జాతీయ ఓటరు దినోత్సవాన్ని పండుగలా నిర్వహించాలి

Sun,January 20, 2019 01:00 AM

-25న వేడుకలు జరపాలి
-నేడు స్పెషల్ క్యాంపెయిన్ డే
-కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
-వివిధ శాఖల అధికారులతో సమీక్ష
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 25న పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవ నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటు హక్కుకు దూరంగా ఉండరాదనే భావనతో కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు ప్రతియేటా జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటు హక్కు నమోదుకు, ఓటు హక్కు వినియోగానికి విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఇంటింటి సర్వే నిర్వహించి, 1, జనవరి 2019 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో ఓటరు దినోత్సవ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించాలని సూచించారు.

25న ప్రార్థన సమయంలో ఓటు హక్కు- వినియోగించుకోవడంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఓటరు దినోత్సవంపై ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించాలనీ, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీ విద్యార్థులకు పోస్టర్ పెయింటింగ్ పోటీలు నిర్వహించాలనీ, అన్ని పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 21న అంబేద్కర్ స్టేడియంలో జిల్లాస్థాయిలో పోటీలు ఉంటాయని తెలిపారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని 24న హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. డీఆర్డీఏ, మెప్మా గ్రూపుల మహిళలకు రంగోళీ పోటీలు నిర్వహించాలన్నారు. మున్సిపల్, ఎన్ ఎన్ యువజన క్రీడల శాఖ అధికారులు సమన్వయంతో సర్కస్ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు 25న 2కే రన్ నిర్వహించాలని సూచించారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేస్తామనీ, క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ సిటిజన్లను సన్మానిస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో బూత్ లెవల్ అధికారులు, అంగన్ ఆశా కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల్లో ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. జిల్లా అంతటా నిర్వహించే వేడుకల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు.

జిల్లావ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలి..
ఏ ఒక్క ఓటరు కూడా ఓటు నమోదు చేసుకోకుండా ఉండరాదనీ, ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ఐసీడీఎస్, అంగన్ కార్యకర్తలతో ర్యాలీలు నిర్వహించాలనీ, సాంస్కృతిక కళాకారుల చేత జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. 2016 నుంచి 2018 డిసెంబర్ 31 లోపు వివాహం చేసుకుని పుట్టింటి నుంచి అత్త వారింటికి వెళ్లిన మహిళలను అంగన్ ఆశా కార్యకర్తలు గుర్తించి వారు నివసిస్తున్న ప్రదేశాల్లోనే ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. ఉపన్యాస, వ్యాసరచన, రంగోళి పోటీల్లో విజేతలకు 25న బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లందరూ జాబితాల్లో తమ పేరును ఓసారి తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఓటు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వేరే ప్రదేశంలో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉంటే ఫారం-8ఏ పూర్తి చేసి పోలింగ్ కేంద్రాన్ని మార్పు చేసుకోవచ్చన్నారు.
20న స్పెషల్ క్యాంపెయిన్ డే
ఈ నెల 20న జిల్లావ్యాప్తంగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల కోసం స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండాలనీ, ఓటరు జాబితాలు, ఫారాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ నెల 21న కరీంనగర్ రూరల్, గంగాధర, కొత్తపల్లి, రామడుగు, చొప్పదండి మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఆయా మండలాల్లో ఈ నెల 23న ఓటరు నమోదుకు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
బీఎల్వోలు అందుబాటులో ఉండాలి..
జాతీయ ఓటరు దినోత్సవం రోజు పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ఎపిక్ కార్డులు అందజేస్తామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి భిక్షానాయక్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ మెప్మా పీడీ పవన్ సమాచార శాఖ ఉప సంచాలకుడు ఎన్. వెంకటేశ్వర్ జిల్లా కోశాగార అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

403
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles