తెలంగాణ గతిని మార్చే ఎన్నికలివి

Wed,April 10, 2019 01:08 AM

- ప్రజా సంక్షేమానికి పరితపించే పార్టీ టీఆర్‌ఎస్
- దేశమంతా తెలంగాణవైపే చూస్తున్నది
- 16 ఎంపీ సీట్లను సాధించి ఢిల్లీలో గులాబీ జెండాను ఎగరేస్తాం
- మంత్రి ఈటల రాజేందర్
- ఎంపీ అభ్యర్థిగా వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు
- కరీంనగర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : వినోద్‌కుమార్
- నగరంలో ఆఖరి రోజు భారీ ర్యాలీ
- వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికలు మోదీ, రాహుల్ ఎన్నికలని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. కానీ, ఇవి తెలంగాణ గతిని మార్చే ఎన్నికలు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉద్ఘాటించారు. ప్రచారంలో భాగంగా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వేలాదిమందితో నగరంలో భారీ ర్యాలీ తీశారు. సర్కస్ గ్రౌండ్ నుంచి బస్టాండ్ మీదుగా టవర్‌సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, గంగుల కమలాకర్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. టవర్‌సర్కిల్ వద్ద మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికలతో కేసీఆర్‌కు ఏం సంబంధం అంటూ కొందరు మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. మన హక్కులు మనకు దక్కాలన్నా, నిధులు రావాలన్నా టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలది అధికారం కోసం ఆరాటమనీ, తమది అభివృద్ధి కోసం పోరాటమని అభివర్ణించారు. ప్రజలకు 24 గంటల కరెంటు ఎలా ఇవ్వాలి, రైతులకు సాగునీరు ఏ విధంగా అందించాలి అనే దానిపైనే టీఆర్‌ఎస్ సర్కారు దృష్టి పెడుతుందన్నారు. గతంలో దేశంలో అభివృద్ధి అంటే గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర అని చూపించే వారనీ, కానీ, నాలుగున్నరేళ్లలోనే దేశం యావత్తు టీఆర్‌ఎస్‌వైపు చూసే విధంగా పనులు చేశామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 24 గంటల కరెంట్, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ 16 ఎంపీ సీట్లను సాధించి ఢిల్లీలో గులాబీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించిన వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఆదర్శంగా తీర్చిదిద్దుతా : వినోద్‌కుమార్
కరీంనగర్‌ను అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచి ఆదర్శంగా తీర్చిదిద్దుతాననీ, అప్పటి దాకా విశ్రమించబోనని ఎంపీ వినోద్‌కుమార్ ప్రతినబూనారు. ఈ ఐదేళ్లు ఎలాంటి మచ్చలేకుండా పనిచేశాననీ, మళ్లీ ఆశీర్వదిస్తే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని కోటి ఎకరాలకు నీరందించేదుకు అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పేద ల కోసం ఏ ఒక్క పథకమైన ప్రవేశపెట్టాడా? అని ప్రశ్నించారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా లాంటి వందల పథకాలు అమలు చేస్తుందన్నారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అభివృద్దిని పూర్తిగా విస్మరించాయన్నారు. 30 ఏళ్ల కిందటే కాంగ్రెస్ పార్టీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తిని కోల్పోయిందని తెలిపారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణనుంచి 16 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని చెప్పారు.

మనోహరాబాద్ రైల్వే లైన్‌కు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపాదిస్తే అనంతరం వచ్చిన కాంగ్రెస్ దానిని మూలకు వేసిందని విమర్శించారు. కానీ, తాను గెలిచిన అనంతరం ఈ ఫైల్‌కు దుమ్ము దులిపి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయించామన్నారు. 550 కోట్ల నిధులు మంజూ రు అయ్యాయనీ, ఇప్పటికే గజ్వేల్ వరకు పనులు పూర్తి అయ్యాయన్నారు. త్వరలోనే కరీంనగర్ వరకు రైల్ లైన్ పనులు పూర్తి చేస్తామన్నారు. కరీంనగర్‌కు ఐదు జాతీయ రహదారులను తీసుకువచ్చానని తెలిపారు. ట్రిపుల్ ఐటీని సాధనకు కృషి చేస్తున్నామన్నారు. దీని కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామనీ, గెలిచిన అనంతరం దీనిని సాధించుకువస్తామన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ సాధించుకున్నామన్నారు. రానున్న రోజుల్లో వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. ఇప్పటికే ఈ పథకం కింద రూ. 250 కోట్లతో చేపట్టనున్న పనులకు టెండర్ల పక్రియ పూర్తి చేశామని చెప్పారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తు ఓటు వేసి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ర్యాలీలో జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ రమేశ్, మాజీ ఎమ్మెల్సీ సంతోశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles