యూబీఐలో రూ.12 కోట్లు మాయం

Fri,March 15, 2019 01:04 AM

-కరీంనగర్ ప్రధానశాఖ మేనేజర్ నిర్వాకం
-ఆడిటింగ్‌లో వెలుగులోకి..
-పోలీసుల అదుపులో నిందితుడు
-కేసు సీబీఐకి అప్పగించేందుకు సన్నాహాలు
-వివరాలు వెల్లడించిన కరీంనగర్ వన్‌టౌన్ సీఐ
కరీంనగర్ క్రైం: సాధారణంగా కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటాం. అక్కడైతే భద్రతతోపాటు భరోసా ఉంటుందని నమ్ముతాం. కానీ, బ్యాంకుల్లోనే మోసం జరిగితే, రెక్కలు ముక్కలు చేసుకొని కూడబెట్టుకున్నదంతా మాయం అవుతుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ జాతీయ బ్యాంకులో వెలుగుచూసింది. కరీంనగర్ వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్‌రావు వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రం నడిబొడ్డున రాజీవ్‌చౌక్‌లో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రధానశాఖ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 28 బ్యాంకు శాఖలకు ఇది ప్రధాన కేంద్రం. ఆ 28 బ్యాంకుల్లో జరిగే లావాదేవీలను, నగదు వ్యవహారాలను చూడడంతోపాటు నిర్ణీత మోతాదు కంటే ఎక్కువగా ఉన్న డబ్బును ఈ ప్రధాన శాఖకు తరలించి డిపాజిట్ చేస్తారు. ఈ వ్యవహారాలన్నీ చెస్ట్ బ్యాంకు మేనేజర్ సురేశ్ కుమార్ అనే వ్యక్తి చూస్తారు. అయితే సాధారణంగా మార్చిలో నిర్వహించాల్సిన ఆడిటింగ్‌లో భాగంగా బ్యాంకు అధికారులు ఆడిటింగ్ చేయగా 12 కోట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయమై మేనేజర్ సురేశ్‌కుమార్‌ను విచారించగా, ఆ డబ్బును తానే వాడుకున్నట్లు అంగీకరించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే డబ్బుల గురించి విచారించగా, తనకు పరిచయమున్న ఇద్దరికి ఆ డబ్బు ఇచ్చాననీ, ఇప్పుడు వారు కనిపించకుండా పోయారని చెప్పడంతో అధికారులు కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సురేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, మేనేజర్ తన మిత్రుల ద్వారా పరిచయమైన ఇద్దరు వ్యక్తులకు ఆ డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చానని తెలిపినట్లు సమాచారం. అక్టోబర్ నెలలో 5కోట్లు ఇస్తే వారం రోజుల్లో 15లక్షల గుడ్‌విల్ ఇస్తామని నమ్మించడంతో జబల్‌పూర్‌కు చెందిన వ్యక్తికి బ్యాంకు వాహనం, సెక్యూరిటీ సిబ్బందితో వెళ్లి హైదరాబాద్‌లో అప్పగించినట్లు చెప్పినట్లు తెలిసింది.

అయితే ఆ డబ్బు ఆగిపోయిందనీ, మరి కొంత డబ్బు ఇస్తేనే వచ్చే అవకాశముందని చెప్పడంతో మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తి ద్వారా 7 కోట్లు ఇస్తే 25 లక్షలు అదనంగా చెల్లిస్తామని చెప్పగా ఫిబ్రవరి నెలలో ఇచ్చానని తెలిపారు. వారం రోజుల్లో డబ్బు వస్తుందనుకున్న సమయంలో ఆ ఇద్దరు అందుబాటులోకి రాలేదనీ, ఉన్నతాధికారులు తనిఖీలకు రావడంతోనే ఈ విషయం బయట పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున నగదు బ్యాంకులో మాయం కావడంపై బ్యాంకు ఉన్నతాధికారులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో సీఐ శ్రీనివాసరావు, ఎసీపీ, సీపీలను సంప్రదించి విషయం వివరించారు. అయితే మూడు కోట్లకు పైబడిన కేసులను పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసే అవకాశం లేకపోవడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు కేసును హైదరాబాద్‌లో నమోదు చేయాలని సూచించారు. అయితే బ్యాంకులకు సంబంధించిన వ్యవహారం కావడంతో సీబీఐకి ఫిర్యాదు చేస్తే అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయని సూచించడంతోపాటు అదుపులోకి తీసుకున్న నిందితుడు, బ్యాంకు సిబ్బందిని హైదరాబాద్‌కు తరలిస్తామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సురేశ్‌కుమార్‌తోపాటు అతనికి సహకరించిన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సెక్యూరిటీ గార్డు మాధవరం సంపత్‌రావు (40), సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన పత్తెం నరేశ్ (26), హుస్నాబాద్‌కు చెందిన ఆలేటి సంతోశ్ (30)ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

113
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles