ఐదు లక్షల మెజార్టీయే లక్ష్యం

Tue,March 26, 2019 01:39 AM

- ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలి
- పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- రాష్ట్రంలో 16 సీట్లూ గెలుస్తాం..
- కేంద్రంలో కీలకంగా మారుతాం
- టీఆర్‌ఎస్‌కు ఎవరూ పోటీ కాదు
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
- కేంద్రం నుంచి నిధులు, అనుమతులు సాధిస్తాం : ఎంపీ వినోద్
- మరోసారి సత్తా చూపించాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
- నగరంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ, టీఆర్‌ఎస్‌వీ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలకు హాజరు

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను 5 లక్షల మెజార్టీతో గెలిపించుకునేందుకు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. సోమవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తల విసృత్తస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి ఈటల మాట్లాడుతూ, పార్టీ ఎంత బలంగా ఉన్నా మనస్సు పెట్టి పని చేయకపోతే ఇబ్బందులు పడుతామన్నారు. కరీంనగరం ఓటర్లు అన్ని విషయాలూ ఆలోచిస్తారనీ, అందుకే ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి విసృత్తంగా తీసుకెళ్లి ప్రచారం సాగించాలన్నారు. ఈ సారి కరీంనగర్ నుంచి భారీ మెజార్టీ తీసుకురావాలని సూచించారు. గత ఎన్నికల్లో చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగాలన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్రంలో 16 సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో కీలకంగా వ్యవహరించడం ఖాయమన్నారు. ఈ ఎన్నికల్లో మనకు ఎవ్వరూ పోటీలో లేరనీ, కాని భారీ మెజార్టీ సాధించేందుకు కు కృషి చేయాలన్నారు.

కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తా: ఎంపీ వినోద్‌కుమార్
మరోసారి తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులతోపాటు ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు సాధించుకువస్తానని ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. 2014 పార్లమెంట్‌లో ప్రధాని మోదీ సభకు వచ్చిన మొదటి రోజే తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ సభను మొదటగా వాయిదా వేయించానని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలందరం కూడా ప్రతి సమస్యపై పోరాటం చేశామన్నారు. నీళ్ల కోసం పోరాటం చేసిన తెలంగాణకు రాష్ట్ర విభజన చట్టంలో ఒక్క ప్రాజెక్టుకు కూడా కాంగ్రెస్ జాతీయ హోదా ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. 16 ఎంపీ స్థానాలు గెలిస్తే తప్పనిసరిగా విభజన చట్టానికి సవరణలు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువస్తామని తెలిపారు. 30 ఏళ్ల కిత్రమే కాంగ్రెస్ పార్టీని ప్రజలు దూరంకొట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 1984 తర్వాత సొంతంగా ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేయలేదన్నారు. వాళ్ల నాయకుడే 2024 గురించి ఆలోచిస్తున్నానని చెబుతున్నారనీ, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. బీజేపీ కూడా ఒక్కసారి మాత్రమే సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని తెలిపారు. కేంద్రంలో టీఆర్‌ఎస్ కీలకంగా మారబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఒక్క చెప్పుకునేస్థాయి పథకాన్ని కూడా అమలు చేయలేకపోయిందన్నారు. కానీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు కల్యాణలక్ష్మి, రైతుబందు, రైతుబీమా ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. దేశంలోనే అత్యంత వేగవంతంగా పనులు సాగుతున్న రైల్వేలైన్ కొత్తపలి-మనోహరాబాద్ మాత్రమేనని తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో జాతీయ రహదారులు తీసుకువచ్చామనీ, నూతన రైళ్లను మంజూరు చేయించామని పేర్కొన్నారు. .

కరీంనగర్ సత్తా చూపించాలి: ఎమ్మెల్యే గంగుల
పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌కు ఎంత బలం ఉందో చూపించే విధంగా ఓట్లు పడాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ప్రజాసేవ అనేది ముఖ్యం కాదనీ, అధికారదాహంతోనే వారు పోటీలో ఉంటున్నారని విమర్శించారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వారిని ఓడించినా ఇప్పుడు మళ్లీ పోటీకి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు ఏ ఎన్నికలు వచ్చినా పోటీకి సిద్ధమవుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కూడా వారికి చుక్కెదురవుతుందని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి కేంద్రం వరకు ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయన్నారు. తెలంగాణలో ఏ ఎన్నికలైనా వార్ వన్‌సైడేనన్నారు. డిపాజిట్ల కోసమే కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎక్కువగా ఓట్లు వచ్చేందుకు పక్కా ప్రణాళికతో ప్రచారం సాగించాలన్నారు. నియోజకవర్గ పరిధిలో రోడ్‌షోలు, సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ రమేశ్, ఎంపీపీ వాసాల రమేశ్, నాయకులు ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, జమీలొద్దీన్, కోడూరి సత్యనారాయణగౌడ్, గండ్ర నళిని, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరికలు..
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కొడిమ్యాల రాధాకిషన్, నాయకులు ముల్కల ప్రవీణ్, జుబేర్, లక్ష్మీరాజం, రవీందర్‌తోపాటు మరో 50 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు.

105
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles