స్ట్రాంగ్‌రూంలకు పటిష్ట భద్రత

Sat,April 13, 2019 06:25 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):గురువారం జరిగిన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య భద్రపరిచామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్సారార్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో భద్రపరిచిన ఈవీఎంలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ, కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలైన కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో వినియోగించిన ఈవీఎంలను ఎస్సారార్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామనీ, స్ట్రాంగ్ రూంలకు సీల్ వేసి, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. మే 23న జరిగే కౌంటింగ్ వరకు స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట బందోబస్తు ఉంటుందని వివరించారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఎస్సారార్ కళాశాలలో నిర్వహిస్తామనీ, కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల సాధారణ పరిశీలకుడు టీకే షిబు, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, ఎన్నికల ప్రత్యేకాధికారిణి ప్రావీణ్య, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, ఆర్డీవోలు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పీ రాజ్‌కుమార్, పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

149
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles