ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించాం

Sat,April 13, 2019 06:24 AM

-లోక్‌సభ సాధారణ ఎన్నికల పరిశీలకుడు టీకే షిబు
(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల శాతం, టెండర్ ఓట్లు, చాలెంజ్డ్ ఓట్లు, ఏఎస్‌డీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల్లో 50 శాతం కంటే ఎక్కువ, 50 శాతానికి మించి 15 శాతం ఎక్కువ, 50 శాతానికి 15 శాతం తక్కువగా పోలైన ఓట్ల శాతం సరళిని పరిశీలించామని కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల సాధారణ ఎన్నికల పరిశీలకుడు టీకే షిబు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్సారార్ కళాశాలలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రావీణ్య, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల శాతం పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలై కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని ఓట్ల శాతాన్ని పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఐదు శాతం మించిన టెండర్ ఓట్లు, చాలెంజ్డ్ ఓట్లను ప్రిసైడింగ్ అధికారుల డైరీ రిపోర్టు, సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్) రిపోర్టు కాపీలతో పోల్చి చూశారు.

ఏఎస్‌డీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డిలీటెడ్) ఓటర్ల జాబితాలో ఉండి ఓటు హక్కు వినియోగించుకున్న వారి నుంచి గుర్తింపు కార్డులు ప్రిసైడింగ్ అధికారులు చూశారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించారు. 17ఏ, 17 సీ ఓట్ల వినియోగంపై సమగ్రంగా పరిశీలన చేశామనీ, అన్ని సరిగ్గానే ఉన్నాయని నిర్ధారించినట్లు సాధారణ ఎన్నికల పరిశీలకుడు టీకే షిబు, జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలోనే పరిశీలన కార్యక్రమాన్ని పూర్తి చేశామనీ, నివేదికను ఎన్నికల సంఘానికి పంపిస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్, ఎన్నికల ప్రత్యేకాధికారిణి ప్రావీణ్య, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, సిద్దిపేట డీఆర్వో చంద్రశేఖర్, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఆనంద్‌కుమార్, చెన్నయ్య, వెంకటేశ్వర్‌రావు, అనంతరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పీ రాజ్‌కుమార్, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles