రెండు విడతల్లో ప్రాదేశిక పోరు

Sun,April 21, 2019 01:15 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో జిల్లా, మండల ప్రజాపరిషత్తులకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 22న మొదటి విడతకు, 26న రెండో విడతకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. మొత్తంగా 15 జడ్పీటీసీ స్థానాలు, 178 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎన్నుకుంటారు. ఎంపీటీసీలు ఎంపీపీలను, జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు.

22న తొలివిడత నోటిఫికేషన్..
తొలి విడతలో ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, సైదాపూర్, వీణవంక, మానకొండూర్ మండలాల్లోని ఏ జడ్పీటీసీ నియోజకవర్గాలకు, 89 ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 22న ఆయా మండలాల పరిధిలో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న అప్పీలు, 28న నామినేషన్ల ఉపసంహరణ, 28న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మే 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

26న రెండో విడతకు..
రెండో విడతలో చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు, తిమ్మాపూర్ మండలాల పరిధిలోని 8 జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు, మరో 89 ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు 26న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ రోజు నుంచి 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న పరిశీలన, 30న అప్పీలు, మే 2న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మే 10న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.

27న ఓట్ల లెక్కింపు..
జిల్లాలో రెండు విడతల్లో నిర్వహించే జిల్లా, మండల ప్రజా పరిషత్తులకు నిర్వహించే ఎన్నికలకు సంబంధించి మే 27న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాతనే పరిషత్తు ఓట్లు లెక్కించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో నాలుగు చోట్ల పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది.

మండల కేంద్రాల్లోనే నామినేషన్లు..
అన్ని మండల కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారు. ప్రతి జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారి చొప్పున 15 మంది అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులను నియమించారు. మరో ముగ్గురు రిటర్నింగ్ అధికారులను రిజర్వులో ఉంచుతున్నారు. అలాగే ప్రతి మూడు ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఒకటి చొప్పున మొత్తం 60 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో రిటర్నింగ్ అధికారినీ, మరో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని నియమిస్తున్నారు. జడ్పీటీసీ ప్రాదేశిక నియోజవకర్గానికి రిటర్నింగ్ అధికారికి సహాయకులుగా ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు కేటాయించిన రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యహరిస్తారు. ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి 71 మంది (రిజర్వుడ్‌తో కలిపి) వీరికి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా 73 మంది (రిజర్వుడ్‌తో కలిపి) నియమించినట్లు జడ్పీ సీఈఓ డీ వెంకట మాధవరావు తెలిపారు. 325 ప్రాతంల్లో 990 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఆన్‌లైన్‌లోనూ దాఖలుకు చాన్స్
ఈసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించే విధానం అందుబాటులోకి వచ్చింది. నామినేషన్ పత్రాల కోసం రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. క్యాండిడెట్ పోర్టల్‌లోకి వెళ్లాలి. అందులో నాలుగు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఆన్‌లైన్ నామినేషన్ ఫర్ రూరల్ బాడీస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఎంపీటీసీ స్థానానికి, జడ్పీటీసీ స్థానానికి ఆన్‌లైన్ నామినేషన్ సమర్పించేందుకు ఆప్షన్ చూపెడుతుంది. ఏ అభ్యర్థి ఏ పదవికి పోటీ చేస్తున్నారో దానిని ఎంచుకుని ఆన్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేయాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ కాపీని ప్రింట్ తీసుకుని కచ్చితంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. కేవలం ఆన్‌లైన్ సబ్‌మిషన్ నామినేషన్ పరిగణలోకి తీసుకోరాదని ఎన్నికల సంఘం తెలిపింది. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ అమలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

డిపాజిట్ వ్యయం..
పరిషత్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు మొదలుకుని వ్యయ పరిమితిని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జనరల్ జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు 5 వేలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే వారు 2,500 డిపాజిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్‌కు కేటాయించిన జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు 2,500, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు 1,250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కులధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే డిపాజిట్‌లో రాయితీ ఉంటుంది. జనరల్ జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే డిపాజిట్ 2,500, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు 1,250 డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది.

బ్యాలెట్ పద్ధతి ద్వారానే..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించారు. ఇందుకు కావాల్సిన బ్యాలెట్ బాక్స్‌లను అందుబాటులో ఉంచారు. ఎంపీటీసీ స్థానానికి గులాబీ, జడ్పీటీసీ స్థానానికి తెలుపు రంగు పత్రాలు వినియోగించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులను ఎన్నికల సంఘం ప్రకటించింది.

అభ్యర్థుల వ్యయ పరిమితి..
ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు 4 లక్షలు ఎంపీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు 1.50 లక్షలుగా నిర్ణయించారు. అయితే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చుల లెక్కలను బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లించాలనే నిబంధనలు విధించింది.

161
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles