విద్యార్థులు అండగా నిలవాలి

Tue,March 26, 2019 01:38 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న విద్యార్థి లోకం ఈ ఎన్నికల్లోనూ అండగా నిలిచి ఎంపీగా వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పద్మనాయక కల్యాణమంటపంలో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి టీఆర్‌ఎస్వీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి మాట్లాడుతూ, ఉద్యమ సమయంలో కరీంనగర్ విద్యార్థిలోకం అండతోనే తాము ముందుకుసాగామన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తల కృషితోనే టీఆర్‌ఎస్ పార్టీ గెలుపుబాటలో పయనిస్తోందన్నారు. ఈ సారి కూడా టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు ఎంపీల గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసుకొని, బాధ్యతలు తీసుకోవాలనీ, సైనికుల్లా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో 16 సీట్లు గెలిస్తే తప్పనిసరిగా కేంద్రంలో కీలకంగా మారుతామన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువు కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కరీంనగర్ నుంచి ఎంపీగా వినోద్‌కుమార్‌ను ఈసారి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు టీఆర్‌ఎస్వీ నాయకులు ముందుకు సాగాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గడపగడపకూ వెళ్లి ప్రచారం చేయాలని ఆయన సూచించారు.

మరింతగా అభివృద్ధి చేస్తా: ఎంపీ వినోద్
కరీంనగర్ ఎంపీగా ఈ ఐదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేశామనీ, రాష్ట్రంలోని అనేక సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకువచ్చేందుకు కృషి చేశామని ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. మరోసారి కరీంనగర్ నుంచి గెలిస్తే కేంద్రం నుంచి భారీ నిధులు తీసుకువస్తామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకురావడం వల్లే దేశంలో వివిధ బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని వివరించారు. రాష్ట్ర విభజన చట్టంలో అప్పటి కాంగ్రెస్ ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి ఉంటే, రూ. 50 వేల కోట్ల నిధులు వచ్చేవన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే కేంద్రంలో కీలకంగా మారి విభజన చట్టంలో సవరణ చేపట్టి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువస్తామన్నారు. ఇప్పటికే కరీంనగర్‌లో కేంద్రం నుంచి సైన్స్ సెంటర్ తీసుకువచ్చామనీ, ఈ పనులు పూర్తయితే ఎంతో మంది విద్యార్థులకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల కోసం కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా అనేక అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్లు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు వై.సునీల్‌రావు, బందారపు అజయ్, శ్రీనాథ్‌గౌడ్, ఫహాద్, జే నాగరాజు, చుక్క శ్రీనివాస్, పీచు మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles