రారండహో

Sat,March 16, 2019 01:02 AM

- రేపటి కేసీఆర్ సభకు తరలిరావాలని టీఆర్‌ఎస్ నాయకత్వం పిలుపు
- బ్యాండ్ మోగించిన గంగుల.. డప్పు చాటింపు వేసిన సుంకె..
- బొట్టుపెట్టి ఆహ్వానించిన ప్రజాప్రతినిధుల సతీమణులు
- విజయవంతం చేసేందుకు ముఖ్యనేతల కసరత్తు
- భారీ జనసమీకరణలో తలమునకలు
- కొనసాగుతున్న సన్నాహక సమావేశాలు
- కరీంనగర్‌లో పలు సంఘాలతో సమావేశమైన మంత్రి ఈటల
- ఎంపీ వినోద్‌కు ప్రైవేట్ టీచర్లు, ఆర్యవైశ్యులు, పద్మశాలీల మద్దతు
- సిరిసిల్లలో హాజరైన ఎమ్మెల్యేలు బాల్క, కోరుకంటి
- స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో భారీ ఏర్పాట్లు
- పరిశీలించిన మంత్రి కొప్పుల

కరీంనగర్ ప్రతినిధి/కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు సాధించడమే లక్ష్యంగా స్పోర్ట్స్ స్కూల్ మైదానం వేదికగా సమరభేరి మోగించనున్నారు. ఈ సభకు రెండు లక్షలకు మించి జనాన్ని తరలించాలని నిర్ణయించిన ఉమ్మడి జిల్లా నాయకులు, ఆ మేరకు శ్రమిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఊరూవాడలను ఏకం చేస్తున్నారు. వివిధ కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య వర్గాల మద్దతు కోరుతున్నారు. ముఖ్యనాయకులంతా ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉంటున్నారు. మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్‌లోనే ఉంటూ పార్టీ నాయకులను సమన్వయపరుస్తూనే, జన సమీకరణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం కరీంనగర్‌లో జరిగిన పలు సమావేశాల్లో పాల్గొన్నారు. రజక, గౌడ సంఘాలు కార్యక్రమాలకు హాజరై, కేసీఆర్ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాలను స్థానిక ప్రతిమా మల్టీప్లెక్స్ వద్ద మంత్రి ఈటల జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి గల్లీ, ప్రతి ఇంటికీ వెళ్లి విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ఇటు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఈ సభ దేశ రాజకీయాల్లో కీలక చర్చగా మారబోతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో భారీగా జనాన్ని సమీకరిస్తున్నామనీ, వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్‌కు మద్దతు ప్రకటించాలని కోరారు. నాయకులు ఆరిఫ్, మజీద్ అలీ, సుప్రీం, జావిద్, అస్మత్, అహ్మదుస్సేన్, హర్షద్, అబీబ్‌తో కలిసి ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్‌హుస్సేన్ నగరంలోని మసీదుల వద్ద ప్రచారం చేశారు. సభకు ఆహ్వానిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముస్లింల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. షాదీముబారక్, విదేశాల్లో విద్య కోసం 20 లక్షల రుణం, తదితర ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు.

జన సమీకరణకు కసరత్తు
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ భారీ జన సమీకరణకు టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు సన్నద్ధమవుతున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండిలో ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. సభ విజయవంతానికి ప్రతి కార్యకర్తా కృషి చేయాలని ఆయన కోరారు. హుజూరాబాద్‌లో రాజ్యసభ సభ్యుడు బడుగు లింగన్న యాదవ్ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో కేసీఆర్‌దే కీలకపాత్ర కాబోతున్నదని స్పష్టం చేశారు. ఇటు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్ సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలు సాధిస్తే కేంద్రంలో కేసీఆర్ కింగ్ మేకర్‌గా నిలుస్తారని చెప్పారు. మానకొండూర్‌లో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు కార్యకర్తలతో సమావేశమై, జన సమీకరణపై చర్చించారు. గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండలాల్లో నూ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. మొత్తానికి భారీ జన సమీకరణకు సన్నాహాలు చేస్తుండగా, జనం నుంచి వస్తున్న స్పందనతో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు.

బ్యాండ్ బాజా..
నగరంలోని టవర్‌సర్కిల్ వద్ద వినూత్నరీతిలో ప్రచారం చేశారు. సభకు రావాలంటూ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ ఇన్‌చార్జి బసవరాజు సారయ్య సమక్షంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బ్యాండ్ మోగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దేశంలో సంకీర్ణాల యుగం నడుస్తుందన్నారు. 1984 తర్వాత నుంచి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల పొత్తుతోనే అధికారంలో కొనసాగిందన్నారు. ఒక్క 2014 ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిందనీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఆ అవకాశం లేదని చెప్పారు. కేంద్రంలో ఎంపీల బలం ఎందుకు ఎక్కువగా ఉండాలన్న వివరాలను ప్రజలకు వివరించేందుకు సీఎం కేసీఆర్ కరీంనగర్‌కు వస్తున్నారన్నారు. ఈ సీఎం కేసీఆర్ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కోరారు. వారివెంట టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, కార్పొరేటర్లు వై సునీల్‌రావు, బండారి వేణు, కంసాల శ్రీనివాస్, ఎంపీపీ వాసాల రమేశ్, నాయకులు చల్ల హరిశంకర్, సతీశ్, ఎడ్ల అశోక్, శ్రీనివాస్‌గౌడ్, మారుతి, శ్రీనివాస్, మహేశ్, డీ శ్రీధర్, సత్యనారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు.

డప్పుచాటింపు..
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో డప్పు చాటింపు వేశారు. నాలుగు రోడ్ల పరిధిలో అటూ ఇటూ డప్పు కొట్టుకుంటూ వెళ్లారు. సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. నియోజకవర్గం నుంచి 40 వేల మందిని తరలిస్తామని చెప్పారు.

బొట్టుపెట్టి ఆహ్వానం..
సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత, ఎంపీ వినోద్‌కుమార్ సతీమణి మాధవి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సతీమణి రజిత, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు సతీమణి వర్ష నగరంలోని టవర్‌సర్కిల్ ప్రాంతంలో ప్రచారం చేశారు. షాపులతోపాటు ఇండ్లకు వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి, సభకు రావాలని కోరారు. వారివెంట కార్పొరేటర్లు కమల్‌జిత్‌కౌర్, తాటి ప్రభావతి, చల్ల స్వరూపరాణి, వై అపర్ణ, ఎడ్ల సరిత, చొప్పరి జయశ్రీ, నాయకురాళ్లు వరాల జ్యోతి, రత్నజ్యోతి, తదితరులు ఉన్నారు. నగరంలోని 31, 38వ డివిజన్‌లో కార్పొరేటర్లు వై.అపర్ణ, సునీల్‌రావు ఇంటింటా బొట్టు ప్రచారం సాగించారు. కరీంనగర్ సభ నియోజకవర్గ ఇన్‌చార్జి, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ కూడా హుస్నాబాద్ పట్టణంలోని సాయినగర్‌తోపాటు పలు కాలనీల్లో ప్రచారం చేశారు. మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగతోపాటు టీఆర్‌ఎస్ పట్టణ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి, మహిళలకు బొట్టుపెట్టి సభకు ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల తొలి శంఖారావానికి పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. తిమ్మాపూర్ జడ్పీటీసీ సభ్యురాలు ఉల్లెంగుల పద్మ ఆధ్వర్యంలో మహాత్మానగర్‌లో ఇంటింటికీ తిరిగి బొట్టు పెడుతూ సీఎం సభకు ఆహ్వానించారు.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల
స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మైదానాన్ని బహిరంగ సభకు అనుగుణంగా తయారు చేయడమే కాకుండా, సభకు హాజరయ్యే రెండు లక్షల మందికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదికతోపాటుగా టెంట్లు, లైటింగ్, సౌండ్ సిస్టంకు సంబంధించిన పనులు వేగంగా చేస్తున్నారు. వీటిని శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. సౌండ్ సిస్టం, బారికేడ్లు, సభా వేదిక, లైటింగ్ తదితర ఏర్పాట్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లూ చేయాలని సూచించారు. ఆయనవెంట ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు చెన్నాడి సుధాకర్‌రావు, ఎడ్ల అశోక్, గుంజపడుగు హరిప్రసాద్, చొప్పరి వేణు ఉన్నారు.

సభకు పటిష్ట బందోబస్తు : సీపీ కమలాసన్
కరీంనగర్ క్రైం : ఈ నెల 17న సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సభా ప్రాంగణానికి వచ్చే ప్రజలు అగ్గిపెట్టెలు, లైటర్లు, కిరోసిన్, పెట్రోల్, డీజిల్ లాంటి వాటిని తీసుకరావద్దని సూచించారు.

వాహనాలు పార్కింగ్..
జగిత్యాల నుంచి వచ్చే భారీ వాహనాలు రేకుర్తి-శాతవాహన యూనివర్సిటీ, చింతకుంట మీదుగా పద్మనగర్‌కు చేరుకున్న తర్వాత కార్యకర్తలను దింపాలి. ఎల్‌ఎండీలో ఏర్పాటు చేసిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలి. సిరిసిల్ల-వేములవాడ నుంచి వచ్చే వాహనాలు పద్మనగర్ మీదుగా సిరిసిల్ల బైపాస్‌రోడ్డుకు చేరుకుని కార్యకర్తలను దింపాలి. అనంతరం ఎల్‌ఎండీలో ఏర్పాటు చేసిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలి. పైన పేర్కొన్న ప్రాంతాల నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు సిరిసిల్ల బైపాస్ రోడ్డులో వాటర్ ట్యాంకు ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలి. కరీంనగర్ టౌన్ నుంచి వచ్చే వాహనాలు కట్టరాంపూర్‌లోని మహాలక్ష్మి దేవాలయం వద్ద పార్కింగ్ చేయాలి. చొప్పదండి-పెద్దపల్లి-వరంగల్-హైదరాబాద్ నుంచి వచ్చే భారీ వాహనాలు ఎల్‌ఎండీ, సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో పార్కింగ్ చేయాలి. పైన పేర్కొన్న ప్రాంతాల నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు కొండ సత్యలక్ష్మి గార్డెన్స్, ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో గల హోండాషోరూం వద్ద పార్కింగ్ చేయాలి.

ట్రాఫిక్ మళ్లింపు
ఈ నెల 17న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ ఏసీపీ ప్రసాదరావు తెలిపారు. 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలుంటాయనీ, వాహనదారులు సహకరించాలని కోరారు. 17న బొమ్మకల్ ైఫ్లెఓవర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు, ఎన్టీఆర్ విగ్రహం నుంచి చింతకుంట వరకు, చింతకుంట నుంచి రేకుర్తి వరకు ఎలాంటి భారీ వాహనాలు అనుమతించమని పేర్కొన్నారు. బహిరంగ సభ జరుగుతున్న సందర్భంగా స్థానిక ప్రజలు, ఆయా రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు సభను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ రహదారుల్లో ప్రయాణించాలని సూచించారు. హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి నుంచి వచ్చే వాహనాలు పై దారుల్లో కాకుండా ఇతర దారుల్లో ప్రయాణించాలని కోరారు.

107
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles