నేటితో యుగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Wed,March 20, 2019 12:51 AM

- బల్క్ ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం
- ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార గడువు నేడు సాయంత్రం 4 గంటలతో ముగుస్తుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి పోలింగ్ జరిగే శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ప్రచారం చేయడం నిషేధమని పేర్కొన్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారం చేయరాదన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని సహాయ ఎన్నికల అధికారులు తమ డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్నికల అధికారి తెలిపారు.

బల్క్ ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 22న జరగనున్నందున పోలింగ్ రోజుకు 48 గంటల ముందు నుంచి బల్క్ ఎస్‌ఎంఎస్‌లను నిషేధించామని ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం కోసం బల్క్ ఎస్‌ఎంఎస్‌లు చేయరాదన్నారు. ఈ నెల 20 సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధం వర్తిస్తుందన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో బల్క్ ఎస్‌ఎంఎస్‌లు చేయవద్దనీ, వీటిపై ఎన్నికల సంఘం పరిశీలకులు, ఎంసీసీ బృందాల నిఘా ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ, ఆర్‌పీ యాక్ట్ 1951 ప్రకారం కఠిన చర్యలుంటాయని ఎన్నికల అధికారి హెచ్చరించారు.

90
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles