సకల వసతుల మైనార్టీ విద్య

Thu,February 14, 2019 01:15 AM

* స్వరాష్ట్రంలో సర్కారు అండ
* ఉమ్మడి జిల్లాలో 19 గురుకులాలు
* నాణ్యమైన బోధనకు నిలయాలు
* ఆకట్టుకుంటున్న డిజిటల్ పాఠాలు
* సన్న బియ్యంతో భోజనం
* ఏటా ఒక్కో విద్యార్థిపై లక్షా 5 వేల ఖర్చు
* హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లిం కుటుంబాలు
* ఇప్పటిదాకా లాటరీ దారా సీట్లు
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేక్ష పరీక్షలకు ఏర్పాట్లు
ధర్మపురి, నమస్తేతెలంగాణ: తెలంగాణ ఆవిర్భావం అనంతరం మైనార్టీలకు మంచిరోజలు వచ్చాయి. అప్పటి వరకు సంక్షేమం, అభివృద్ధి, ఇతర రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన ముస్లింల అభ్యున్నతికి టీఆర్‌ఎస్ సర్కారు పాటుపడుతున్నది. ముఖ్యంగా వారి పిల్లల చదువులకు పెద్దపీట వేసింది. మైనార్టీల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నదనీ, ఇందుకు పేదరికమే కారణమని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యనందించినప్పుడే వారి ప్రగతి సాధ్యమని భావించి స్వరాష్ట్రంలో మైనార్టీ విద్యకు ప్రాధాన్యం కల్పించారు.

*అధునాతన భవనాలు.. సకల సౌకర్యాలు
మంచి వాతావరణంలో నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో అధునాతన భవనాలు, సౌకర్యవంతమైన తరగతి గదులతో మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారు. ప్రొజెక్టర్‌తో డిజిటల్ బోధన, విశాలమైన క్రీడా మైదానాలు, సన్నబియ్యంతో భోజనంలాంటి సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన చదువునందిస్తున్నారు. ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 19 గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.లక్షా 5వేల చొప్పున ఖర్చు చేస్తూ వారి అభ్యున్నతికి బాటలు వేస్తున్నది. సర్కారు నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో ఏటా ఆరు వేల మందికి పైగా విద్యార్థులకు అవకాశం వస్తుండగా, ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంటుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి లాటరీ పద్ధతికి స్వస్తి పలికి ప్రవేశ పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నది. కార్పొరేట్ తరహా వసతులతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 204 ఇంగ్లిష్ మీడియం గురుకులాలను నెలకొల్పింది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మైనార్టీలకు సంబంధించి ఒక్క గురుకులం కూడా లేదు. ఉమ్మడి జిల్లాలో కేవలం మూడేళ్ల కాలంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం 19 గురుకులాలు ఏర్పాటు చేసింది. వీటిలో 10 గురుకులాలు బాలురకు, తొమ్మిది గురుకులాలు బాలికల కోసం కేటాయించింది. 2015-16 విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో ఏడు గురుకులాలు ప్రారంభంకాగా అప్పటి నుంచి తర్వాతి విద్యా సంవత్సరం 12 గురుకులాలు మొదలై మొత్తం 19కి చేరుకున్నాయి. వీటిలో మొదట ఏర్పడ్డ ఏడు గురుకులాలు పదో తరగతితో పాటు ఇంటర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

*19 గురుకులాల్లో ఆరువేలకు పైగా విద్యార్థులు..
ఉమ్మడి జిల్లాలోని 19 మైనార్టీ గురకులాల్లో దాదాపు 6,080 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఐదో తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రతి సెక్షన్‌లో 40 మంది విద్యార్థులుంటారు. ప్రతి తరగతిలో 80 మందిని చేర్చుతుండగా వారిలో 60 మంది మైనార్టీ విద్యార్థులు, 20 మంది నాన్ మైనార్టీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ) విద్యార్థులున్నారు. కొన్ని గురకులాలు కళాశాలలుగా అప్‌గ్రేడ్ కానుండగా, ఇంటర్ అనంతరం కూడా డిగ్రీకి అప్‌గేడ్ చేసే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తున్నది. మైనార్టీ గురకులంలో ఒక్క సీటుకు 20 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఇప్పటి వరకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి సీట్లు కేటాయించారు. కానీ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేయనున్నారు.

*అత్యధికంగా కరీంనగర్‌లో..
ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపెల్లి జిల్లాలో 19 మైనార్టీ గురకులాలు ఉండగా జగిత్యాలలో మొత్తం ఐదు ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో బాలుర, బాలికల గురుకులాలు, ధర్మపురిలో బాలికల గురుకులం, కోరుట్లలో బాలుర, మెట్‌పల్లిలో బాలుర గురుకులాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో మొత్తం 9 గురుకులాలుండగా, వాటిలో బాలురకు 5, బాలికలకు 4 కేటాయించారు. కరీంనగర్ సిటీ పరిధిలోనే మూడు బాలుర, రెండు బాలికల గురుకులాలున్నాయి. పెద్దపెల్లి జిల్లాలో మూడు గురుకులాలుండగా, పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో బాలికల, మంథనిలో బాలికల, రామగుండంలో బాలుర గురుకులం విద్యనందిస్తున్నది. సిరిసిల్ల జిల్లాలో రెండు గురుకులాలుండగా, సిరిసిల్ల పట్టణంలో బాలికల, వేములవాడలో బాలుర గురుకులం ఏర్పాటు చేశారు.

*ఒక్కో విద్యార్థికి రూ.లక్షా 5వేలు
మైనారిటీ గురకులంలో విద్యనభ్యసిస్తున్న ఒక్కో విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.లక్షా 5 వేలు ఖర్చు చేస్తున్నది. గురుకులాలను పక్కాగా నిర్వహించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందునుంచే పట్టుదలతో ఉన్నారు. సమైక్య పాలనలో పడకేసిన సర్కారు విద్యావ్యవస్థను తెలంగాణ ఆవిర్భావం అనంతరం సమూలంగా మార్చివేశారు. మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనంతో పాటు ఇతర సౌకర్యాలతో కార్పొరేట్‌కు దీటుగా విద్యాభోదన అందిస్తున్నారు. దీంతో నేడు గురకులాల్లో సీటు పొందేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు.

*పక్కా మెనూతో పోషకాహారం
ప్రభుత్వ గురకులాల్లో పక్కా మెనూ ప్రకారం పోషకాహారం అందిస్తున్నారు. రోజూ పాలు, బూస్ట్, టిఫిన్, మధ్యాహ్నం భోజనంలో ఆకుకూరలు, పప్పు, మరో కూరగాయ, గుడ్డు, సాంబార్, చట్నీ, నెయ్యి, పెరుగు విధిగా అందిస్తున్నారు. రాత్రి భోజనంలో కూరగాయలతో పాటు రసం, మజ్జిగ, పండ్లను అందిస్తున్నారు. నెలలో రెండో వారంలో చికెన్, 1, 3 వారాల్లో మటన్, ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజన విరామం ఉంటుంది. తెల్లవారు జామున 5గంటల నుంచి రాత్రి సాయంత్రం8 గంటల వరకు టైమ్ టేబుల్ ప్రత్యేకంగా రూపొందించారు.

*నాణ్యమైన విద్యాబోధన
మైనార్టీ గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులు పట్టు సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీడియో, ఆడియో ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. కల్చరల్, క్రీడలు, కంప్యూటర్ కోర్సులపై శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ చదువుకునే ప్రతి విద్యార్థికీ స్కిల్ డెవలప్‌మెంట్‌లోనూ శిక్షణ ఇస్తున్నారు. జాతీయ సమైక్యతాభావంతో ఏర్పాటు చేసిన ఈ గురుకులాల్లో విద్యతో పాటు మానవతా విలులు పెంపొందించే దిశగా అడుగులు వేస్తున్నారు.

*మైనార్టీలపై ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే ఈశ్వర్
గత పాలకుల నిర్లక్ష్యంతో అన్ని రంగాల్లో అన్యాయానికి గురైన మైనార్టీ సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మైనారిటీలకు సంబంధించి నిధుల కేటాయింపు మొదలుకొని వారి అభివృద్ధి కోసం పథకాలు, కార్యక్రమాల అమలుదాకా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మైనారిటీలు విద్యావంతులైతేనే అభివృద్ధి చెందుతారని భావించి రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశారు. వీటిలో చదివే ఒక్కో విద్యార్థికి రూ.లక్షకు పైగా ప్రభుత్వమే ఖర్చు చేస్తున్నది.

*విద్యార్థులకు మంచి భవిష్యత్
- స్తంభంకాడి మోహన్, ప్రిన్సిపాల్, మైనారిటీ గురుకుల పాఠశాల, ధర్మపురి
మైనార్టీ గురుకులాల్లో చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంది. 5వ తరగతిలోనే చేరుతున్న విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నాం. ఇక్కడ చదివే విద్యార్థికి పూర్తి స్థాయి శిక్షణ ఇస్తున్నాం. మంచి క్రమశిక్షణతో కూడిన విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తున్నాం. ధర్మపురికి మైనార్టీ పాఠశాలను మగ్గిడిలో ఏర్పాటు చేశారు. గ్రామాలకు దూరంగా ఉండడం వల్ల ఇక్కడ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నది. మా పాఠశాల నుంచి విద్యార్థులను వారానికి ఒకరోజు క్షేత్ర పర్యటను తీసుకెళ్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ధర్మపురి పట్టణంలో అన్ని వసతులున్న భవనంలోకి గురుకులాన్ని మారుస్తున్నాం. ఈ గురుకులానికి పక్కా భవనం కోసం నేరెళ్ల ప్రాంతంలో స్థలాన్ని కూడా అధికారులు గుర్తించారు.

*సీఎంకు కృతజ్ఙతలు
- శరీన్, 8వ తరగతి, మైనార్టీ మోడల్ స్కూల్, ధర్మపురి
మైనార్టీ పాఠశాలలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు కృతజ్ఙతలు. మాది సారంగాపూర్ మండల కేంద్రం. పేద కుటుంబానికి చెందిన నాకు మైనారిటీ పాఠశాలలో సీటు దక్కింది. ఇక్కడ వసతులతో కూడిన విద్యను బోధిస్తున్నారు. చక్కగా చదువుకొని టీచర్‌నవుతా. మాలాంటి పేదవాళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం సారుకు రుణపడి ఉంటం.

*అమ్మ చేతివంట తిన్నట్టున్నది
- సుష్మ, ధర్మపురి
గురుకులంలో మాకు కావాల్సిన అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారు. ఇంట్లో అమ్మచేతి వంట తిన్నంత రుచిగా ఉంటున్నది. మాకు కావాల్సిన పుస్తకాలు, దుస్తులను పాఠశాలలోనే అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.

*ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు
- నరెడ్ల శరణ్య, 8వ తరగతి, మైనార్టీ స్కూల్, ధర్మపురి
పాఠాలు బోధించడంలో ఇక్కడి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా చదువుపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. ఇన్ని సౌకర్యాలతో పాఠశాలను ఏర్పాటు చేసిన సీఎం సారుకు ధన్యవాదాలు.

148
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles