ఏసీబీ వలలో రెవెన్యూ చేపలు

Wed,April 24, 2019 01:29 AM

* భూమి కన్వర్షన్‌కు 20వేలు డిమాండ్
* డబ్బులు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సర్వేయర్, ఆయన అసిస్టెంట్
* కరీంనగర్‌కు కోర్టుకు తరలింపు
* వారం క్రితమే ఫిర్యాదు: డీఎస్పీ భద్రయ్య
వేములవాడ రూరల్: లంచం తీసుకుంటుండగా వేములవాడ మండలం సర్వేయర్‌ను, ఆయన అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసేందుకు 20 డిమాండ్ చేయగా, బాధితులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఆ శాఖ అధికారులు మాటువేసి వారిని పట్టుకున్నారు. కరీంనగర్ కోర్టుకు తరలించారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాల ప్రకారం.. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ కాలనీకి చెందిన చల్ల బాలరాజు, తూరుపాటి శంకర్ తెట్టకుంట శివారులో ఇటీవల ఐదు ప్లాట్లను కొనుగోలు చేశారు. అవి వ్యవసాయం పరిధిలో ఉండగా వాటిని నాలా కన్వర్షన్‌గా చేయించుకోవాలని భావించారు. అందులో భాగంగా మీసేవలో దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వేములవాడ తాసిల్దార్‌ను వారు కలవగా ఆ ఫైల్‌ను సర్వేయర్ చూసుకుంటాడని చెప్పిపంపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న తాసిల్ సర్వేయర్ సత్యనారాయణ తెట్టకుంటలోని వారి ప్లాట్ల వద్దకు వెళ్లి కొలిచాడు. అనంతరం సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ప్లాట్ల యజమానులకు అందజేయాల్సి ఉన్నా ఇవ్వలేదు. అందుకోసం ఒక్కో ప్లాట్‌కు 5వేలు ఇవ్వాలని బాధితులు బాలరాజ్, శంకర్‌ను సర్వేయర్ సత్యనారాయణ డిమాండ్ చేశారు. దీంతో లంచం ఇచ్చుకోలేమని వారు మొరపెట్టుకున్నా సర్వేయర్ వినలేదు. ఐదు ప్లాట్లకు కలిపి 20వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. దీంతో సర్వేయర్ సత్యనారాయణ లంచం అడుగుతున్నాడని బాధితులు బాలరాజు, శంకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

* రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత..
బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. వేములవాడ రెవెన్యూ కార్యాలయం వద్ద మధ్యాహ్నం నుంచే కాపు కాశారు. సర్వేయర్ లేకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే వేచి చూశారు. తీరా సర్వేయర్ సత్యనారాయణ, తన అసిస్టెంట్ శ్రీనివాస్‌తో కలిసి ద్విచక్రవాహనంపై రాగా అనుకున్న విధంగా బాలరాజ్, శంకరయ్యకు అధికారులు డబ్బులు ఇచ్చి పంపించారు. బాధితులు సర్వేయర్‌ను కలిసి 20వేల లంచాన్ని ఇవ్వబోగా వెనక కూర్చోన్న తన అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఇవ్వాలని సూచించాడు. వారు ఆ డబ్బులను అతనికి అందజేయగా అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు సర్వేయర్, ఆయన అసిస్టెంట్‌ను రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తాసీల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. సర్వేయర్ సత్యనారాయణతో ఆయన అసిస్టెంట్ శ్రీనివాస్‌ను విచారించారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వెల్లడించారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు జయరామ్, సంజీవ్, ప్రశాంత్ పాల్గొన్నారు.

లంచమివ్వకుంటే తిరగాల్సిందే...
- బాధితులు బాలరాజు, శంకర్
తెట్టకుంట శివారులో కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ చేయాలని కోరగా సర్వేయర్ సత్యనారాయణ లంచం అడిగిండు. ఇవ్వకుంటే కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పిండు. దాదాపుగా 15 రోజుల నుంచి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నం. అయినా మా పని కాలే. ఎట్లయినా 20వేలు లంచం ఇవ్వాల్సిందేనని సర్వేయర్ డిమాండ్ చేసిండు. దీంతో ఏసీబీ అధికారులకు మొరపెట్టుకున్నం. వారు పట్టుకున్నరు.

నేను డబ్బులు అడగలేదు..
- సర్వేయర్ సత్యనారాయణ
ప్లాట్ సర్వేచేసిన విషయం వాస్తవమే. కానీ, నేను ఆ ప్లాట్ యజమానులు బాలరాజ్, శంకర్ వద్ద నుంచి డబ్బులు అడగలేదు. కావాలనే వారు నాపై కక్ష కట్టి నేను వద్దని చెప్పినా వినకుండా నా అసిస్టెంట్‌కు డబ్బులు ఇచ్చారు. కావాలనే నన్ను ఏసీబీ అధికారులకు పట్టించారు.

132
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles