోత పరీక్ష సక్సెస్ అయింది. సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ స్విచ్ ఆన్ చేయగా, 200 ఆర్‌పీఎం (రివొల్యూషన్ పర్ మినిట్) స్పీడ్‌తో రెండో మోటర్ జలాలను ఎత్తిపోసింది. అదే సమయంలో మొదటి మోటర్‌ను 40నిమిషాలపాటు నడిపించగా, మేడారం రిజర్వాయర్‌కు గోదారమ్మ పరుగులు తీసింది. మొత్తంగా భారీ మోటర్లు ఒక్కొక్కటిగా సక్సెస్ అవుతుండడంతో ఇంజినీరింగ్, నీటిపారుదల యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఉబికివచ్చిన గంగమ్మను చూసి చుట్టుపక్క గ్రామాల రైతాంగం సంబురపడిపోయింది.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అనేక రికార్డులను నమోదు చేస్తూ శరవేగంగా నిర్మితమవుతున్నది. రాష్ట్రంలోని 18.20 లక్షల కొత్త ఆయకట్టుతోపాటు వివిధ ప్రాజెక్ట్‌లకు లింకు చేయడం ద్వారా మరో 18.07లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా, ఇంజినీరింగ్ యంత్రాంగం పగలనకా.. రాత్రనకా శ్రమించి చివరి దశకు చేరింది. ప్రాజెక్టులో భాగంగా ఆరో ప్యాకేజీ కింద పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం భూగర్భంలో నిర్మించిన పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన భారీ మోటార్లను సిద్ధం చేసే క్రమంలో నిర్వహించిన వెట్న్ పరీక్ష విజయవంతంగా ముందుకుసాగుతున్నది. బుధ, గురువారాల్లో మొదటి, రెండో మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే పరీక్షలు సక్సెస్‌కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

రెండో మోటర్ వెట్న్ సక్సెస్..
కాళేశ్వరం గంగ పరుగులు తీసింది. నందిమేడారం పంప్‌హౌస్ నుంచి రెండో మోటర్ గోదావరి జలాలను నందిమేడారం జలాశయానికి ఎత్తిపోసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింకు-2లో భాగంగా ధర్మారం మండలం నందిమేడారంలోని పంప్‌హౌస్‌లో 127.6 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు మోటార్లను ఏర్పాటు చేయగా, ఇప్పటికే నాలుగు మోటార్ల డ్రైరన్ పూర్తయింది. ఇందులో మొదటి మోటార్ వెట్న్ (నీటిని ఎత్తిపోసే విధానాన్ని పరీక్షించే ప్రక్రియ)ను బుధవారం సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించగా, విజయవంతంగా నీటిని ఎత్తిపోసింది. గురువారం మధ్యాహ్నం స్మితాసబర్వాల్ అధికారులతో కలిసి రెండో మోటర్ వెట్న్ నిర్వహించారు. మోటర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మధ్యాహ్నం 3:42 గంటల నుంచి 4:48 గంటల దాకా రెండో మోటర్ నీటిని ఎత్తిపోసింది. గోదారి జలాలు నందిమేడారం జలాశయంవైపు పరుగులు తీశాయి.

మొదటి మోటార్ ద్వారా నీటి తరలింపు
రెండో మోటర్ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్న సమయంలో నిన్న వెట్న్ పూర్తయిన మొదటి మోటర్ ద్వారా 4:12 గంటల నుంచి 4:57 గంటల దాకా (దాదాపు 45 నిమిషాలు) నీటిని ఎత్తిపోశారు. రెండు పంపుల నుంచి ఒకేసారి 6,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడంతో గోదావరి జలాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ లీడ్ చానల్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌కు పరుగులు పెట్టింది. రెండు రోజుల్లో నంది మేడారం పంప్‌హౌస్ నుంచి 0.02 టీఎంసీలు ఎత్తిపోశాయి. రెండో మోటర్ విజయవంతం కావడంతో స్మితా సబర్వాల్ ఇంజినీర్లను అభినందించారు. కాగా, అంతకుముందు డెలివరీ సిస్టర్న్ నుంచి వస్తున్న నీటిలో స్మితా సబర్వాల్ పూలు చల్లి, స్వాగతం పలికారు. ఆమె వెంట నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, సీంఎవో ఓఎస్‌డీ శ్రీధర్ రావ్ దేవ్ పాండే, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, నీటి పారుదల శాఖ రిటైర్డ్ సీఈ వెంకట రామారావుతోపాటు 6వ ప్యాకేజీ ఈఈ నూనె శ్రీధర్, పెద్దపల్లి జేసీ వనజాదేవి, పెద్దపల్లి జోన్ డీసీపీ సుదర్శన్ గౌడ్ ఉన్నారు.

వచ్చే వానాకాలం కల్లా మిడ్‌మానేరుకు..
ఆరో ప్యాకేజీలో రెండు మోటార్ల వెట్న్ విజయవంతంకావడంతో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు, ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి నీటిని అందించే ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మించారు. ప్రస్తుతం నందిమేడారం పంపులు పని చేస్తుండడంతో ఎల్లంపల్లికి పై నుంచి వచ్చే వరదనీటిని నంది మేడారం రిజర్వాయర్‌లోకి తరలించి అక్కడి నుంచి ప్యాకేజీ-7, ప్యాకేజీ-8 ద్వారా మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ వరద కాలువకు తరలించేందుకు మార్గం సుగమమైంది.

152
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles