తిరిగి తిరిగీ అలసిపోయిన..

Fri,April 26, 2019 01:06 AM

గన్నేరువరం: ఐదు గుంటల భూమికి నేను 20 ఏళ్ల నుంచి కబ్జాకున్నా.. సదరు భూమిని పాసుబుక్కుల ఎక్కియాలని ఏళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా.. అయినా రెవెన్యూ అధికారులు కనికరించడం లేదు అంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. నమస్తే తెలంగాణ ధర్మగంటను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆయన మాటల్లోనే.. నా పేరు చాడ రాజిరెడ్డి. మాది గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామం. గ్రామంలోని సర్వేనెం 247ఏ లో ఎకరం 25 గుంటల భూమిని 30 ఏళ్ల క్రితం నా తండ్రి చాడ రాజమల్లారెడ్డి చాడ హన్మయ్య దగ్గర కొనుగోలు చేసిండు. అనంతరం ఆ కాలంలోనే జమాబంధి అమలు చేయించుకున్నడు. అప్పుడు ఇచ్చిన పాసు పుస్తకంలో 65 గుంటలు నమోదైనప్పటికీ కొత్త పాసు పుస్తకంలో, వన్‌బీ లోమాత్రం 60 గుంటలే వస్తున్నది. మా నాన్న మరణానంతరం ఆ భూమిని నేను నా సోదరులు విరాసత్ చేసుకున్నం. మాకు ఒక్కొక్కరికి 0.22 గుంటలు, చాడ సత్యనారాయణ 0.21 1/2, చాడ రంగారెడ్డికి 0.21 1/2 గా నమోదైంది. కానీ, ఆన్‌లైన్‌లో మా ముగ్గురి భూమి ఒక్కొక్కరికి కేవలం 0.20 గుంటలు అనే వస్తున్నది. అప్పటి నుంచే ఈ విషయాన్ని (10 ఏళ్ల క్రితం) అధికారుల దృష్టికి తీసుకపోయినం.

ఇద్దరు సోదరుల భూమిని కూడా నేనే కొనుగోలు చేసి, నా భార్య చాడ లోకేశ్వరి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించిన. కొత్త పాసు పుస్తకంలో కేవలం నా పేరు మీద 20 గుంటలు, నా భార్య కొత్త పాసు పుస్తకంలో 40 గుంటలు మాత్రమే నమోదయినట్లు వస్తున్నది. ఇద్దరికి కలిపి 5 గుంటలు పాసు పుస్తకాల్లో నమోదు కావాల్సి ఉన్నదని సంబంధిత అధికారుల చుట్టూ చాలా కాలంగా తిరుగుతున్న. రెండేళ్ల కిందట కలెక్టర్ కార్యాలయంలో సైతం దరఖాస్తు, ఫిర్యాదు చేసిన. కానీ, నా భూమిని నా పాసు పుస్తకంలో ఎక్కించడం లేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో సైతం దరఖాస్తు చేసుకొని అధికారుల దృష్టికి తీసుకుపోయినా పనికాలేదు. 20 ఏళ్లసంది కాస్తుకు, కబ్జాకు ఉన్నా పని కాకపోవడంతో ధర్మగంటను ఆశ్రయించిన. ఇప్పుడైనా నాపని పూర్తి చేస్తారని ఆశిస్తున్న.

ఎనిమిది నెలల సంది తిప్పుకుంటున్నరు
..పై చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు పసెడ్ల కనుకమ్మ. గ్రామం సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి. భర్త రాజయ్య, కొడుకు కుమార్, బిడ్డలు స్వప్న, రమ ఉన్నరు. పదేండ్ల కింద ఎలిగేడు మండలం బురహాన్‌మియాపేటలో సర్వే నెంబర్ 113ల 38 గుంటల భూమి కొన్నది. పాసు బుక్కు ఉన్నది. అప్పటి నుంచి సాగు చేసుకుంట బతుకుతున్నది. అయితే మొన్నటి భూ దస్ర్తాల ప్రక్షాళన తర్వాత అధికారులు పట్టా బుక్కు ఇయ్యలేదనీ, ఆఫీసుకు వోతే ఆన్‌లైన్ కాలేదని అంటున్నరని ఆమె వాపోయింది. వీఆర్వో ఇప్పుడు చేస్తం.. అప్పుడు చేస్తం అన్నడు. తీరా బదిలీ అయి వెళ్లిపోయిండు అని ఆరోపించింది. ఎనిమిది నెలలైతంది తిరుగుతున్నా ఎవలూ పట్టించుకుంటలేరని చెబుతున్నది. ఈ విషయమై ఎలిగేడు తాసిల్దార్‌ను సంప్రదించగా, సమస్య ఇప్పటివరకు తన దృష్టికి రాలేదన్నారు. పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుని పట్టా బుక్కు ఇస్తామని చెప్పారు.
- సుల్తానాబాద్ రూరల్

227
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles