కమ్మేసింది..!

Sun,January 13, 2019 01:39 AM

-జిల్లాను అలుముకున్న పొగమంచు
-ఉదయం పది దాటినా ఇదే పరిస్థితి
-ఇబ్బందులుపడ్డ వాహనదారులు
-మళ్లీ సాయంత్రం నుంచే మంచు ప్రభావం
-పంటలకు నష్టం అంటున్న శాస్త్రవేత్తలు
-ఆరోగ్యం జాగ్రత్త అంటున్న వైద్యులు
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గతేడాది కంటే పొగమంచు పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చలికాలం వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా మంచు కురియడం సాధారణం. కానీ, గడచిన రెండు మూడేళ్లుగా ఎక్కడ చూసినా దట్టమైన పొగమంచు పట్టేస్తోంది. డిసెంబర్, జనవరి నెలలో చలి తీవ్రత పెరిగే సమయంలో పొగమంచు ప్రభావం చూపుతోంది. గ్రీన్ కారణంగా భూతాపం పెరగడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనీ, సాధారణంగా కొండ ప్రాంతాలు, ఏజెన్సీల్లో కనిపించే పొగమంచు మైదాన ప్రాంతాల్లోనూ విస్తరించడానికి వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్యమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

పొగమంచు ఎందుకు ఏర్పడుతుంది?
పొగమంచు ఏర్పడడానికి పలు కారణాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో రాత్రి వేళల్లో భూమి ఎక్కువగా ఉష్ణశక్తిని విడుదల చేస్తుందనీ, అలా వెలువడిన వేడి క్రమేణా వాతావణంపై పొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుందనీ, అపుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి అవిరి చల్లబడి ఘనీభవించి చిన్న నీటి బింధువులు ఏర్పడతాయనీ, అవి దుమ్ము ధూళి వంటి అతి చిన్న కణాలను ఆవరించి గాలిలో మంచు ఏర్పడుతుందనీ, దీనినే పొగమంచు అంటారని సూచిస్తున్నారు. భూమికి దగ్గరగా ఒక తెరలాగ ఏర్పడడంతో పొగమంచు కురుస్తున్నట్లుగా కనబడుతుంది. చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడడం వల్ల నీటి ఆవిరితో కూడిన గాలి నేలపై ఉండే చెట్ల ఆకులను, పూలను, పచ్చని గడ్డిపరకలను తాకి వాటిపై ఘనీభవిస్తుంది. వీటినే మంచు బిందువులని అంటారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

పొగమంచు ప్రభావం ఎలా ఉంటుంది?
పొగమంచు ప్రభావంతో ఇటు ఆరోగ్యాలు, పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని వైద్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరిస్తున్నారు. పొగమంచు ఏర్పడినప్పుడు గాలిలోని కాలుష్యాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీవ రసాయనిక, శారీరక మార్పుల నుంచి మొదలుకుని ఊపిరి ఆడక పోవడం, రొప్పుట, దగ్గుట, ఊపిరి, గుండె సంబంధిత అనారోగ్యాలకు గురవుతారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనపడు వెంటనే తగిన చికిత్స తీసుకోవాలనీ, లేదంటే ప్రాణాలకు ముప్పు వాటిళ్లుతుందని హెచ్చరిస్తున్నారు. పొగమంచు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా యాసంగిలో సాగుచేసే వరిపంటపై అధికంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. పొలంలో నీరు చల్లబడి నారుమడులు ఎండి పోతాయనీ, నాట్లు వేసిన పొలాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు. రైతులు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. పొగ మంచు కురుస్తున్న సమయంలో నారుమడులపై తెరలు కప్పుకోవడం మంచిదని ఏరువాక కేంద్రం సైంటిస్టు మదన్ తెలిపారు. మడులకు పారించిన నీటిని ప్రతిరోజూ తన్నీరు (నీటిని బయటికి పంపి) తీసి వేడి నీటిని అందిస్తే పంటలు దెబ్బతినకుండా ఉంటాయనీ, చలిని తట్టుకునే రకాలను విత్తుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచిస్తున్నారు.

529
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles