అవయవ దానం చేయండి..

Fri,March 15, 2019 01:04 AM

-డీఆర్వో భిక్షానాయక్
-కరపత్రం ఆవిష్కరణ
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: అవయవ, నేత్రదానం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకురావాలని డీఆర్వో భిక్షానాయక్ పిలుపునిచ్చారు. మనం చనిపోయిన తర్వాత కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్లమవుతామని పేర్కొన్నారు. గురువారం డీఆర్డీవో చాంబర్‌లో నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, నేత్రదానం వల్ల ఇద్దరు అంధుల్లో వెలుగులు నింపవచ్చనీ, అవయవ దానంతో ఆరిపోయే ప్రాణాలకు ఆయుష్షును పోయవచ్చని పేర్కొన్నారు. మరణానంతరం మన శరీరాన్ని దానం ఇవ్వడం వల్ల భావి వైద్యుల విద్యా పరిశోధనలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్యవంతులైన అన్ని వయస్సుల వారు ప్రమాదం వల్ల కానీ, నివారణ కాని వ్యాధి వల్ల గానీ, అకస్మాత్తుగా బ్రెయిన్ డెడ్ అయితే, వారి గుండె, కాలేయం, మూత్రపిండాలు, క్లోమం, పెద్ద, చిన్న పేగులు, ఎముకలు, మూలుగ , గుండె కవాటాలు, నేత్రాలను దానం చేయవచ్చునని వివరించారు. నేత్ర, అవయవ, పార్థీవ దేహదానం చేసేందుకు ముందుగా సభ్యత్వం తీసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్న నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం కార్యకర్తల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలనీ, తద్వారా బ్రెయిన్ డెడ్ అయ్యే వారి అవయవాలను రక్త సంబంధీకులు దానం చేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్, వోపా జిల్లా ప్రధాన కార్యదర్శి గోలి వినోద్, శ్రీజయ భేరి స్వచ్చంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నగునూరి సంతోష్ పాల్గొన్నారు.

84
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles