అంకురార్పణకు ఆది

Sun,March 17, 2019 12:53 AM

* కలిసొచ్చిన గడ్డపై ముఖ్యమంత్రి కేసీఆర్ చెరగని ముద్ర
* సెంటిమెంట్‌గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా
* నాటి ఉద్యమం నుంచి నేటి పాలన దాకా వేదిక
* ఇక్కడి నుంచే వినూత్న ఆలోచనలు.. విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం
* టీఆర్‌ఎస్ ఆవిర్భావ ప్రకటన
* అల్గునూర్‌లో అరెస్టుతో దేశవ్యాప్త సంచలనం
* సకలజనుల సమ్మెకు పిలుపు
* ఎన్నికల శంఖారావాలతో విజయభేరి
* కనీవినీ ఎరగని పథకాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలజల్లు
* తాజాగా లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం

నాడు ఉద్యమానికి.. నేడు ప్రభుత్వానికి వేయి ఏనుగుల బలాన్నిస్తూ.. మమ్మల్ని ముందుకు నడుపుతున్న కరీంనగర్ గడ్డకూ.. బిడ్డకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 2001లో సింహగర్జలో సింహంలా గర్జించి మడిమ తిప్పని పోరాటానికి అస్త్రశస్ర్తాలను అందించింది ఈ గడ్డ. కరీంనగర్ వేదికగా సింహగర్జన, ఆమరణ నిరాహారదీక్ష, సకలజనుల సమ్మెకు శంఖారావం పూరించా. అవి చరిత్రలో ఒక చారిత్రక ఘట్టాలుగా నిలిచిపోయాయి. అందుకే ఈ గడ్డ ప్రజలకు ఎంతచేసినా రుణం తీర్చుకోలేను. అధికార పగ్గాలు చేపట్టాక కలసి వచ్చే కరీంనగర్ జిల్లా నుంచే ఎన్నో విశిష్ట పథకాలకు అంకురార్పణ చేశా. ఇక్కడ ప్రకటించిన ఎన్నో పథకాలు గమ్యాన్ని ముద్దాడడమేకాదు.. యావత్తు దేశానికి ఒక దిక్సూచిగా మారాయి. ఈ గడ్డపై ఏది చేపట్టినా అది సంపూర్ణ విజయవంతమవుతుందన్న నమ్మకం నాది.

ఈ మాటలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్లుగానే, ఉద్యమాల గడ్డపై చెరగని ముద్రవేశారు. నాడు టీఆర్‌ఎస్ ఏర్పాటు నుంచి నేటి పాలనదాకా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలకు ఇక్కడే శ్రీకారం చుట్టారు. చారిత్రక పథకాలు, కార్యక్రమాలకు పురుడుపోసి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల ఆశీర్వాదంతో ఎన్నో విజయాలను అందుకున్నారు.
- కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

* 2001 ఏప్రిల్ 27 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీడీపీకి, తన శాససభా సభ్యత్వానికి కేసీఆర్ రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి నాంది పలికారు.

* 2001 మే17: కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల వేదికగా సింహగర్జన సభ నిర్వహించారు. లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటును కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. తెలంగాణ వచ్చేదాకా మడమ తిప్పబోనని ప్రతినబూనారు. అప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎర గని రీతిలో ఈ సభ విజయవంతమై, కరీంనగర్ పేరు మారుమోగింది.

* 2004 జూన్ 7: 2004లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన కేసీఆర్, తనదైన స్థాయిలో చక్రం తిప్పి, ఆ యేడాది జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేయగలిగారు. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఘనత కూడా ఈ గడ్డకే దక్కింది. 2005 జనవరిలో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు కూడా టీఆర్‌ఎస్ విజయమే. అప్పుడు కూడా కరీంనగర్ ఎంపీగానే ఉన్నారు.

* 2006 సెప్టెంబర్ 12: కరీంనగర్ లోక్‌సభ స్థానానికి కూడా కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణవాదం లేనే లేదంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలతో కలత చెందిన ఆయన, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పదవుల త్యాగానికి శ్రీకారం చుట్టిన ఘనత ఈ ప్రాంతానికి దక్కింది.

* 2006 డిసెంబర్ 7: కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో 2,01,582 ఓట్ల మెజార్టీనిచ్చి ఈ గడ్డ ప్రజలు కేసీఆర్‌ను గెలిపించారు. ప్రత్యేక తెలంగాణ వాదం ఉందని నలుమూలలా చాటిచెప్పారు. ఈ ఎన్నిక టీఆర్‌ఎస్ పార్టీకి రాజకీయ పునర్జన్మనిచ్చింది.

* 2009 నవంబర్ 11: ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు కరీంనగర్‌లోని తనభవన్ నుంచి బయలుదేరిన కేసీఆర్‌ను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఈ ప్రాంత ప్రజలు ఎదురేగి కేసీఆర్ మద్దతుగా నిలిచారు. ఈ అరెస్టు ఉద్యమాన్ని మలుపుతిప్పింది. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.

* 2011 సెప్టెంబర్ 23: ప్రత్యేక తెలంగాణ సాధన కోసం చరిత్రలో నిలిచిపోయే సకలజనుల సమ్మెకు కరీంనగర్ గడ్డ మీద నుంచే ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన సభలో సకల జనుల చారిత్రక సమ్మెకు రణభేరి మోగించారు. ఈ సమ్మె యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది.

* 2012 నవంబర్ 7, 8: ఈ తేదీల్లో టీఆర్‌ఎస్ రెండు రోజుల పాటు కార్యవర్గ సమావేశాలను అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రతిమా హోటల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యవర్గ సమావేశాల్లో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు.. తెలంగాణ సాధించే వరకు తమ పోరాటం విరమించేది లేదని ఈ గడ్డ వేదికగా ప్రతినబూనారు.

* 2013 సెప్టెంబర్ 7: తెలంగాణ సాధనకు పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ శిబిరాలను నిర్వహించగా, తొలి శిక్షణ శిబరాలను హుజూరాబాద్ కేంద్రంగా ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఆనాడు బ్రోచర్లు, పుస్తకాల ద్వారా అందించిన సమాచారం, నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి ఆనాడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించిన తీరు ఉద్యమం వైపు అందరినీ కదిలించింది.

2014 ఏప్రిల్ 13: ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు శ్రీ రాజరాజేశ్వర కళాశాల (ఎస్సారార్ వేదికగా జరిగిన బహిరంగ సమావేశంలో తొలి సమర శంఖారావం పూరించారు. టీఆర్‌ఎస్ అద్భుత విజయం సాధించి రాష్ట్ర తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అధికార పగ్గాలు చేపట్టింది.

* 2014 ఆగస్టు 5: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తదుపరి ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి అధికారిక పర్యటన చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ఈ గడ్డపై నుంచే ప్రకటించారు. ఈ పథకం ప్రస్తుతం దేశం దృష్టిని ఆకర్షించడమేకాదు.. కొద్ది నెలల్లోనే ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి సురక్షిత మంచినీరు తాగించే దిశగా పనులు సాగుతున్నాయి. కాకతీయ కెనాల్ సామర్థ్యం పెంచి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించి తీరుతామని చెప్పారు. ఈ ఖరీఫ్ నుంచి చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింగరేణి రూపు రేఖలను మార్చి చూపిస్తామన్నారు. స్వరాష్ట్రంలో సింగరేణిని పరుగులు పెట్టిస్తున్నారు.

* 2015 జూలై 4: రాష్ట్రంలో అంతరించి పోతున్న అటవీ సంపద పెంచాలన్న లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మొదట హుస్నాబాద్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం దిగ్విజయంగా కొనసాగుతుంది.

* 2016 మే 2: ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌కు శ్రీకారం చుట్టిన తదుపరి కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడంలో భాగంగా మేడిగడ్డ వద్ద కాళేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు. ఈ పథకం పనులు ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అత్యంత వేగంగా నడుస్తున్న పనుల్లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పలు రికార్డులను సృష్టించింది.

* 2017 జూలై 12: నగరంలో మూడో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మానేటి తీరాన (బతుకమ్మ పాయింట్ వద్ద) మహాగని మొక్క నాటి, మూడో విడత లాంఛనంగా ప్రారంభించారు. తన మనమడు హిమాన్ష్ పేరు మీదు మరో కదంబ మొక్క నాటారు.

* 2018 ఫిబ్రరి 26: రైతాంగ చరిత్రలో నూతన అధ్యాయానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కరీంనగర్ అంబేద్కర్ మైదానంలో జరిగిన సభావేదికగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇవి దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అంతేకాదు.. రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఇదే వేదికపై నుంచి వెల్లడించారు.

*2018 మే 10: లక్షలాది మంది రైతుల ఆశలకు జీవం పోస్తూ హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా రైతుబంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ పథకాన్ని కేంద్రంతో సహా అన్ని రాష్ర్టాలు అమలు చేసే యోచనలో ఉన్నాయి. అన్నదాతల జీవన గమనానికి ఈ వేదిక జీవనాడిలా నిలిచింది.

* 2018 సెప్టెంబర్ 7: ప్రభుత్వాన్ని రద్దుచేసిన తదుపరి తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రజా ఆశీర్వాద సభ పేరుతో పూర్వ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ గడ్డ వేదికగా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఆ మేరకు 88 స్థానాల్లో విజయకేతనం ఎగరేసి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు.

* 2019 జనవరి 1: రెండో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ప్రాజెక్టుల బాటతో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఒకటిన రాత్రి తీగలగుట్టపల్లికి, 2న పెద్దపల్లి జిల్లాలో మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలించారు. 3న రోడ్డుమార్గాన కన్నెపల్లి నుంచి అన్నారం దాకా గ్రావిటీ కెనాల్, సుందిళ్ల బ్యారేజీ, సుందిళ్ల, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌లు పరిశీలించారు.

2019 మార్చి 6: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన మొదటి సన్నాహక సమావేశాన్ని ఎస్సారార్ కళాశాల వేదికగా ఏర్పాటు చేయగా.. ముఖ్యఅతిథిగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హాజరై కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సభ యావత్తు రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ శ్రేణులకు ఒక దిశ నిర్దేశంలా నిలిచింది.

264
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles