ఎన్నికలకు సహకరించాలి

Sun,January 20, 2019 01:01 AM

-ప్రశాంతంగా జరిగేలా చూడాలి
-విజయోత్సవ ర్యాలీలకు అనుమతిలేదు..
-కరీంనగర్ సీపీ కమలాసన్
-నగునూరు, చామనపల్లిలో సదస్సుకు హాజరు
-రెండో విడత మండలాల పోలీస్ అధికారులతో సమీక్ష
తిమ్మాపూర్ రూరల్: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కరీంనగర్ సీపీ వీబీ కమలాసన్ కోరారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల పోలీసు అధికారులతో తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయంలో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రెండో విడత ఐదు మండలాల్లోని 97 గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామాల్లో సంబంధిత స్టేషన్ ఆఫీసర్లు ఇప్పటికే గ్రామాలను పలుసార్లు సందర్శించి, శాంతి భద్రతల విషయంలో పోలీసు కళాబృందాలతోపాటు అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. మండలానికి ఒక ఏసీపీ ఆధ్వర్యంలో 5గురు సీఐలు, ఏడుగురు ఎస్ పోలీసులను బందోబస్తుకు నియమించినట్లు తెలిపారు. స్థానికేతరులు గ్రామాల్లో ఉండరాదనీ, ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎన్నికలు జరిగే మండలాల్లో రెండురోజుల ముందే మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు తీసేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అక్కడ ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాంటి గ్రామాలను ఏసీపీ స్థాయి అధికారులు పలుసార్లు సందర్శించి, గ్రామస్తులకు పలు సూచనలు చేశారని చెప్పారు.

గ్రామాల్లో మైకులతో ప్రచారానికి అనుమతి లేదని పేర్కొన్నారు. ఓటు వేసేందుకు ఓటర్లను తరలించేందుకు అభ్యర్థులు వాహనాలను ఏర్పాటు చేయవద్దనీ, అలా చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల రోజున గుంపులు గుంపులుగా ఉండొద్దనీ, పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 871మందిని బైండోవర్ చేయగా, ఉల్లంఘించిన నలుగురిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జరిమానాలు కట్టించామన్నారు. 102 మద్యం కేసులు నమోదు చేసి, 1665 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని 24 వాహనాలను సీజ్ చేశామనీ, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి, సీఐలు తాండ్ర కరుణాకర్ ఇంద్రసేనారెడ్డి, రరవికుమార్, మహేశ్ సంతోష్ ఎస్ నరేశ్ వంశీకృష్ణ, సురేందర్, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

167
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles