గ్రామ ప్రథమ పౌరులకు ప్రగతిపాఠం

Thu,February 21, 2019 03:04 AM

-సర్పంచులకు మొదలైన శిక్షణ
-మొదటి దఫాలో 98 మందికి..
-వచ్చే నెల 7 వరకు 313 మందికి..
గ్రామ ప్రథమ పౌరులకు శిక్షణ మొదలైంది. జిల్లాలోని 313 మందికి దశల వారీగా తర్ఫీదు ఇవ్వనుండగా, బుధవారం ఆరు మండలాల పరిధిలో 98 మంది సర్పంచులకు ప్రారంభమైంది. కరీంనగర్, కొత్తపల్లి, చొప్పదండి మండలాలకు చెందిన 41 మందికి తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణం.. ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లోని 57 మందికి హుజూరాబాద్ మండలం సింగపూర్‌లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఒక్కో బ్యాచ్‌కు ఐదు రోజులపాటు 27 అంశాల దిశానిర్దేశం చేయనున్నారు.
- కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ


(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ): గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం 313 మంది సర్పంచులుండగా వారికి కొత్తగా అమలులోకి తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించడం, గ్రామాల అభివృద్ధికి పాలక వర్గాలు తీసుకోవాల్సిన చర్యలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యదర్శుల విధులు, బాధ్యతలపై ప్రధానంగా ఈ శిక్షణలో బోధిస్తున్నారు. బుధవారం కరీంనగర్ మండలంలోని 17, కొత్తపల్లి మండలంలోని 8, చొప్పదండి మండలంలోని 16, మొత్తం 41 మందికి తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణంలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులను జిల్లా జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ ప్రారంభించగా ఇన్‌చార్జి డీపీఓ సీహెచ్ మనోజ్‌కుమార్ పర్యవేక్షించారు. ఇక ఇల్లందకుంట మండలంలోని 18, జమ్మికుంట మండలంలోని 20, హుజూరాబాద్ మండలంలోని 19 మొత్తం 57 మంది సర్పంచులకు హుజూరాబాద్ మండలం సింగపూర్‌లోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ తరగతులను జడ్పీ సీఈఓ వెంకటమాధవరావు ప్రారంభించగా, జిల్లా శిక్షణ అధికారి కోట సురేందర్ పర్యవేక్షించారు. సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల 10రోజుల పాటు 10మంది అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ అధికారులు ప్రతీ బ్యాచ్‌కు 5 రోజులపాటు శిక్షణ ఇస్తారు.

27 అంశాలపై కొనసాగనున్న శిక్షణ..

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 మొదలుకుని గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, గ్రామ పంచాయతీల స్థాయీ సంఘాలు, పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు, విధులు, నియమ నిబంధనలు, నియంత్రణాధికారాలు, గ్రామ పంచాయతీల సమావేశాలు, గ్రామసభలు, గ్రామపంచాయతీల ఆర్థిక నిర్వహణ, గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం, తెలంగాణకు హరితహారం, వీధి దీపాల నిర్వహణ, పనులు చేపట్టుట, జనన మరణాలు, వివాహాల నమోదు, లే అవుట్, బిల్డింగ్ అనుమతుల నియమాలు, గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ద్వారా ఆదర్శ గ్రామం, గ్రామపంచాయతీల ఖర్చులు, గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ, ఆడిట్ సర్ చార్జీలు, గ్రామపంచాయతీల సామూహిక తనిఖీలు, ఈ-పంచాయతీ అప్లికేషన్లు, శిశు, లింగ అనుకూల గ్రామపంచాయతీ, వ్యవసాయం, పంచాయతీలు-స్వయం సహాయక సంఘాల సమన్వయం, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ప్రయోజిక పథకాల అనుబంధాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, తెలంగాణ రాష్ట్ర వివరాలు, జిల్లాల వివరాలు తదితర కీలకమైన 27 అంశాలపై సర్పంచులకు శిక్షణ ఇస్తున్నారు. వివిధ శాఖల అధికారులతో వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలనూ సర్పంచులకు వివరిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి మనోజ్‌కుమార్ తెలిపారు.

దశల వారీగా శిక్షణ కార్యక్రమాలు..

ప్రతీ ఐదు రోజులకు ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇస్తున్నారు. మొదటి దఫాలో చొప్పదండి, కరీంనగర్, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల సర్పంచులకు బుధవారం నుంచి ఈ నెల 24 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 25 నుంచి మార్చి 1 వరకు గంగాధరలోని 33, రామడుగులోని 23 మంది సర్పంచులకు ఎల్‌ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణంలో, మానకొండూర్‌లోని 27 మంది, శంకరపట్నంలోని 24 మంది సర్పంచులకు హుజూరాబాద్ మండలం సింగపూర్‌లోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ ఇస్తారు. మార్చి 2 నుంచి 7 వరకు తిమ్మాపూర్‌లోని 23 మంది, చిగురుమామిడిలోని 17 మంది, గన్నేరువరంలోని 16 మందికి ఎల్‌ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణంలో, సైదాపూర్ మండలంలోని 26 మంది, వీణవంక మండలంలోని మరో 26 మందికి సింగపూర్‌లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ ఇస్తారు. శిక్షణ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామనీ, రెసిడెన్సియల్ శిక్షణ కార్యక్రమాలు అయినందునా సర్పంచులకు అన్ని వసతులు కల్పించినట్లు జిల్లా పంచాయతీ అధికారి సీహెచ్ మనోజ్‌కుమార్ తెలిపారు. ప్రతీరోజు ఉదయం 9నుంచి సాయంత్రం 7గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని ఆయన వివరించారు.

159
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles