69.40శాతం పోలింగ్

Fri,April 12, 2019 01:36 AM

- మానకొండూర్‌లో అత్యధికంగా 73.79 శాతం ఓటింగ్
- కరీంనగర్‌లో అత్యల్పం 60.04 శాతం
- స్ట్రాంగ్‌రూంలకు చేరిన ఈవీఎంలు

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి/ కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) కరీంనగర్ లోక్‌సభా సమరం ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా సాగింది. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్ సాగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైనా, గంటగంటకూ పుంజుకున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు వచ్చిన పోలింగ్ సరళిని చూస్తే ఇంచుమించు 8 శాతం మాత్రమే నమోదైంది. ఈ నేపథ్యంలో పోలింగ్ భారీగా తగ్గుతుందన్న ఆందోళన అన్ని పార్టీల్లోనూ వ్యక్తమైంది. ఇక 50 శాతం అవుతుందా? అనే అనుమానం కనిపించింది. కానీ, 10 గంటల నుంచి క్రమేపీ పుంజుకుంటూ వచ్చింది. కొత్తగా ఓటు వచ్చిన యువతీయువకుల నుంచి పండు ముసలి దాకా తరలివచ్చారు. కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి వసతితోపాటు దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పోటెత్తారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వచ్చి, ఓటేయడంతో 69.40 శాతం పోలింగ్ నమోదైంది. అయితే పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ ఎక్కువగా జరిగింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మానకొండూరులో అత్యధికంగా 73.79 శాతం నమోదైతే, పట్టణ ఓటర్లు అత్యధికంగా ఉన్న కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యల్పంగా 60.04 శాతం నమోదైంది.

మహిళాలోకం చైతన్యం..
పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 16,50,893 ఓటర్లుండగా, ఇందులో 8,15,230 మంది పురుషులు, 8,35,629 మంది మహిళా ఓటర్లున్నారు. నిజానికి పురుషులకన్నా మహిళలే అధికంగా ఉన్నా, ఓటింగ్‌కు వచ్చేసరికి మహిళా ఓటింగ్ తగ్గుతుందని భావించారు. కానీ, ఎండను లెక్క చేయకుండా మహిళలు చైతన్యం చూపారు. 68.51 శాతం పురుషులు ఓట్లు వేస్తే, 70.28 శాతం మహిళలు ఓట్లు వేసి, మహిళా చైతన్యాన్ని చాటిచెప్పారు.

ఓటేసిన ప్రముఖులు..
లోక్‌సభ అభ్యర్థులతోపాటు ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, ఆయన సతీమణి డాక్టర్ మాధవి, ఇద్దరు తనయులతో కలిసి ముకరంపురలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మంకమ్మతోటలోని యునైటైడ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో, బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ దంపతులు విద్యానగర్‌లోని సాధన స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దంపతులు, జేసీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ దంపతులు సీపీ కమలాసన్‌రెడ్డి, మేయర్ రవీందర్‌సింగ్ దంపతులు, సబ్ కలెక్టర్లు రాజర్షిషా, ప్రావీణ్య కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దంపతులు స్థానిక క్రిస్టియన్ కాలనీలో, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు దంపతులు రాంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి వాణినీకేతన్ స్కూల్‌లో, ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్‌హుస్సేన్ స్థానిక బాలికల ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశారు. రాజ్య సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ తమ స్వగ్రామమైన హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో ఓటు వేశారు. చొప్పదండి ఎమ్మెల్యే తన స్వగ్రామం గంగాధర మండలం బూరుగుపల్లిలో, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎమ్మెల్యేలు, అభ్యర్థుల పర్యవేక్షణ..
ఎన్నికల సరళిని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోపాటు ఎంపీ అభ్యర్థులు పర్యవేక్షించారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే గన్నేరువరం, గంభీరావుపేట, సిరిసిల్ల, ఎమ్మార్సీ బోయినపల్లి మండలం కొదురుపాక, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, ఎల్లారెడ్డిపేట, తిమ్మాపూర్, ఇల్లంతకుంట, పెద్దలింగాపూర్, అనంతారం, వంతడుపుల, కందికట్కూర్‌లో పోలింగ్ సరళిని పరిశీలించారు. మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగరంలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ శ్యాంప్రసాద్ లాల్, ఇతర అధికారులు ఎప్పటికపుడు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు.

స్రాంగ్ రూంలకు ఈవీఎంలు..
ఎన్నికల అనంతరం ఈవీఎంలను కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించారు. 207 రూట్లలో 230 మంది సెక్టోరల్ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను ఇక్కడికి తీసుకొచ్చారు. రాత్రి వరకు ఇక్కడికి చేరిన ఈవీఎంలను పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూంలకు కేంద్ర భద్రతా బలగాలతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో ఈవీఎంలను భద్రపర్చారు.

మే 23 వరకూ ఉత్కంఠ..
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం మొదటి విడతలోనే జరిగాయి. గురువారం పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. అన్ని రాష్ర్టాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 23న కౌటింగ్ చేయనుండగా, అప్పటిదాకా అభ్యర్థులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే ఫలితాల కోసం మునుపెన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొన్నది. 2014లో జమిలీ ఎన్నికలు జరిగినపుడు లేని టెన్షన్ ఇప్పుడు కనిపిస్తున్నది. తాము చేసిన ప్రచారం ఏ మేరకు ఫలిస్తుందో? అనుకున్న స్థాయిలో ఓట్లు వస్తాయా? రావా? ఎక్కడైనా పొరపాట్లు జరిగాయా? అన్న అంశాలను లోతుగా విశ్లేషిస్తున్నారు. బూత్‌లవారీగా, సామాజిక వర్గాలవారీగా లెక్కలు వేస్తూ గెలుపోటములను బేరీజు వేసుకుంటున్నారు. అయితే టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కేవలం లోక్‌సభ ఎన్నికలు జరిగిన సమయంలో 69.40 శాతం పోలింగ్ నమోదు కావడం గొప్ప విషయమన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్ తమకు భారీ మెజార్టీ తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు.

ఊపిరి పీల్చుకున్న అధికారులు..
నాలుగు జిల్లాలు, ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 2,181 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 10,032 మంది సిబ్బందిని నియమించి ఎన్నికలు నిర్వహించారు. 3,747 మంది స్థానిక, కేంద్ర పోలీసు బలగాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్‌అహ్మద్‌తోపాటు జేసీ శ్యాంప్రసాద్ లాల్, సీపీ కమలాసన్‌రెడ్డి, సబ్ కలెక్టర్లు రాజర్షిషా, ప్రావీణ్యతోపాటు మరో ముగ్గురు పరిశీలకులు పర్యవేక్షించారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఆర్డీవో స్థాయి అధికారిని రిటర్నింగ్ అధికారిగా నియమించారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్, కరీంనగర్ మండలం చామనపల్లి, దుర్శేడ్, జూబ్లీనగర్, బొమ్మకల్, గోపాలపూర్, సైదాపూర్ మండలం జాగీర్‌పల్లి, ముస్తాబాద్ మొర్రాయిపల్లి, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యతో ఈవీఎంలు మొరాయించినా, వెంటనే వాటిని సరిచేశారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా జరగడంతో ఇటు అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకపోవడంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు.

127
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles