పెద్దపల్లి జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా మధు

Tue,April 16, 2019 02:29 AM

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పేరును టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ ధ్రువీకరించారు. మండల పరిషత్ ఎన్నికల వేడి రగులుతున్న సమయంలో ఉమ్మడి జిల్లాలో తొలి చైర్మన్ అభ్యర్థిగా పుట్ట మధును ప్రకటించడం గమనార్హం. స్థానిక సంస్థల్లో పనిచేసిన అనుభవం పుట్ట మధుకు ఉంది. అలాగే పార్టీకి విధేయుడిగా పనిచేస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో మంథని జడ్పీటీసీగా పని చేసిన మధు 2014ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంథని నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా అయన మంథనిని చాలా అంశాల్లో అగ్రగామిలో నిలిపేందుకు నిర్విరామంగా శ్రమించారు. ప్రభుత్వ పథకాలను పేదలకు అందేలా చర్యలు తీసుకోవడంలో ముందు వరుసలో నిలిచారు. దశాబ్ధాల తరబడి కలగానే మిగిలిపోయిన ఎన్నో బ్రిడ్జిలను నిర్మించి ప్రజల కష్టాలు తీర్చారు. ఇవేకాదు..అనేక సంక్షేమ పథకాలను మారుమూల మండలం దాకా తీసుకెళ్లిన ఘనత పుట్ట మధుకు దక్కుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం భూసేకరణ వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారు. చారిటబుల్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.

2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో పుట్ట మధు మంథని ఎమ్మెల్యేగా ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయినా ఆత్మవిశ్వాసంతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఆయన వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ముందుకు వెలుతున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌నేత గెలుపే ధ్యేయంగా నియోజకవర్గ వ్యాప్తంగా పుట్ట మధు విస్తృత ప్రచారం చేశారు. ఈ సమయంలోనే రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలతో మంచి సఖ్యతతో పనిచేశారు. గతంలో ఎమ్మెల్యేతో పాటు ప్రస్తుతం కూడా పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించిన పార్టీ మధుకు జడ్పీచైర్మన్‌గా అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ఏర్పడుతున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పదవి కోసం అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ ధ్రువీకరించారు. ఈ క్రమంలో మధును జిల్లా పరిషత్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించేందుకు సీఎం నుంచి అనుమతి తీసుకున్నట్లుగా మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం..
మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన పుట్ట మధు ఇంటర్ దాకా చదివారు. మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రెసిడెంట్‌గా పనిచేసిన మధు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా మొదలైన రాజకీయ ప్రస్థానం రెడ్డి చెరువు నీటి సంఘం చైర్మన్‌గా, మంథని పట్టణంలోని ఎరుకల గూడెం ఎంపీటీసీగా అదే సమయంలో 2001నుంచి 2006వరకు మంథని ఎంపీపీగా పనిచేశారు. 2006నుంచి 2011వరకు మంథని జడ్పీటీసీగా పనిచేశారు. 2011ఏప్రిల్ 19న తన తల్లి పుట్ట లింగమ్మ పేరు మీద చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని పూర్వపు ఏడు మండలాలైన మంథని, ముత్తారం, కమాన్‌పూర్, మల్హర్, కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్ మండలాల్లో ప్రతి ఇంటికీ ఏదో విధంగా ఆసరాగా నిలిచారు.

126
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles