పరిషత్ పోరులో మంత్రులదే కీలక పాత్ర

Tue,April 16, 2019 02:30 AM

- ఎన్నికల్లో సమన్వయంతో ముందుకుసాగాలి
- క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి దాకా అందరినీ కలుపుకొనిపోవాలి
- అన్నిస్థానాల్లోనూ గులాబీ జెండా ఎగురాలి
- కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల కోఆర్డినేటర్‌గా మంత్రి ఈటల
- పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్‌గా మంత్రి కొప్పుల
- పారదర్శక పాలనకు పెద్దపీట
- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి
- గ్రామాల రూపురేఖలు మార్చాలి
- టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో అధినేత కేసీఆర్ దిశానిర్దేశం
- ఉమ్మడిజిల్లా ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల చైర్మన్లు, ముఖ్య నాయకుల హాజరు

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) పరిషత్ ఎన్నికలతోపాటు ఆ తదుపరి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఉపదేశించారు. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయడంతోపాటు పార్టీ సిద్ధాంతాలు, నిర్ణయాలకు కట్టుబడి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రణాళికలపై సోమవారం టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ కార్యవర్గ సభ్యులతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అధినేత కేసీఆర్ సమక్షాన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ప్రధానంగా మండల, జిల్లా పరిషత్‌తోపాటు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని చోట్లా గెలాబీ జెండా ఎగరాలనీ, ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా వ్యూహరచన చేయాలనీ, మంత్రులు పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోవడంతోపాటు ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులను ఇందులో భాగస్వాములను చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు అన్ని స్థానాల్లో గెలుపు బాధ్యతలు తీసుకోవాలనీ, అలాగే ఆయా ప్రాంతాల్లోని ముఖ్యనాయకులను సమన్వయం చేస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్యతను మంత్రులు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రణాళిక, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలను సమన్వయం చేసుకునేందుకు ఇద్దరు మంత్రులను కో ఆర్డినేటర్లగా నియమించారు. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల కో ఆర్డినేటర్‌గా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్‌గా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. ఇక నుంచి పరిషత్ ఎన్నికలకు సంబంధించి ప్రతి ప్రక్రియ వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి..
పరిషత్ ఎన్నికలే కాకుండా పలు అంశాలపై నాయకులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజలు అపార నమ్మకంతో అత్యధిక మెజార్టీనిచ్చి మనలను గెలిపించారనీ, వారి రుణం తీర్చుకోవడంతోపాటు వారు కోరుకుంటున్న అవినీతిరహిత పాలనను అందించడం కోసం పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్ విభాగాలతోపాటు మరికొన్ని విభాగాల్లో మార్పులు అవసరమనీ, త్వరలోనే చేయబోయే మార్పులను ప్రజల ముందుకు తెస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా పారదర్శక పాలనను అందించేందుకు పెద్దపీట వేస్తున్నట్లుగా చెప్పిన కేసీఆర్, ఈ దిశలో తీసుకునే చర్యలకు అందరూ సహకరించాలని కోరారు. అంతేకాదు, మార్పులు అవసరం ఉన్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నట్లు పార్టీ నాయకులంతా చెప్పారు. ఆ మేరకు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా మార్పులు అవసరమే అని ముక్తకంఠతో వెల్లడించారు. సంస్కరణలు ఎవరికీ వ్యతిరేకం కాదనీ, ప్రజాసంక్షేమం కోసం పలు చర్యలు తీసుకోక తప్పదని సూచించారు. రానున్న మూడు నెలల్లో ప్రతి గ్రామం అద్దంలా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు అధినేత సూచించారని తెలిపారు. ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం వహించినా వారిపై చర్యలుంటాయనీ, అటువంటి సమయంలో మళ్లీ పైరవీలకు రావద్దంటూ సీఎం గట్టిగానే చెప్పినట్లు సమాచారం.

అందరినీ కలుపుకొనిపోవాలి..
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అందరం అలవాటు చేసుకోవాలని పార్టీ ముఖ్య శ్రేణులకు అధినేత కేసీఆర్ హితోపదేశం చేశారు. పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి కార్యకర్తలు, నాయకులను కలుపుకొని వెళ్లాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుందనీ, ఎవరూ ఎవరినీ విస్మరించరాదని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లోనూ అందరినీ కలుపుకొని వెళ్లాలనీ, అలా చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని సీఎం మార్గనిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ సంస్థల చైర్మన్లు, ఇతర ప్రధాన నాయకులు తోటివారిని కలుపుకొని వెళ్లడమేకాకుండా, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం, గౌరవం ఇవ్వాలని సూచించిటన్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి చేసిన దిశానిర్దేశం పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎంతగానో దోహద పడుతుందని పేర్కొన్నాయి. ఈ సమాశేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్లు, సంస్థల చైర్మన్లు, ఇతర ప్రధాన నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

105
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles