సభకు సమాయత్తం

Fri,March 15, 2019 01:06 AM

-17న కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్
-సక్సెస్ కోసం కదులుతున్న టీఆర్‌ఎస్ నాయకత్వం
- కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహణకు ఏర్పాట్లు
-పరిశీలించిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు
-జన సమీకరణకు ఇన్‌చార్జిల సన్నాహక సమావేశాలు
- రాంపూర్‌లో బొట్టు పెట్టి ఆహ్వానించిన కొప్పుల, గంగుల, సుంకె, నారదాసు సతీమణులు
కరీంనగర్ ప్రతినిధి/కార్పొరేషన్, నమస్తే తెలంగాణ:ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అన్ని విధాలా కలిసొచ్చిన గడ్డ నుంచే లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించబోతున్నారు. ఈ నెల 17న సాయంత్రం 5.30గంటలకు కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో రెండున్నర లక్షల మందితో సభ నిర్వహించబోతున్నారు. ఈ వేదికపై నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి, తెలంగాణలోని 16 ఎంపీ సీట్లు గెలవాల్సిన ఆవశ్యకతను వివరిస్తారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ నాయకులు ఈ సభను అత్యంత కీలకంగా తీసుకున్నారు. ఊహించిన దానికంటే మరింత విజయవంతం చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు భారీ జన సమీకరణ కోసం కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ, దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటు సభ కోసం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్ మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. గురువారం ఉదయం ఏర్పాట్లను పార్టీ జిల్లా ఇన్‌చార్జి బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఎంపీ వినోద్‌కుమార్ పరిశీలించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గంగుల, రాజ్యసభ సభ్యుడు బడుగు లింగన్న యాదవ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి మంత్రులు ఈటల, కొప్పుల పరిశీలించారు. బందోబస్తుపై నగర సీపీ కమలాసన్‌రెడ్డితో మాట్లాడారు. అనంతరం అమాత్యులు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి దేశంలో ఎవరూ చేయని విధంగా లక్షలాది మందితో సభలు నిర్వహించడం టీఆర్‌ఎస్‌కే చెల్లుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ అనీ, అందుకే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా కరీంనగర్ నుంచే ప్రారంభిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి ఇంటికొకరు వచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సభ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుందనీ, కార్యకర్తలందరూ సాయంత్రం 5 గంటల లోగా సభా స్థలానికి చేరుకోవాలని కోరారు. వచ్చే ప్రజలకు పార్కింగ్, తాగునీటితోపాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. స్థానిక ఏర్పాట్లును ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ చేపడుతున్నారనీ, పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు నియమించిన ఇన్‌చార్జిలు కూడా జనసమీకరణ విషయంలో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

బొట్టు పెట్టి ఆహ్వానం..
మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి సేహ్నలత, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సతీమణి రజిత, సుంకె రవిశంకర్ సతీమణి దీవెన, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు సతీమణి వర్ష గురువారం రాత్రి నగరంలోని రాంపూర్‌లో ప్రచారం చేశారు. కేసీఆర్ సభకు స్వచ్ఛందంగా రావాలని కోరుతూ ఇంటింటికీ వెళ్లి, మహిళలకు బొట్టు పెట్టి ఆహ్వానించారు. ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేస్తున్నదనీ, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చారని గుర్తు చేశారు. ఆడబిడ్డలంతా పెద్దసంఖ్యలో తరలివచ్చి, సీఎంను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ, సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నది ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వమేననీ, ఈ సభను విజయవంతం చేయాలని విన్నవించారు. వారివెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, కార్పొరేటర్లు వై సునీల్‌రావు, కట్ల విద్య, ఎడ్ల సరిత, నాయకురాళ్లు కసూర్తి సుజాత, గందె కల్పన ఉన్నారు. అలాగే 30వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ కూడా ఇంటింటి ప్రచారం చేశారు. డివిజన్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి సభకు ఆహ్వనించారు.

భారీ జనసమీకరణే లక్ష్యం
రెండున్నర లక్షల మందితో సభను నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో జనసమీకరణకు కసరత్తు చేస్తున్నారు. మంగళవారం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జిలను నియమించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 30 నుంచి 40 వేల మందిని తరలించడంపై దృష్టి సారించారు. బుధవారం నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. గురువారం కూడా పలుచోట్ల సమావేశాలు ఏర్పాటు చేశారు. మంత్రి ఈటల ఇల్లందకుంటలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజవర్గం నుంచి 50 వేలకుపైగా జనాన్ని తరలించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్ రెడ్డి వీణవంక, జమ్మికుంట మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. మానకొండూర్‌లో ఇన్‌చార్జిలు పుట్ట మధు, కోడూరి సత్యనారాయణ గౌడ్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే రసమయి ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఇటు సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండల కేంద్రాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా ఉన్న ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. వచ్చే ఎంపీ వినోద్‌కుమార్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

103
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles