ఆశీర్వాద సభలకు అధినేత

Tue,November 20, 2018 02:13 AM

* నేడు ఉమ్మడి జిల్లాలో ప్రచార సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్
* మధ్యాహ్నం 2.30 గంటలకు హుజూరాబాద్‌లో..
3.30 గంటలకు సిరిసిల్లలో నిర్వహించే సభలకు రాక
* కార్మిక క్షేత్రాన 25 ఎకరాల్లో.. శాలపల్లి-ఇందిరాగర్ వద్ద
15 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు
* ఒక్కో చోట లక్ష మంది జనసమీకరణకు కసరత్తు
* తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
* వాహనాలకు పార్కింగ్ స్థలాలు
* ఆయాచోట్ల పరిశీలించిన మంత్రులు ఈటల, కేటీఆర్
* సిరిసిల్లలో ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైన నేతన్నలు


కరీంనగర్ ప్రధాన ప్రతినిధి/ హుజురాబాద్, నమస్తే తెలంగాణ:టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సెప్టెంబర్ 7న హుస్నాబాద్ కేంద్రంగా ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. అప్పటి నుంచి మ్యానిఫెస్టోలు, టికెట్ల ఖరారు అంశాలపై కసరత్తు పూర్తిచేసిన గులాబీ బాస్, సోమవారం నుంచి మలివిడత ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా నేడు (మంగళవారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కలిపి సిరిసిల్లలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్నారు. సిద్దిపేటలో సభను ముగించుకున్న అనంతరం ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు హుజూరాబాద్ మండలం శాలపల్లి, ఇందిరానగర్ జరిగే సభకు చేరుకుంటారు. ఆ తదుపరి మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో జరిగే సభకు హాజరవుతారు. ఆయాచోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతిని వివరించడమే కాకుండా, భవిష్యత్‌లో చేపట్టే కార్యాచరణను వివరిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి బయలు దేరుతారు. ఈ రెండు సభలు ఉమ్మడి జిల్లాలో మరింత జోష్ నింపుతాయని నాయకులు ఆశిస్తున్నారు.

* శాలపల్లి-ఇందిరానగర్‌లో 50 వేల మందితో..
మంత్రి ఈటల రాజేందర్‌కు అన్ని విధాలా కలిసివచ్చిన హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వద్దే మూడోసారి సభను నిర్వహిస్తున్నారు. మొదటిసారి 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ నిర్వహించారు. అప్పుడు ఉద్యమనాయకుడు, టీఆర్‌ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత ఈటల భారీ మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత గత మే 10న సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన రైతుబంధుకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇక్కడే శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం విజయవంతమైంది. దేశ చరిత్రలోనే నిలిచిపోయింది. ఇటీవల ఐక్యరాజ్య సమితికూడా గుర్తింపునిచ్చింది. రెండు సార్లు సభలు సక్సెస్ కావడం, తనకు అన్ని విధాలా కలిసి రావడంతో మంత్రి ఈటల శాలపల్లి-ఇందిరానగర్‌ను సెంటిమెంట్‌గా భావించారు. అందుకే ఈసారి కూడా ఇక్కడే సభను ఏర్పాటు చేయించారు. లక్ష మందికి తక్కువ కాకుండా జనసమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 15 ఎకరాల్లో సభ నిర్వహించనుండగా, రెండు రోజుల నుంచి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. 50 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. సభకు నాలుగు వైపులా కిలో మీటరు దూరంలో దాదాపు 50 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు. సీఎం ప్రసంగం కనబడే, వినబడేలా ఉండేందుకు సభ వద్ద నాలుగు వైపులా పెద్ద పెద్ద స్క్రీన్లను, సౌండ్ సిస్టంను ఏర్పాటు చేశారు. మహిళలకు ముందు వరుసలో కూర్చునేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సీఐలు ప్రశాంత్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.

ఉప్పెనల కదిలిరావాలి : మంత్రి
సీఎం సభకు ఉప్పెనలా కదిలి రావాలనీ, ప్రతి ఇంటి నుంచి ఇద్దరు తరలివచ్చి ఆశీస్సులు అందించాలని ప్రజలకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాలీలతో పాటు ఇతర వాహనాల్లో భారీగా తరలిరావాలని కోరారు. సోమవారం సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. జనసమీకరణ, సభా ఏర్పాట్లు, వచ్చిన ప్రజలకు ఇబ్బందుల్లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాహనల పార్కింగ్‌పై పార్టీ శ్రేణులతో చర్చించి, తగు సూచనలు చేశారు. అనంతరం మంత్రి ప్రతిపక్ష పార్టీలను తూర్పార పడ్డారు. 35 ఏళ్ల కిందనే ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టారనీ, 1970 తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ప్రతి ఎన్నికలకు ఒక కొత్త వ్యక్తి ఇక్కడికి ఓట్ల కోసం వచ్చి పోతాడే తప్ప, నిఖరంగా ఆ పార్టీకి ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికల అప్పుడే ఆ పార్టీకి చెందిన వ్యక్తులు నెల రోజులు తిరిగి ప్రజలను ఆగమాగం చేస్తారని విమర్శించారు. ఇప్పటి వరకు ఐదు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి నేను ఒక్కడే పోటీ చేశాననీ, ప్రతిసారి నాపై కొత్త వ్యక్తులకే తలపడ్డారని గుర్తు చేశారు.

* కార్మికక్షేత్రాన లక్ష మందితో..
కార్మికధార్మిక క్షేత్రాలనై సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కలిపి సిరిసిల్ల బైపాస్ రోడ్డులో సభ నిర్వహించనున్నారు. ఈ రెండు నియోజకవర్గాలతోపాటు ఇల్లంతకుంట, బోయినిపల్లి మండలాల నుంచి లక్ష మంది తరలిరానున్నరు. సంక్షోభం నుంచి గట్టెక్కించి, తమకు బతుకునిచ్చిన నేతకు స్వాగతం పలికేందుకు నేతన్నలు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలుకనున్నారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేయాలన్న లక్ష్యంతో పార్టీ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యాక్షుడు జిందం చక్రపాణి, సామల పావనిల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులుగా రేయింబవళ్లు కార్యకర్తలు, నాయకులతో కలిసి టెంట్లు, హెలిప్యాడ్, మైదానంలో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయిస్తున్నారు. 25 ఎకరాలలో సభా వేదికను సిద్ధం చేస్తున్నారు. జనాల కోసం ప్రత్యేక టెంట్లు, కూర్చోడానికి కుర్చీలు వేస్తున్నారు. మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. బైపాస్ రోడ్డు పక్కనే హెలీప్యాడ్‌ను నిర్మించారు. భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వేములవాడ నుంచి వచ్చే వాహనాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో.., తంగళ్లపల్లి, జిల్లెల్ల నుంచి వాహనాలకు అపార్టుమెంట్ పక్కన.., ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల నుంచి వచ్చే వాహనాలకు రంగినేని ట్రస్టు వద్ద.. పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

* బతుకునిచ్చిన పెద్దన్నకు కృతజ్ఞత..
నాటి పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన వస్త్ర పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో జీవం పోశారు. మంత్రి కేటీఆర్ చొరవతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను, సిరిశాలగా మార్చారు. వేలాది మంది కార్మికులకు చేతినిండా పని చూపి భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. వీరంతా తమకు బతుకునిచ్చిన అభిమాన నేతకు కృతజ్ఞత చెప్పుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఒకేసారి వేలాది మంది హైదరాబాద్ వెళ్లి కలిసేందుకు వీలు లేకపోవడంతో ఇప్పుడీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే నేటి సభకు స్వచ్ఛందగా తరలివచ్చేందుకు నేత కార్మికులు, యజమానులు సిద్ధమవుతున్నారు. పద్మశాలీ సంఘం, అనుబంధ పరిశ్రమల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. బీడీ కార్మికులు కూడా మేము సైతం మీ వెంటే అంటున్నారు.

* ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్..
ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, సిరిసిల్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కేటీఆర్ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సిరిసిల్ల బైపాస్ రోడ్డులో సభా స్థలికి చేరుకున్నారు. వాహనాల పార్కింగ్ స్థలాలు, హెలీప్యాడ్, సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీల ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ అంశాలపై చీటి నర్సింగారావు వివరించగా, పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అక్కడి నుంచి పద్మనాయక కల్యాణ మండపానికి చేరుకున్నారు. అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. జనసమీకరణ, తరలివచ్చే జనాలకు ఇబ్బందుల్లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, చిక్కాల రామారావు, తోట ఆగయ్య, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, జిందం చక్రపాణి, పూర్మాని లింగారెడ్డి తదితరులు ఉన్నారు.

రంగంలోకి మంత్రులు
రెండు చోట్ల బహిరంగ సభలను అట్టహాసంగా నిర్వహించడానికి మంత్రులు, ఈటల రాజేందర్, కేటీఆర్ రంగంలోకి దిగారు. గత రెండు రోజులుగా హుజురాబాద్‌లోనే ఉంటున్న మంత్రి ఈటల రాజేందర్ సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. హుజూరాబాద్ మండలం ఇందిరానగర్ వద్ద యాభై ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న ఈ సభకు లక్ష మందికి తక్కువగా కాకుండా జనసమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రైతు బంధు పథకం శ్రీకారంకు సంబంధించిన జరిగిన తొలి సభ కూడ ఈ సభా స్థలిలోనే జరిగింది. ఈటల రాజేందర్‌కు అన్ని విధాలుగా కలసి వచ్చే ఇందిరానగర్ వద్దే ఈసారి ప్రజా అశీర్వాద సభను ఏర్పాటు చేశారు. మంగళవారం స్థానిక నాయకులతో కలిసి సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి ప్రతిపక్ష పార్టీలను తూర్పార పడ్డారు. అనంతరం కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సమావేశమై జనసమీకరణ, సభకు వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ ప్రాంతాలనుంచి సభకు వచ్చే వారికి వాహన పార్కింగ్ సౌకర్యాల వంటి అంశాలపై చర్చించి తగు సూచనలు చేశారు.

225
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles