దండులా కదలాలి

Fri,March 15, 2019 01:07 AM

-17న బహిరంగ సభను విజయవంతం చేయాలి
- ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలి
-ఎంపీ వినోద్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
- మరోసారి కేసీఆర్‌కు అండగా నిలువాలి
-కరీంనగర్ గడ్డపై నుంచే శంఖారావం పూరిస్తున్నాం
-ఈ సభే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి దశాదిశ
-రెండు నుంచి రెండున్నర లక్షల మందితో నిర్వహిస్తాం
-విలేకరుల సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈ నెల 17న కరీంనగర్‌లో నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు దండులా కదలి రావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రతిమా హోటల్‌లో ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గులాబీ పార్టీకి ఆది నుంచి కలసివచ్చిన గడ్డ కరీంనగర్ అనీ, ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా అది గమ్యాన్ని ముద్దాడిందనీ, ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ఎన్నో సార్లు తెలిపారని గుర్తు చేశారు. అదే నమ్మకం, స్ఫూర్తితో ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని సైతం కరీంనగర్ గడ్డపై నుంచి శ్రీకారం చుట్టాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారనీ, అందులో భాగమే ఈ నెల 17న కరీంనగర్‌లోని స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభను సంపూర్ణంగా విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి మొదలు మంత్రుల వరకు అందరం సమష్టిగా పనిచేస్తున్నామన్నారు. రెండు నుంచి రెండున్నర లక్షల మందితో జరగనున్న సభా వేదికపై నుంచి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించడమే కాకుండా, 16 సీట్లు గెలవాల్సిన ఆవశ్యకతను వివరిస్తారని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో బడితే ఉన్నవాడిదే బర్రె అన్న సామెత చందంగా ఉందనీ, అత్యధిక ఎంపీలు ఎవరు ఉంటే ఆ రాష్ర్టానికే నిధులు ఎక్కువగా వెళ్తున్నాయన్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో గులాబీ అభ్యర్థులు విజయం సాధిస్తే... కేంద్రం నుంచి మన రాష్ర్టానికి రావాల్సిన హక్కులు, విధులు, నిధులు నడిచి వస్తాయని స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించే పరిస్థితుల్లో లేవనీ, అందుకే ప్రాంతీయ పార్టీల సహకారం తప్పనిసరిగా అవసరం అవుతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్ఫూర్తిని చాటి ఓట్లు వేసి కేసీఆర్‌ను ఆశీర్వదించారో.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వినోద్‌కుమార్‌ను రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమం నుంచి నేటి వరకు విశ్వాసానికి మారుపేరుగా ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా గడిచిన ఐదేళ్ల కాలంలో ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడుతూనే మరోవైపు కేంద్రానికి రాష్ర్టానికి మధ్య వారధిలా నిలిచారని కొనియాడారు. ఎంపీగా వినోద్‌కుమార్ అందించిన సేవలు మరువలేనివనీ, అందుకే మరోసారి అత్యధిక మెజార్టీ నిచ్చి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన గురిచి ఎంత చెప్పినా తక్కువేనన్న మంత్రులు.. అతను కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందన్నారు. సభకు హాజరయ్యేవారికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సభా వేదిక ఏర్పాట్లతో పాటు నగరంలో స్వాగత ఏర్పాట్లను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ చూస్తున్నారని తెలిపారు. సభకు వచ్చేవారికి పార్కింగ్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

స్వచ్ఛందంగా తరలి రావాలి
సభ కోసం ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని మంత్రులు పిలుపునిచ్చారు. 17న నిర్వహించే సభ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించడమే కాకుండా, ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా ఉండే విధంగా సంకేతాలు వెలుతాయని పేర్కొన్నారు. ఈ సభా వేదికపై నుంచి ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పాటుపడే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగన్నయాదవ్, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, ఐడీసీ చైర్మన్ ఈదశంకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, నాయకులు సునీల్‌రావు, సత్యనారాయణ గౌడ్, ఎడవెల్లి విజేందర్‌రెడ్డి, చొప్పరి జయశ్రీ, ఎడ్ల అశోక్, హరిప్రసాద్ పాల్గొన్నారు.

129
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles