రెవెన్యూ లీలలు.. ఐదేళ్లుగా పోరాటం

Fri,April 19, 2019 02:56 AM

- ఆధారాలు లేకుండానే రికార్డుల మార్పులు
- ఐదున్నర గుంటలు అమ్మితే 30గుంటలకు పట్టా
- న్యాయం కోసం రైతు నర్సింహారెడ్డి ప్రదక్షిణలు
- ఇద్దరు తహసీల్దార్లు మారినా కదలని దస్ర్తాలు
- ఏడాది క్రితమే నిరసన తెలిపినా స్పందించని అధికారులు
- ధర్మగంట, సోషల్‌మీడియాను ఆశ్రయించడంతో కదలిన యంత్రాంగం

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ గంగాధర ) గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామ రైతు పటేల్ నర్సింహారెడ్డికి గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 1009లో 27 గుంటల వ్యవసాయ భూమి ఉంది. తన కుటుంబ అవసరాల నిమిత్తం ఐదున్నర గుంటల స్థలాన్ని 1997లో అదే గ్రామంలోని కంకణాల కృష్ణారెడ్డికి విక్రయించారు. భూమి విక్రయించినా 2011-12 వరకు మొత్తం స్థలం రికార్డుల్లో నర్సింహారెడ్డి పేరుపైనే ఉంది. ఈ సమయంలో తాను విక్రయించిన ఐదున్నర గుంటల స్థలాన్ని మినహాయించి మిగిలిన స్థలాన్ని తన పేరుతో ఉంచాలని అధికారులను కోరాడు. కానీ, 2013-14లో విక్రయించిన ఐదున్నర గుంటల స్థలం కాకుండా ఏకంగా 30 గుంటల స్థలాన్ని కృష్ణారెడ్డి పేరుపైకి మార్చి రికార్డుల్లోకి ఎక్కించారు. అతని పేరుతో పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారు. విషయం తెలుసుకున్న నర్సింహారెడ్డి తనకు అన్యాయం జరిగిందంటూ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడిగా తిరుగుతున్నాడు. చివరకు 2018 మే 10న గట్టుభూత్కూర్ గ్రామంలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారుల ముందు తనకు అన్యాయం చేసిన అధికారులను సస్పెండ్‌చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డు ప్రదర్శిస్తూ నిరసన తెలిపాడు. ఆ మేరకు సమస్యను పరిష్కరిస్తామని అప్పటి ఎమ్మార్వో చెప్పి వెళ్లాడు. మళ్లీ కథ మొదటికే వచ్చింది. చివరకు నమస్తే తెలంగాణ ధర్మగంటకు ఫిర్యాదుచేయడంతోపాటు తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా ద్వారా గురువారం వివరించాడు.

ఈ విషయం తెలుసుకున్న అధికారయంత్రాంగం ఆగమేఘాల మీద కదిలింది. గంగాధర ఎమ్మార్వో కవిత, ఇతర అధికారులు గ్రామానికి వెళ్లి విచారణ జరిపి.. జరిగిన అన్యాయాన్ని గుర్తించారు. ఆ మేరకు కృష్ణారెడ్డిపై ఉన్న స్థలంలో న్యాయంగా నర్సింహారెడ్డికి రావాల్సిన స్థలం వివరాలను పేర్కొంటూ ఎమ్మార్వో కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. నిజానికి గంగాధర మండలంలో గతంలో పనిచేసిన ఆర్‌ఐ సత్యనారాయణ, వీఆర్వో నరహరి తనకు అన్యాయం చేశారని పేర్కొంటూ అప్పటి తహసీల్దార్ రాజేశ్వరికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విచారణ చేసినా.. ఫైలు కదలలేదు. తనకు అన్యాయం చేసిన అధికారులను సస్పెండ్‌చేయాలని ప్లకార్డు ప్రదర్శించిన సమయంలోనూ న్యాయం చేస్తామని వెళ్లిన అప్పటి సరిత అనే ఎమ్మార్వో పట్టించుకోలేదు. చివరికి తన భూమిని కృష్ణారెడ్డి పేరుతో రికార్డుల్లోకి ఏ ఆధారాలతో ఎక్కించారో తెలుపాలని కోరుతూ 2019 మార్చి 2న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెడితే.. తమ వద్ద అందుకు సంబంధించిన రికార్డుల్లేవని పేర్కొంటూ సమాధానం ఇచ్చారే తప్ప, వాస్తవం ఏమిటీ? అన్నదానిపై ఆరా తీయలేదు. ప్రస్తుతం ఇటువంటి అంశాలపై నమస్తే తెలంగాణ ఏర్పాటుచేసిన ధర్మగంటను ఆశ్రయించారు.

ఆగమేఘాల మీద విచారణ..
నమస్తే తెలంగాణ ఏర్పాటు చేసిన ధర్మగంటను ఆశ్రయిస్తూనే గురువారం తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా వివరించాడు. విషయం తెలుసుకున్న అధికారయంత్రాంగం హుటాహుటిన గ్రామానికి వెళ్లింది. తహసీల్దార్ కవిత సారథ్యంలో అధికారులు గ్రామానికి వెళ్లి విచారణ నిర్వహించారు. స్వయంగా కృష్ణారెడ్డి కూడా ఆ భూమి తనది కాదని ఒప్పుకున్నాడు. ఆ మేరకు గ్రామస్తుల సమక్షంలోనే నివేదిక తయారు చేసిన ఎమ్మార్వో ఆ రిపోర్టును కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు పంపించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి వివరాలు ఆరా తీశారు. ఈ విషయంలో త్వరలోనే న్యాయం చేస్తామని నమస్తే తెలంగాణతో తెలిపారు.

ధర్మగంట రైతులకు వజ్రాయుధం
- పటేల్ నర్సింహరెడ్డి
భూ సమస్యల పరిష్కారం కోసం నమస్తే తెలంగాణ ధర్మగంట పేరుతో ప్రచురిస్తున్న వరుస కథనాలు తన లాంటి ఎంతో మంది రైతులకు ధైర్యాన్ని ఇస్తున్నాయని పటేల్ నర్సింహారెడ్డి చెప్పారు. పనిచేసుకుంటునే బతికే తమలాంటి అన్నదాతలు ఎంతో మంది అధికారుల మాయజాలానికి బలవుతున్నారనీ, ధర్మగంటకు ఫిర్యాదుచేసిన విషయాన్ని తెలుసుకొని అధికారులు కదలి రావడం సంతోషంగా ఉందన్నారు. తన లాంటి రైతులకు ధర్మగంట వజ్రాయుధంలా మారుతుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. అయితే అన్యాయం చేస్తూ రూ.లక్షలు దండుకొని వెళ్తున్న అధికారులు ఎక్కడున్నా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పు చేసి వెళ్లిపోయిన అధికారులను విడిచి పెడితే వారు మరోచోట తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుందనీ, ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి అక్రమాలకు పాల్పడిన అధికారులపైనే చర్యలు తీసుకోవాలని కోరారు.










201
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles