ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Fri,February 22, 2019 01:04 AM

చిగురుమామిడి: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఆయన బీసీ కార్పొరేషన్ కింద 63 మంది లబ్ధిదారులకు రూ. 50 వేల చొప్పున చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. లబ్ధిదారులు రుణాలు సద్వినియోగం చేసుకొని, స్వయం ఉపాధి పొందాలని సూచించారు. బీసీ కార్పొరేషన్ కింద దశల వారీగా రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ జిల్లా అభివృద్ధి అధికారి రంగారెడ్డి, ఎంపీపీ అందె సుజాత, జడ్పీటీసీ వీరమల్ల శేఖర్, ఎంపీడీఓ కుమారస్వామి, వైస్ ఎంపీపీ ఆకవరం భవానీ, సూపరింటెండెంట్ ఖాజామొహినొద్దీన్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

బాలిక అదృశ్యం
చిగురుమామిడి: మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైనట్లు ఎస్‌ఐ సురేందర్ తెలిపారు. బాలిక తల్లి బుధవారం కూలీ పనికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో కనిపించలేదని పేర్కొన్నారు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదన్నారు. కాగా గ్రామానికి చెందిన పాండవుల శ్రీకాంత్‌పై అనుమానం ఉన్నట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

సీఐల బదిలీలు
కరీంనగర్ క్రైం: వరంగల్ జోన్ పరిధిలో 12 మంది సీఐలకు స్థాన చలనం కల్పిస్తూ ఐజీ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కరీంనగర్ కమిషనరేట్‌లో ముగ్గురు సీఐలకు స్థాన చలనం కలిగింది. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రవి స్పెషల్ బ్రాంచికి బదిలీ కాగా, స్పెషల్ బ్రాంచిలో ఉన్న సంతోష్ మహిళా పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. నాలుగు రోజుల క్రితం ఖాళీ అయిన జమ్మికుంటరూరల్ సీఐగా వెయిటింగ్‌లో ఉన్న ఎంఎల్‌ఎం లింగయ్యకు పోస్టింగ్ ఇచ్చారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles