కేటుగాడు చిక్కాడు

Tue,February 12, 2019 12:44 AM

-ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసాలు
-అదుపులోకి తీసుకున్న పోలీసులు
కరీంనగర్ క్రైం : ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మబలికి, 7 కోట్లు దండుకున్న నిందితున్ని కరీంనగర్ త్రీటౌన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడి కోసం గాలించిన పోలీసులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, కరీంనగర్ తీసుకొచ్చారు. సీపీ కమలాసన్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన వెల్ది రాధాకృష్ణ అలియాస్ రాధ డిగ్రీ వరకు నల్గొండలో చదివి కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. కొంతకాలం ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేశాడు. ఆ తర్వాత సెక్రటేరియేట్‌లో ఐటీ అండ్ సీ విభాగంలో ఓఎస్డీకి పీఏగా పని చేశాడు. 2009లో ఇడుపులపాయ ఐఐటీలో ఓఎస్డీగా స్థానం సంపాదించి, అనంతరం బాసర ఐఐటీ ఓఎస్డీగా రెండేళ్ల పని చేశాడు. తిరిగి హైదరాబాద్ చేరుకొని, 2014లో అంబర్‌పేట్‌లో వెంకటేశ్వర కన్సలెన్సీ సర్వీసెస్ పేరుతో సంస్థ ప్రారంభించాడు. తనకున్న పరిచయాలతో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియామకమై 2015 నుంచి 2016 వరకు పనిచేశాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన రాధాకృష్ణ, సులభంగా డబ్బు సంపాదించే పనిలో పడ్డాడు. తనకున్న పరపతితో మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు.

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ఏజెంట్లను నియమించుకుని, నమ్మించడం మొదలు పెట్టాడు. కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన పైడిపాల వెంకటయ్య నమ్మి, తనకు తెలిసిన వారందరికీ రాధాకృష్ణను పరిచయం చేశాడు. వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రాధాకృష్ణ చెప్పాడు. అందరూ నమ్మి, ఒక్కొక్కరు లక్ష నుంచి 2లక్షల దాకా ఇవ్వడంతో, మొత్తం 26లక్షలను వెంకటయ్య ముట్టజెప్పాడు. తర్వాత రాధాకృష్ణ పరారు కావడంతో మోసపోయానని గ్రహించి, పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించాడు. వెంకటయ్య ఫిర్యాదుతో కమిషనర్ స్పందించి త్రీటౌన్‌లో కేసు నమోదు చేయించి, విచారణ జరిపించాలని ఆదేశించారు. త్రీటౌన్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిందితుడైన రాధాకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి, విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతని మాటలు నమ్మి తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల్లో సుమారు 327 మంది బాధితులు డబ్బులు పొగొట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి మొత్తం 7 కోట్ల దాకా తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కొంతమందికి నకిలీ ఉత్తర్వులు కూడా ఇచ్చినట్లు దర్యాప్తులో భాగంగా గుర్తించారు. అతనికి సహకరించిన రామారావు, రవిచంద్రారెడ్డి, బుట్ట జయరాజ్, నాయిని విద్యాసాగర్, వేణుగోపాల శర్మ పరారీలో ఉన్నారు. వీరందరిపై కరీంనగర్ టూ, త్రీటౌన్, గోదావరిఖని, నాగర్ కర్నూల్, నేరెడ్‌మేట్, అంబారిపేట్, నల్లగొండ, బాహుదూర్‌పు, బేతంచెర్ల పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన నిందితుని వద్ద నుంచి చెక్‌బుక్కులు, విలువైన లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితున్ని పట్టుకోవడంలో శ్రమించిన టాస్క్‌పోర్స్ ఎసీపీ శోభన్‌కుమార్, సీఐలు శ్రీనివాసరావు, జనార్థన్‌రెడ్డి, విజయ్‌కుమార్, సిబ్బందిని సీపీ అభినందించారు.

154
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles