పరిషత్ పోరుకు సై

Sun,April 14, 2019 01:55 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థలైన జిల్లా, మండల ప్రజా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు జడ్పీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాను రూపొందించిన అధికారులు బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, అవసరమైన ఇతర సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. జిల్లాల విభజన జరిగినా ఇన్నా ళ్లూ జడ్పీని మాత్రం ఉమ్మడి జిల్లా పరిధిలోనే కొనసాగించారు. ప్రస్తుతం ఏ జిల్లాకు ఆ జిల్లాలో జడ్పీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు కూడా కొత్త జిల్లాల వారీగానే చేయనునున్నారు. ఇందులో భాగంగా విభజిత కరీంనగర్ జిల్లాలో 15 జడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

రెండు విడతల్లో ఎన్నికలు
రాష్ట్రంలో మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినా జిల్లాలో రెండు విడతల్లోనే నిర్వహిస్తామని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. మొదటి విడతలో ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, సైదాపూర్, వీణవంక, మా నకొండూర్ మండలాల్లో, రెండో విడతలో చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు, తిమ్మాపూర్ మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇది వరకే ఎన్నికల కమిషన్‌కు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రతిపాదనలు పంపించారు. మొదటి విడతలో 7 జడ్పీటీసీ స్థానాలు, 89 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో 8 జడ్పీటీసీ స్థానాలు మరో 89 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో 2,37,729 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు 484, రెండో వి డతలో 2,52,931 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు 506 చొప్పున జిల్లాలో మొత్తం 4,90,660 మంది ఓటర్లు ఓటు వేసేందుకు వీలుగా 990 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేస్తున్నారు. ఎంపీటీసీ స్థానాలకు గులాబీ రంగు, జడ్పీటీసీ స్థానాలకు తెలుపు రంగు బ్యాలెట్లు వినియోగించనున్నారు.

నాలుగు చోట్ల కౌంటింగ్ కేంద్రాలు
స్థానిక సంస్థలకు వచ్చే నెలలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉండగా, ఫలితాలు మాత్రం పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే వెల్లడించే అవకాశాలున్నాయి. దీంతో చాలా రోజు లు స్ట్రాంగ్ రూంల్లోనే బ్యాలెట్ బాక్స్‌లు భద్రపర్చాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో నాలు గు చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జడ్పీ సీఈఓ వెంకట మాధవరావు శనివారం కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై పరిశీలన జరిపారు. చొప్పదండి మండలం రుక్మాపూర్‌లోని తెలంగాణ మో డల్ స్కూల్‌లో చొప్పదండి, రామగుడు, గంగాధర మండలాలకు సంబంధించిన కౌంటింగ్ కేం ద్రాన్ని, మానకొండూర్ మండలం దేవంపల్లిలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, హుజూరాబాద్, మానకొండూర్, శంకరపట్నం మండలాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని, తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు సంబంధించిన మరో కౌంటింగ్ కేంద్రాన్ని కరీంనగర్‌లో ఏదో ఒక చోట ఏర్పాటు చేయనున్నారు. రెండు మూడు రోజుల్లో కౌంటింగ్ కేంద్రా ల ఏర్పాటు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు.

18 తర్వాతనే నోటిఫికేషన్
పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా, ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో కమిషనర్ కలెక్టర్లు, ఎస్పీ(సీపీ)లతో సమావేశమవుతున్నా రు. ఆ తర్వాతనే నోటిఫికేషన్ విడుదల కావచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 22న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరిట ఒక పోస్టు హల్‌చల్ చేస్తోంది. అయితే జడ్పీ అధికారులు మాత్రం అది అధికారికమైనది కాదని స్పష్టం చేస్తున్నారు. ఒక వేళ ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ అయితే మాత్రం వచ్చే నెల 6న మొదటి విడత, 10న రెం డో విడతకు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

153
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles