నేతన్నకు చేయూత.. చేనేత మిత్ర

Fri,February 22, 2019 01:07 AM

- ఆర్థిక పరిపుష్టి కోసమే ప్రభుత్వ పథకాలు
- కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి
- కలెక్టర్ సర్ఫరాజ్‌అహ్మద్ సూచన
- జిల్లా కేంద్రంలో చేనేత పథకాలపై అవగాహన సదస్సు
- పాల్గొన్న చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ అధికారులు
- హాజరైన సంఘాల ప్రతినిధులు, నేత కార్మికులు
కమాన్‌చౌరస్తా: చేనేత మిత్రతో నేతన్నకు చేయూతనిస్తున్నట్లు కలెక్టర్ సర్ఫరరాజ్ అహ్మద్ తెలిపారు. చేనేత కార్మికులకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందనీ, వాటిని సంఘ పాలకవర్గాలు, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం ఏర్పాటు చేసిన చేనేత పథకాలపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. నేతన్నలకు మునుపెన్నడూ లేని విధంగా నేతన్నకు చేయూత (త్రిఫ్టు పథకం), చేనేతమిత్ర పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టడంతోపాటు వాటిని కట్టుదిట్టంగా అమలు చేయాలని సంకల్పించిందనీ, అదే క్రమంలో వాటిపై అవగాహన కల్పించేందుకు ఇక్కడ సదస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. నేతన్నకు చేయూత(త్రిఫ్టు) పథకంలో కార్మికుడు తాను చేసిన పనిద్వారా పొందిన కూలీలో 8 శాతం తనకున్న బ్యాంకు ఖాతాలో జమచేస్తే, ప్రభుత్వం 16 శాతం జమ చేస్తుందనీ, దానిని కార్మికుడు ప్రతి మూడు నెలలకోసారి పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద జిల్లాలోని సంఘాలకు 1.67 కోట్ల త్రిఫ్టు ఫండ్ పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే, చేనేత మిత్ర పథకం ద్వారా చేనేత సహకార, సహకారేతర రంగంలో వస్ర్తోత్పత్తి చేస్తున్న నేత కార్మికులు వారు వస్ర్తోత్పత్తికోసం కొనుగోలు చేసిన నూలు విలువపై ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందిస్తుందనీ, గతంలోలాగా కాకుండా ప్రస్తుతం 35 శాతం కార్మికులకు, 5 శాతం సంఘాలకు నేరుగా వర్తింపజేస్తుందని తెలిపారు. 2017 నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాల్లో చేరేందుకు అవసరమైన మార్గదర్శకాలను వివరించారు.

నేతన్నల కోసం ప్రత్యేక పథకాలు..: ఏడీ శ్రీనివాస్
నేతన్నలు ఆర్థిక పరిపుష్టి సాధించాలనే దృఢసంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెట్టారని హైదరాబాద్ చేనేత, జౌళి పరిశ్రమల శాఖ కేంద్ర కార్యాలయ అదనపు సంచాలకుడు వీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పథకాల అమలు తీరులో, ఇంకా ఏమైనా సమస్యలుంటే తెలుపాలనీ, వాటిని స్వీకరించి సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం నేత కార్మికులు చేసిన పలు సూచనలు-సలహాలను ఆయన నమోదు చేసుకున్నారు. నేత కళాకారులు, డిజైనర్లను ప్రోత్సహించేందుకు గత (2018) ఏడాది కొండా లక్ష్మణ్‌బాపూజీ రాష్ట్ర అవార్డును ప్రవేశపెట్టామనీ, జాతీయ చేనేత దినోత్సవమైన ఆగస్టు 7న 15 మంది నేతన్నలు, 15 మంది డిజైనర్లకు అందజేస్తామనీ, వాటికోసం అర్జీలు చేసుకోవాలని జిల్లా చేనేత జౌళిపరిశ్రమల శాఖ సహాయ సంచాలకుడు ఎం. వెంకటేశం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అసంఘటిత రంగ కార్మికులకోసం ప్రవేశపెట్టిన పెన్షన్ పథకంలో చేరేందుకు నేత కార్మికులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 11 చేనేత సహకార సంఘాల అధ్యక్షులకు 12.45 లక్షల విలువైన త్రిఫ్టుఫండ్ చెక్కులను అదనపు సంచాలకుడు వీ శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు.

చేనేత కార్మికులకు కూడా బీమా వర్తింపజేయాలనీ, అందరికీ ఆరోగ్య బీమా పథకాలు అమలు చేయాలనీ, అర్హులైన నేత కార్మికులందరికీ పెన్షన్ అందించాలని పలు సంఘాల నాయకులు, కార్మికులు కోరారు. కేంద్ర కార్యాలయ డీడీ రతన్‌కుమార్, వరంగల్ రీజినల్ డీడీ తస్వీర్ అతర్‌ఖాన్, సిరిసిల్ల ఏడీ అశోక్‌రావు, సిద్దిపేట ఏడీ వెంకటరమణ, డీఎంవో కరీంనగర్(టెస్కో) జీ తిరుపతి, కరీంనగర్ ఏడీ కార్యాలయ సిబ్బంది, జిల్లా చేనేత సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వీ రాంచంద్రం, ఆప్కో కరీంనగర్ మాజీ డైరెక్టర్ అడిగొప్పుల సత్యనారాయణ, గ్యాజంగి తిరుపతి, వుడుత రమేశ్, అనుమల్ల నర్సయ్య, పెండెం సర్వేశంతోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల చేనేత సంఘాల నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

127
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles