అకాల వర్షం.. అన్నదాతకు నష్టం

Thu,April 18, 2019 01:15 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) జిల్లాలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలకు నష్టం తెచ్చిపెట్టింది. పిడుగుపాటుతో ఒక రైతు తనువు చాలించగా పలు చోట్ల పాడి పశువులు మృత్యువాతపడ్డాయి. వరి పంట చేతికి వచ్చే సమయంలో నేల రాలింది. అనేక చొట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వానకు తోడు అతి వేగంతో గాలి వీయడంతో పలు చోట్ల ఇంటిపై కప్పులు కొట్టుకోపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఏడు మండలాల్లో ప్రభావం
జిల్లాలోని ఏడు మండలాల్లో అకాల వర్షం ప్రభావం చూపింది. వీణవంక మండలం ఎల్బాక, గంగారం, బొంతుపల్లి, గన్ముక్కుల, వీణవంక, నిర్సంగాపూర్, వల్భాపూర్‌తో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసింది. 2,500 నుంచి 3 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసి ఉంటుందని ప్రాథమికంగా తెలుస్తోంది. సైదాపూర్ మండలం అమ్మనగుర్తి, గోనెల మొగిలికి చెందిన పాడి పశువుపై పిడుగు పడి మరణించింది. సైదాపూర్, వెన్కెపల్లి, బొమ్మకల్, రాయికల్, శివరాంపల్లిలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి పోయింది. గొడిశాల తదితర గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో కొంరయ్య అనే రైతుకు చెందిన పాడి ఆవు పిడుగుపడి మృత్యువాత పడింది. కేశవపట్నం, ఎరడపల్లి, అంబాల్‌పూర్, ఆముదాలపల్లి, లింగాపూర్, మొలంగూర్ గ్రామాల్లో వరిపైరు నేలకొరిగింది. తాడికల్, కేశవపట్నంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, మక్తపల్లి, పోరండ్ల నల్లగొండ గ్రామాల్లో వేగంగా గాలులు వీచాయి. నల్లగొండ గ్రామంలో బేతి సంతోష్ రెడ్డి అనే రైతుకు చెందిన సుమారు వెయ్యి గిరిరాజ కోళ్లు మృత్యువాత పడ్డాయి. మానకొండూర్ మండలం కొండపల్కల, కెల్లేడు, మద్దికుంట, పోచంపల్లి, దేవంపల్లి, గంగిపల్లిలో వరిపైరు నేలకొరిగింది. కొండపల్కల కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిపోయింది. చిగురుమామిడి మండలం సీతారాంపూర్‌లో ఒక రైతుకు చెందిన ఎద్దు మృత్యువాత పడింది. మానకొండూర్, వీణవంక తదితర మండలాల్లో వ్యవసాయ అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. గురువారం ప్రాథమిక అంచనా వేస్తామని అధికారులు వెల్లడించారు.

పిడుగుపాటుతో రైతు మృతి
సైదాపూర్: మండలంలోని బొమ్మకల్ గ్రామంలో రైతు చిలువేరు సమ్మయ్య పిడుగుపాటుతో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు సమ్మయ్య గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ భూమి వద్దకు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాడు. బుధవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడడంతో రైతు సమ్మయ్య అక్కడి కక్కడే మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురున్నారు.

199
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles