అంజన్న సన్నిధికి వెళ్తూ.. అనంతలోకాలకు..

Sat,April 20, 2019 12:51 AM

కొడిమ్యాల/ చొప్పదండి, నమస్తేతెలంగాణ : కఠిన నియమాలతో దీక్ష పూర్తి చేసుకొని అంజన్న సన్నిధిలో మాల విరమణ కోసం వెళ్తున్న ఇద్దరు హనుమాన్ దీక్షాపరులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. శుక్రవారం వేకువజామున పాదయాత్రగా వెళ్తున్న వారిపైకి గుర్తు తెలియని లారీ దూసుకురావడంతో ఒకరు అక్కడికక్కడే చినిపోగా, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు. వరుసకు సోదరులైన ఇద్దరు మృతి చెందడంతో చొప్పదండి మండలం భూపాలపట్నంలో అంతులేని విషాదం అలుముకున్నది. బంధువులు, పోలీసులు వివరాల మేరకు.. చొప్పదండి మండలం భూపాలపట్నానికి చెందిన పొన్నం అరుణ్(22), పులి రాజేందర్(22) ఇద్దరూ వరుసకు సోదరులు. అరుణ్ 21రోజులు, రాజేందర్ 11రోజుల హనుమాన్ మాల వేసుకున్నారు. చిన్నజయంతి సందర్భంగా కొండగట్టులో దీక్ష విరమించేందుకు గురువారం పాదయాత్రగా బయలుదేరారు. రాత్రి కొడిమ్యాల మండలం పూడూరు సాయిబాబా ఆలయంలో నిద్రించి, శుక్రవారం తెల్లవారుజామున నడక ప్రారంభించారు. మరికొద్ది సేపట్లో అంజన్న సన్నిధికి చేరుకోబోతున్న తరుణంలో దొంగలమర్రి వద్ద గుర్తుతెలియని లారీ వీరిపైకి దూసుకొచ్చింది. దీంతో అరుణ్‌కుమార్ అక్కడికక్కడే చనిపోగా, రాజేందర్‌ను దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు. అంజన్న సన్నిధిలో దీక్ష విరమించుకొని వస్తారనుకున్నవారు ఇలా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పెద్ద దిక్కును కోల్పోయి..
భూపాలపట్నానికి చెందిన పొన్నం తిరుపతవ్వ-మల్లేశం దంపతులకు కొడుకు అరుణ్, కూతురు ఉన్నారు. మల్లేశం గౌడవృత్తి చేసుకుంటూ, తిరుపతవ్వ రేషన్ దుకాణం నడిపిస్తూ తమ పిల్లలను చదివించారు. కొన్ని రోజుల క్రితం కూతురు వివాహం జరిపించారు. గతేడాది మల్లేశం చనిపోగా, డిగ్రీ చదివిన అరుణ్ ఊరిలోనే టెంట్‌హౌస్ నడిపిస్తూ తల్లికి సాయపడుతూ ఉండేవాడు. ఐదేళ్లుగా హనుమాన్ దీక్ష తీసుకుంటున్న అరుణ్, ఈ యేడాది కూడా 21 రోజులు దీక్ష తీసుకుని మాల విరమణ కోసం తోటి భక్తులతో పాదయాత్రగా వెళ్లాడు. ఇప్పుడు అనుకోనిరీతిలో మృతిచెందడంతో అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

చెట్టంత కొడుకును పోగొట్టుకొని..
గ్రామానికి చెందిన పులి స్వరూప-రాములు దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించారు. కూతురి వివాహం చేశారు. పెద్దకొడుకు రాజేందర్ ఇంటర్ పూర్తిచేసి డీజే నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు. అరుణ్‌తో కలిసి 11 రోజుల హనుమాన్ దీక్ష తీసుకున్నాడు. విరమణ కోసం స్నేహితుడితో కలిసి కొండగట్టుకు బయలుదేరి రోడ్డు ప్రమాదం రూపంలో బలయ్యాడు. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది.

ఎమ్మెల్యే దిగ్భ్రాంతి
అరుణ్‌కుమార్, రాజేందర్ మృతి వార్త తెలిసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఫోన్‌లో పరామర్శించి, ఇద్దరి మృతికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతిమ సంస్కారాలకు 10వేల చొప్పున ఇవ్వాలని సర్పంచ్ ఎలేటి లావణ్య, తిరుపతిరెడ్డికి ఎమ్మెల్యే సూచించడంతో వారు ఆర్థిక సాయం చేశారు.

101
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles