టీఆర్‌ఎస్ దూకుడు

Mon,March 25, 2019 02:39 AM

- జోరుపెంచిన ఎంపీ వినోద్
- ఉదయం వాకర్స్‌ను కలుస్తూ ప్రచారం..
- మధ్యాహ్నం పల్లెజనంతో మమేకం
- సాయంత్రం రోడ్‌షోలు..
- అడుగడుగునా జననీరాజనం
- వీర్నపల్లిలో ఎన్నికల ఖర్చులు అందజేసిన రైతులు

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే జోరుమీదున్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో సైతం దూసుకెళ్తున్నది. ఈ నెల 17న కరీంనగర్‌లో జరిగిన సభలో సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా స్థానిక ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ప్రకటించిన వెంటనే పార్టీ ముఖ్య నేతలు వెంటనే రగంలోకి దిగారు. అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరో వైపు ఎంపీ వినోద్‌కుమార్ తనదైన శైలిలో ప్రచారంలో జోరు పెంచారు. ఈ నెల 22న జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలోని లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించిన ఆయన అక్కడి నుండే ప్రతి ఒక్కరినీ కలుస్తూ ముందుకు కదిలారు. ప్రతి రోజూ ఉదయం వాకర్స్‌ను కలుస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. మధ్యాహ్నం పల్లెల్లో పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ వారితో మమేకమవుతున్నారు. ఇక సాయంత్రం రోడ్డుషోలతో ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంగళహారతులు, డప్పుజప్పుళ్లతో ఘనస్వాగతం పలుకుతున్నారు. 22న జమ్మికుంట, 23న మానకొండూర్‌లో మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి రోడ్డు షోలు నిర్వహించగా, జనం పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతుగా నిలిచారు. ఆదివారం ఎంపీ వినోద్ తన దత్తత గ్రామమైన వీర్నపల్లిలో రోడ్డుషో నిర్వహించగా గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు నామినేషన్ ఖర్చుల కోసం ఎంపీ వినోద్‌కు రూ.5,016లు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తా: ఎంపీ
ఈసారి తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి కరీంనగర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం స్థానిక మానేరు డ్యాంపై వాకర్స్‌ను కలుసుకొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న స్పందన తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ను రైల్వేహబ్‌గా మార్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. గతంలో కరీంనగర్‌కు ఒక్క జాతీయ రహదారి కూడ లేదనీ, తాను ఎంపీ అయిన తర్వాత నాలుగైదు జాతీయ రహదారులను తీసుకురావడంతో పాటు జాతీయ రహదారుల సూపరింటెండెంట్ కార్యాలయం కూడా కరీంనగర్‌లో ప్రారంభించేలా చేశామన్నారు. స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయించి రూ. 250 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు టెండర్లను కూడా పూర్తి చేసినట్లు చెప్పారు. కొత్తపల్లి, మనోహరబాద్ రైల్వే లైన్‌ను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరీంనగర్ నుంచి ముంబైకి నేరుగా రైలు నడిపిస్తున్నామనీ, తిరుపతికి ప్రతి రోజూ నడిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ నుంచి వరంగల్ రైల్వేలైన్‌కు సర్వే పనులు సాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని చెప్పారు. కరీంనగర్‌ను మరింత వేగంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఎంపీ వినోద్‌కుమార్ మద్దతుగా నిలవాలని కోరారు. నిధులు, హక్కుల సాధనకు పోరాడే శక్తి టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అక్బర్‌హుస్సేన్, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ రమేశ్, కార్పొరేటర్లు వై సునీల్‌రావు, రమణ, చొప్పరి జయశ్రీ, నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, బాబ్‌జానీ, వాల రమణరావు, డీ శ్రీధర్, వేణు, గులాం అహ్మద్, సంపత్, శ్రీనాథ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చేశాం.. ఆశీర్వదించండి..
వీర్నపల్లి: టీఆర్‌ఎస్ సిరిసిల్ల అభ్యర్థిగా కేటీఆర్, కరీంనగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా తాను నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేశామనీ, అందుకే ఓట్లడగడానికి వచ్చామనీ, తనను ఆశీర్వదించాలని ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. ఆయన దత్తత గ్రామమైన వీర్నపల్లి మండలకేంద్రంతో పాటు ఎర్రగడ్డతండా, రంగంపేట, అడవిపదిర, లాల్‌సింగ్‌తండా, గర్జనపల్లి, వన్‌పల్లి గ్రామాల్లో ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మామూలుగా మాట్లాడానికి వస్తే సభలా మార్చిన కార్యకర్తల చిత్తశుద్ధి అర్థమవుతుందని తెలిపారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తోట ఆగయ్య సూచన మేరకు వీర్నపల్లిని దత్తత తీసుకున్నానని గుర్తు చేశారు. భూములుండి పట్టాలు లేని గిరిజన రైతులకు యాజమాన్య హక్కులు లేవనీ, నాటి కలెక్టర్ , ప్రస్తుత గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ నీతూ ప్రసాద్‌తో మాట్లాడి అందరికీ పట్టాలిప్పించామని వెల్లడించారు. అటవీ భూములు సాగుచేస్తున్న గిరిజనులకు భూములు అప్పగించి పండ్ల మొక్కల పెంపకం చేపట్టి వారి ఆర్థిక సాధికారత కోసం సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. శీతాఫలాల గుజ్జుతో ఐస్‌క్రీం తయారీ పరిశ్రమ నెలకొల్పడానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీర్నపల్లి హనుమాన్ దేవాలయం, ఎర్రగడ్డ తండాలోని జగదాంబ ఆలయంలో వినోద్‌కుమార్ మొక్కులు చెల్లించుకున్నారు. వీర్నపల్లి రైతులు నామినేషన్ ఖర్చుల కోసం రూ.5016లు అందజేశారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రాష్ట్ర నాయకురాలు గండ్ర నళిని, తదితరులు పాల్గొన్నారు.

108
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles