విలీన గ్రామాల్లో బల్దియా సేవలు

Fri,March 15, 2019 01:05 AM

-8 విలీన గ్రామాల్లో అమలు
-ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ సిబ్బంది
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో విలీనమవుతున్న ఎనిమిది గ్రామపంచాయతీల బాధ్యతలను గురువారం నగరపాలక సిబ్బంది స్వీకరించారు. దీంతో నేటి నుంచి ఆయా గ్రామాల్లో అన్ని సేవలను బల్దియా నుంచి అందించనున్నారు. నగరపాలక సంస్థలో శివారు గ్రామాలైన ఆరెపల్లి, సీతారాంపూర్, రేకుర్తి, పద్మనగర్, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి, సదాశివపల్లి, అల్గునూర్ గ్రామాల విలీనానికి హైకోర్టు నాలుగు రోజుల క్రితం అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మున్సిపల్ శాఖ ఆయా గ్రామాలను విలీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెంటనే కమిషనర్ సత్యనారాయణ ఆయా గ్రామాల విలీనానికి సంబంధించి మున్సిపల్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు.

బాధ్యతల స్వీకరణ
అల్గునూర్ పంచాయతీ బాధ్యతలను ఏసీపీ వందనం, సదాశివపల్లికి ఎం.శ్రీహరి, తీగలగుట్టపల్లికి ఏసీపీ కోటేశ్వర్, పద్మనగర్‌కు రామకృష్ణారెడ్డి, వల్లంపహాడ్‌కు ఆర్‌ఓ రాములు, ఆరెపల్లికి డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, సీతారాంపూర్‌కు డీఈ రామన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీ కార్యదర్శుల నుంచి అధికారులు గ్రామానికి సంబంధించిన రికార్డులు, ఆస్తులు, భవనాలు, చెక్కు పుస్తకాలు, వాహనాలు, ఇతర వివరాలన్నింటినీ స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఇక నుంచి అన్ని కార్యకలాపాలు బల్దియా పేరు మీదనే నిర్వహిస్తారు. ప్రస్తుతం అల్గునూర్‌ను 26వ డివిజన్‌కు, సదాశివపల్లిని 21కి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌ను 4కు, రేకుర్తిని 49కి, పద్మనగర్‌ను 42కు, ఆరెపల్లి, సీతారాంపూర్‌ను 50కి అనుసంధానం చేస్తున్నారు. ఇక నుంచి ఆయా డివిజన్ల పనులను చూస్తున్న బల్దియా అధికారులు వీటిల్లోనూ పనులు నిర్వహించాల్సి ఉంటుంది.

బల్దియా సేవలు ప్రారంభం
నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామపంచాయతీల్లో గురువారం నుంచే నగరపాలక సేవలు మొదలయ్యాయి. ఆయా గ్రామాల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాలు బల్దియా నుంచే అందనున్నాయి. ఆయా పంచాయతీల్లోని ప్రజలు కూ డా ఇకపై జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పిడి ఇతర సేవలన్నీ నగరపాలక సంస్థ నుంచి పొందాల్సి ఉంటుంది. ఆయా విలీన పంచాయతీల్లో త్వరలో నే మున్సిపల్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు త్వరలోనే డివిజన్ కార్యాలయాలను ఏర్పా టు చేసేందుకు అధికారులు దృష్టి సారిస్తున్నారు.

విలీన గ్రామాల్లో పర్యటించిన కమిషనర్
నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన ఎనిమిది పంచాయతీల్లో కమిషనర్ కన్నం సత్యనారాయణ గురువారం సాయంత్రం పర్యటించారు. అక్కడి కార్యాలయాల్లోని ఫర్నిచర్, ఇతర సామగ్రిని పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న పారిశుధ్య, నీటి సరఫరా సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయా కార్యాలయాల వద్ద నగరపాలక సంస్థ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. విలీన గ్రామాల సిబ్బందితోపాటు బల్దియా సిబ్బంది పారిశుధ్యం, నీటి సరఫరా, ఆస్తి పన్ను వసూళ్లలో నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశించారు.

బాధ్యతల కేటాయింపు
బల్దియాలో విలీనమైన గ్రామాలకు సంబందించి పారిశుధ్య పనులు, మంచినీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణకు సంబంధించి బల్దియా సిబ్బందికి విధులు కేటాయించారు. ఇప్పటికే ఆయా గ్రామాలను పలు డివిజన్లకు అనుసంధానం చేయగా.. ఆయా డివిజన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈ పనులు కూడా అప్పగిస్తూ నగర కమిషనర్ సత్యనారాయణ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పారిశుధ్య పనులకు సంబంధించి 42వ డివిజన్‌లో ఉన్న పద్మనగర్ బి.వెంకన్నకు (9849907548), 49వ డివిజన్‌లోని రేకుర్తికి జి.శ్రీనివాస్‌కు (9849907542), 50వ డివిజన్‌లోని ఆరెపల్లిని వై.శ్రీనివాస్‌కు (9502933311), సీతారాంపూర్‌ను ఆర్.మహేందర్‌కు (9652713331), 4వ డివిజన్‌లోని తీగలగుట్టపల్లిని వి.శ్రీధర్‌కు( 9849907550), 26వ డివిజన్‌లోని అల్గునూర్‌ను జె.అశోక్‌కు (9652923332), 21వ డివిజన్‌లోని సదాశివపల్లిని కే బాలస్వామికి (9849007515), 4వ డివిజన్‌లోని వల్లంపహాడ్‌ను ఎం.నరోత్తంరెడ్డికి (9849907552) అప్పగించారు. ఇంజినీరింగ్, రెవెన్యూ, జనన, మరణాలకు సంబంధించి ఆయా విభాగాల అధిపతులకు బాధ్యతలు ఇచ్చారు.

126
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles