విజయం మాదే..

Sun,March 24, 2019 01:31 AM

- ప్రతి పక్షాలకు డిపాజిట్ దక్కదు
- అసెంబ్లీ ఎన్నికలతోనే మాయాకూటమి మటాష్ అయింది
- నాలుగున్నరేళ్ల అభివృద్ధిని చూశారు
- ప్రచారాన్ని ప్రజలే ముందుండి నడిస్తున్నారు
- కాంగ్రెస్, బీజేపీ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
- నమస్తే తెలంగాణ ఇంటర్య్వూలో మంత్రి ఈటల రాజేందర్

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం తమదేననీ, ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కకుండా ప్రజలు తీర్పునిస్తారనే పూర్తి విశ్వాసం ఉందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. అసెంబ్లీ ఎన్నికలతోనే మాయాకూటమి పని మటాష్ అయిందనీ, ప్రజలు ప్రతిపక్ష పార్టీల కట్టు కథలను, అర్థరహిత ఆరోపణలను నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రజలే ముందుండి నడిపిస్తున్నారన్న ఆయన, పూర్వ కరీంనగర్ జిల్లాతో సంబంధం ఉన్న కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ స్థానాల్లో గులాబీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం మాదే. ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కదు. ప్రజల నుంచి అలాంటి తీర్పు వస్తుంది అన్న విశ్వాసం ఉన్నది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన, నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్వ కరీంనగర్ జిల్లాతో సంబంధం ఉన్న కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పారు.

నమస్తే: పార్లమెంట్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్‌ఎస్, 16 సీట్లలో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని ఎందుకింత సీరియస్‌గా తీసుకుంటున్నారో ప్రజలకు వివరిస్తారా?
మంత్రి: మీరు అన్నది నిజం. ఈ పార్లమెంట్ ఎన్నికలను మేం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు.. సవాల్‌గా తీసుకుంటున్నాం. గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి కేంద్ర సాయం తోడైతే.. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఎదుగుతాం. రైల్వే, రవాణా, ప్రాజెక్టులు ఇలా భిన్నరంగాల్లో మరింత వృద్ధి సాధించాలంటే కేంద్రం నుంచి సహకారం, నిధులు అవసరం. గడిచిన ఐదేళ్లలో ఏం జరిగిందో ప్రజలు చూశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం కింద మనకు రావాల్సిన అనేక అంశాలను కేంద్రం అమలు చేయలేదు. అంతేకాదు.. పునర్విభజన చట్టం సెక్షన్ 90లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన ఆనాటి కేంద్రం... తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టును కూడా జాతీయ హోదా కిందకి చేర్చలేదు. అసలు తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం.. కానీ, ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వాలు విస్మరించాయి. ఇప్పుడు ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా.. కేంద్రం నుంచి అత్యధిక రైల్వే లైన్లు తేవాలన్నా.. సాధించుకున్న జాతీయ రహదారుల పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభం కావాలన్నా.. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలన్నా.. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలన్నా.. హైకోర్టులో ప్రస్తుతం 26 మంది జడ్జిల సంఖ్యను 46కు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నా.. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నది. ఇవేకాదు.. రాష్ర్టానికి రావాల్సిన హక్కులు, విధులు, నిధుల వంటి అంశాలపై మన ఎంపీలు ఉద్యమ పంథాతో పోరాటం చేస్తేనే రాష్ట్రం మరింత ప్రగతి పథంలో ముందుకు వెళ్తుంది. మనం పోరా టం చేస్తేనే హైకోర్టు, ఎయిమ్స్ వచ్చాయి. అందుకే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. అప్పుడే కేంద్రాన్ని శాసించే స్థాయికి వెళతాం.

మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం మీదే అంటున్నారు. ఇందుకు కారణాలు ఏంటి?
నేను బల్ల గుద్ది చెబుతున్నా. మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ విజయం మాదే. ఇందులో ఎటువంటి అనుమానాలకూ తావులేదు. ప్రజలు నిండు మనుసుతో ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ అభ్యర్థులనే గెలిపించడానికి అనేక కారణాలున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న వినోద్‌కుమార్, కవిత గడిచిన ఐదేళ్లలో పార్లమెంట్ వేదికగా ఎన్ని ప్రశ్నలు సంధించారో ప్రజలకు తెలుసు. మన రాష్ట్ర ప్రయోజనాలకు పనికి వచ్చే అంశాలే కాదు.. దేశం మొత్తం ప్రభావితం చేసే ఎన్నో సూచనలు ఇచ్చారు. అంతేకాదు.. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన హక్కులు, విధులు, మౌలిక సదుపాయల సాధనకు నిర్విరామ కృషి చేశారు. ఇక పెద్దపల్లి లోక్‌సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌నేతను ఇచ్చారు. వెంకటేశ్‌నేతకు ఎక్కడా రిమార్కు లేదు. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులే కీలకం. గడిచిన నాలుగున్నరేళ్లలో సింగరేణి దిశ దిశను తిప్పేందుకు ముఖ్యమంత్రి ఎంత కృషి చేశారో తెలుసు. అంతేకాదు, అన్ని లోక్‌సభ నియోకవర్గాల్లో పార్టీ పటిష్టంగా ఉంది. ప్రజలు ఆశీర్వాదం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే మా విజయం తథ్యం.

టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటువేయాలో చెబుతారా?
మంచి ప్రశ్న. గడిచిన నాలుగున్నరేళ్లలో ఉమ్మడి జిల్లా పరిధిలో అమలు చేసిన కొన్ని కార్యక్రమాలను ప్రజల ముందు పెడుతున్నా. గత సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3.98 లక్షల మందికి నెలకు 11.18 కోట్లు పంపిణీ చేస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు 5,42,049 మందికి నెలకు 57.74 కోట్లను పంపిణీ చేస్తున్నది. వచ్చే ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. పెరిగే వాటిని లెక్కలోకి తీసుకుంటే ఏప్రిల్ నుంచి ఇవ్వబోయే పింఛన్ మొత్తం 115.50 కోట్లు దాటనుంది. అలాగే ప్రస్తుతం ఉన్న పింఛన్ వయసును 65 ఏళ్ల నుంచి 57కి తగ్గించారు. అధికారులు చెపుతున్న ప్రాథమిక అంచనా ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా 47,248 మందికి కొత్తగా పింఛన్ వచ్చే అవకాశం ఉంది. పాత, కొత్త కలుపుకొని చూస్తే 5.89 లక్షల మందికి పింఛన్ అందనుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంత మాననీయ కోణంతో ఆలోచిస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. 2014లో 3,95,958 మందికి 1693. 52 కోట్ల రుణమాఫీ చేశాం. ఈసారి ఉమ్మడి జిల్లాలో 3,22,889 మంది రైతులకు మాఫీ అయ్యే అవకాశం ఉంది. రైతుబంధు పథకం కింద రెండు దఫాలుగా ఉమ్మడి జిల్లాలో 5,64,693 మంది రైతులకు 800.28 కోట్ల లబ్ధి కల్పించిన ఘనత, అలాగే రైతుబీమా కింద 578 కుటుంబాలకు పైగా పరిహారం అందించిన ఘనత టీఆర్‌ఎస్‌కు దక్కుతుంది. ఇవేకాదు.. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, వైద్యరంగంలో మార్పులు, కేజీటూ పీజీ కింద అమలు చేస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలు, మూడువేల కోట్లతో చేపట్టిన రహదారుల నిర్మాణాలు, 6170 కోట్లతో చేపట్టిన మిషన్‌భగీరథ వంటి ఎన్నో పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తూ ప్రయోజనాలు చేకూర్చుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఎంత వేగంగా పరుగులు పెట్టిస్తున్నామో ప్రజలకు తెలుసు. మధ్యమానేరును పూర్తి చేశాం. వెయ్యి కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకీకరణ చేసి వచ్చే ఖరీఫ్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇవ్వనున్నాం. మరోవైపు 1067 కోట్లతో చేపట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునర్జీవ పనులు, వరదకాలువ పొడవునా 53 ప్రాంతాల్లో తూముల నిర్మాణం, మిషన్ కాకతీయ, ఇలా ఎన్నో పనులను చేసి చూపిస్తున్నాం. ప్రస్తుతం నేను చెప్పినవి మచ్చుకు మాత్రమే. ఇవన్నీ ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయి. అందుకే ఓటు వేయమని అడిగే హక్కు మాకే ఉంది. అందుకే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు.

ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నాయి కదా?
ప్రజలంతా గమనించారు. గత అసెంబ్లీ ఎన్నిలకు ముందు సైద్ధాంతిక విలువలకు విరుద్ధంగా పొత్తులు పెట్టుకొని మహాకూటమి పేరుతో మాయాకూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మాయాకూటమి చేసిన విష ప్రచారానికి కొన్ని ఆంధ్రా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలు తోడయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఎన్నో అసత్య ప్రచారాలు చేశారు. ప్రజల్లో అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ, చివరికి ఏం జరిగిందో అందరూ గమనించారు. రాష్ట్రంలో మంచి మెజార్టీతో 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. మాయాకూటమి నేతలను మట్టి కరిపించారు. తప్పుడు ప్రచారాలు చేసిన వారి చెంప చెల్లుమనిపించారు. అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేశారు. ఆంధ్రా మీడియాలో ఎన్ని తప్పుడు కథనాలు ప్రచురించినా.. అందులోని వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకొని గులాబీ పార్టీని ఆశీర్వదించారు. మీరు ముందుకు వెళ్లండి మేం మీ వెంటే ఉంటామంటూ దీవించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మళ్లీ అదే పంథాను కొన్ని ప్రతిపక్షాలు ఎన్నుకుంటున్నాయి. మళ్లీ అసత్య ఆరోపణలకు తెరతీస్తున్నాయి. ఆంధ్రా పత్రికలతో జత కలిశాయి. కానీ, వాస్తవాలు ఏమిటో ప్రజల కళ్ల ముందున్నాయి. అందుకే ప్రతిపక్షాల మాయమాటలను, కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నది సుస్పష్టం. అంతేకాదు, గత ఎన్నికల్లో కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూశారు. కానీ, ఈసారి ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు మాత్రం ఒక్కటే నిర్ణయించుకున్నారు. నేరుగా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని. అదే రాబోయే ఫలితాల రోజు ప్రస్ఫుటం అవుతుంది.

ఎంపీ వినోద్ గురించి చెబుతారా?
కష్టానికి.. కమిట్ మెంట్‌కు నమ్మకానికి మారుపేరు ఎంపీ వినోద్‌కుమార్. ఎవరికైనా మేలు చేశాడే తప్ప కీడు చేయలేదు. నియోజకవర్గ సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల ప్రజా ప్రయోజనాలను కాపాడే విషయంలో ఢిల్లీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. తెలంగాణ నిర్మాణంలో తన పాత్ర అత్యంత కీలకంగా ఉంది. ఆ స్థాయి ఉన్న నాయకుడు కాబట్టి.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గర్వంగా మా నాయకుడు, మా ఎంపీ అని ఫీల్ అవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలే గెలిపించుకోవాలని తపన పడుతున్నారు.

ప్రచారం ఎలా సాగుతున్నది. ప్రజల నుంచి స్పందన ఎలా ఉన్నది?
పూర్వ జిల్లాతో సంబంధం ఉన్న కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్లమెంట్ ప్రచారం మొదలైంది. అన్ని చోట్లా అభ్యర్థులతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కతాటిపై పనిచేస్తున్నారు. అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించే దిశగా ప్రయత్నిస్తున్నారు. గులాబీ పార్టీ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన కనిపిస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలే ముందుండి ప్రచారం నడిపిస్తున్నారు.

ఒక సీనియర్ మంత్రిగా మీరు ప్రజలకు ఇచ్చే పిలుపు ఏంటి?
ఇది ఉద్యమాల గడ్డ.. ఆది నుంచీ టీఆర్‌ఎస్‌ను వెన్నుతట్టి ముందుకు నడిపించిన ప్రాంతం. టీఆర్‌ఎస్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గడ్డ. ఈ ప్రాంతం ఇప్పటికే వాటర్‌హబ్‌గా మారింది. భవిష్యత్తులో సీడ్‌బౌల్ ఆఫ్ తెలంగాణ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు నిలయంగా నిలుస్తుంది. అంతేకాదు.. పూర్వ కరీంనగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ. అందుకే తెలంగాణ రాష్ట్రం అమలు చేసిన ఎన్నో పథకాలను ఈ గడ్డనుంచే ప్రకటించారు. రైతు బంధు, రైతుబీమా, మిషన్ భగీరథ వంటి అద్భుతమైన పథకాలు ఈ ప్రాంతం మీదుగా పురుడు పోసుకొని నేడు దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ర్టానికి, పూర్వ జిల్లాకు రహదారులు, రైల్వేలు, ప్రాజెక్టులు, కేంద్రస్థాయి విద్యాసంస్థల వంటి వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాలు కావాలంటే పూర్వ జిల్లాలో సంబంధం ఉన్న మూడు లోక్‌సభ స్థానాల్లోని అభ్యర్థులను నిండు మనుసుతో దీవించాలని కోరుతున్నా. ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ గల్లంతయ్యేలా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. సంపూర్ణ మెజార్టీనిచ్చి మరోసారి ఈగడ్డ ప్రాధాన్యతను, ప్రాశస్థ్యతను చాటిచెప్పాలని కోరుతున్నా.

294
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles