నేటినుంచే పది పరీక్షలు..

Sat,March 16, 2019 01:00 AM

ముకరంపుర: పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షల నిర్వాహణకు జిల్లా వ్యాప్తంగా 71 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 14,200 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా బాలురు 7,522 మంది, బాలికలు 6,678 మంది ఉన్నారు. వీరి కోసం కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 49, హుజూరాబాద్ డివిజన్ పరిధిలో 22 మొత్తం 71 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ప్రతిరోజూ పరీక్షలు జరుగుతాయి. 19 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 746 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఐదు ప్లయింగ్ స్కాడ్స్, 71 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 71 మందిని డిపార్ట్‌మెంటల్ అధికారులు, 17 మంది సెంటర్ కస్టోడియన్లను నియమించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని చెబుతున్న అధికారులు ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని పేర్కొంటున్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు: డీఈవో వెంకటేశ్వర్లు
జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు 14,200 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతారని అధికారులు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పోలీసు స్టేషన్ల నుంచి ప్రశ్న పత్రాలు తీసుకువచ్చేటపుడు, జవాబు పత్రాలను పోస్టాఫీసులో అప్పగించేటప్పుడు వీడియో తీస్తారనీ, 11 రోజులపాటు తీసిన వీడియో కాపీలను పరీక్షలు ముగిసిన తర్వాత ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.

సీసీ కెమెరాలతో నిఘా..
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో 20 కేంద్రాల్లో సీసీ కెమెరాలు (నిఘా నేత్రం) ఏర్పాటు చేస్తున్నామని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. సీసీ కెమెరాల పట్ల పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు. వచ్చే ఏడాది కల్లా అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఏప్రిల్ 3న ఇంగ్లిష్ పేపర్ -2
ఈ నెల 22న శాసనమండలి ఎన్నికల దృష్ట్యా ఆనాడు జరగాల్సిన ఇంగ్లీష్-2 పేపర్‌ను ఏప్రిల్ మూడో తేదికి వాయిదా వేశారు. మిగిలిన పేపర్లు అన్ని కూడా గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు.

విధుల్లో 746 మంది ఉపాధ్యాయులు..
పదో తరగతి పరీక్షల నిర్వహణకు సుమారు 746 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు. వీరు కాకుండా 71 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 71 మందిని డిపార్ట్‌మెంటల్ అధికారులుగా నియమించారు. మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఐదు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎంఈవోతోపాటు ఒక రెవెన్యూ, పోలీసు అధికారులతో సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు రాష్ట్ర పరిశీలకులు ఒకరు ఉంటారన్నారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతారని తెలిపారు. హాల్ టికెట్ చూపితే ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులను మొదటిరోజు (ఈ నెల 16న) పరీక్షా సమయం మించిన తర్వాత 5 నిమిషాల వరకు అనుమతిస్తామని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్, తాగు నీరు, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి వసతి, వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రాథమిక చికిత్స పెట్టెలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుతామన్నారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేదనీ, సమస్యాత్మక పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సెంటర్‌లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబోమన్నారు.

విద్యార్థులు ఇవి పాటించాలి..
- విద్యార్థులు వారి వారి పాఠశాలలకు చెందిన స్కూల్ యూనిఫారం వేసుకోవద్దు.
- ఓఎంఆర్ షీట్‌పై ఉన్న కోడ్ నంబర్‌ను మాత్రమే అదనపు జవాబు పత్రంపై వేయాలి. హాల్ టికెట్ నంబర్ వేయవద్దు.
- పరీక్ష కేంద్రానికి గంట ముందు రావాలి. పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ముందుగా బార్‌కోడ్‌షీట్, ఆన్సర్‌షీట్ గురించి ఇన్విజిలెటర్‌ను ద్వారా తెలుసుకోవాలి.
- మెయిన్ ఆన్సర్ షీట్‌పై ఉన్న సీరియల్ నంబర్‌ను అడిషనల్ షీట్స్, గ్రాఫ్‌లు, మ్యాప్‌లు, బిట్ పేపర్లపై వేయాలి. వాటిపై హాల్‌టికెట్ నంబర్లను రాయవద్దు.
- సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఎలాక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రానికి తీసుకొనిరావద్దు.
- విద్యార్థులు పరీక్షకేంద్రంలోకి ఎలాంటి కాగితాలు, నకలు ప్రతులను తీసుకెళ్లవద్దు.
- ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది యాజమాన్య ప్రతినిధులు పరీక్ష జరిగే సమయంలో లోనికి వెళ్లకూడదు. అక్కడ ఉండరాదు.
- పరీక్ష కేంద్రంలో విద్యార్థులు, ఇన్విజిలెటర్లు, చీఫ్ సూపరిటెండెంట్లు కూడా సెల్‌ఫోన్లు వాడరాదు.
- ఏవైనా ఫిర్యాదులంటే డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ 0878-2243268కు సమాచారం ఇవ్వాలి. ఫిర్యాదును బట్టి వెంటనే స్పందిస్తారు.

117
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles