ప్రజలే ప్రాణం.. ప్రగతే లక్ష్యం

Sat,November 17, 2018 02:36 AM

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ఉద్యమాల గడ్డపై ఉవ్వెత్తున ప్రగతి పరుగులు పెడుతోంది. నియోజకవర్గం ఏర్పడి 66 ఏళ్లు కాగా, సమైక్య రాష్ట్రంలో వివక్షకు లోనైంది. కానీ స్వరాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో నిధుల వరద పారుతోంది. ప్రధాన రహదారులే కాదు.. పర్యాటక రంగానికి కొత్త శోభను తెచ్చేందుకు వేసిన ప్రణాళికలు పురుడు పోసుకుంటున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలు అందించేందుకు టవర్ నిర్మాణం జరుగుతోంది. స్మార్ట్ సిటీలో ఇప్పటికే చోటు దక్కించుకోగా, ఏటా నగరానికి ఇచ్చే వంద కోట్ల రుపాయలతో అంతర్గత రోడ్ల రూపురేఖలు మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం కలబోస్తూ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న గంగుల కమలాకర్.. కరీంనగర్‌లో ఇప్పటికే వరుసగా రెండు సార్లు విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ప్రజల అశీర్వాదంతో హ్యాట్రిక్‌వైపు అడుగులు వేస్తున్నారు.

ఎగిరిన గులాబీ జెండా..
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, పీడీఎఫ్, సోషలిస్టు, స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు స్వర్గీయ చొక్కారావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తాజామాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బరిలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన గంగుల ప్రత్యేక తెలంగాణ సాధన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనురించిన రెండు కళ్ల సిద్ధాంతం నచ్చక, ఆ పార్టీని వీడి 2012లో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో గంగుల కమలాకర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలబడగా 24,754 మెజార్టీతో ప్రజలు పట్టం కట్టారు.

ప్రగతి పరుగులు..
యువ నాయకుడిగా గంగుల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నారు. నిత్యం ప్రజలతో మమేకం కావడం.. ప్రగతిని పరుగులు పెట్టించడం ఆయన దిన చర్యగా మారింది. ప్రజల అభిప్రాయాల మేరకు పనులకు ప్రతిపాదనలు తయారు చేయడం.. ప్రభుత్వం నుంచి నిధులు తేవడం.. వాటిని పూర్తిచేసి తిరిగి ప్రజల ముందు పెడుతూ పయనం సాగిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో ఈ నియోజకవర్గానికి వచ్చిన నిధులు, జరిగిన అభివృద్ధి పనులు గతంలో ఎప్పుడూ జరగలేదు. నగరంలో ముఖ్య రహదారుల వెడల్పు, నూతన రహదారుల నిర్మాణం కోసం రూ.46 కోట్లు, విద్యుత్ టవర్ల నిర్మాణం కోసం రూ.22 కోట్ల నిధులను గంగుల తీసుకురాగా, అందులో కొన్ని పనులు పూర్తయ్యాయి. మరికొన్ని ప్రగతిలో ఉన్నాయి. సదరు పనులను పూర్తి చేసేందుకు రూ.36.50 కోట్లు అదనంగా మంజూరయ్యాయి. కరీంనగర్ పట్టణంలోని అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం 216-17లో రూ. వంద కోట్లు, 2017-18లో రూ.147 కోట్లు, ప్రస్తుత అర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయించగా.. పలు పనులు పూర్తి కాగా.. మరికొన్ని నడుస్తున్నాయి.

రూ.183 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, హౌసింగ్‌బోర్డు నుంచి మానేరు వద్ద నిర్మాణం చేసే కేబుల్ బ్రిడ్జి వరకు రూ.34 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభించారు. కేబుల్ బ్రిడ్జి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే మానేరు నది పరివాహక ప్రాంతానికి కొత్తశోభ రానుంది. రూ..504 కోట్లతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. జిల్లాకేంద్రానికి కూతవేటు దూరంలోనే గ్రామాలున్నా.. సమైక్య రాష్ట్రంలో రోడ్డు సౌకర్యానికి నోచుకోలేకపోయాయి. కానీ నేడు ప్రతి గ్రామానికి విశాల రహదారులు పూర్తయ్యాయి. కరీంనగర్ నుంచి ఒద్యారం వరకు రూ.88 కోట్లతో నాలుగులైన్ల రోడ్డు పనులు ప్రారంభించారు. రూ.ఐదు వందల కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇది పూర్తయితే పర్యాటక రంగంలో కరీంనగర్‌కు కొత్త కళ వస్తుంది. నియోజకవర్గంలో రూ. 22 కోట్లతో చెరువులను పునరుద్ధరించి, చెక్‌డ్యాంలను నిర్మించారు. రూ.35 కోట్లతో శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం కింద కాలువలను మరమ్మతు పనులు చేపట్టారు. మానేరులో తాజాగా స్పీడ్‌బోట్లు ఏర్పాటు చేశారు. వివిధ పింఛన్ల కింద నెలకు రూ.3.35 కోట్లు పంపిణీ అవుతోంది. అభివృద్ధి సమపాళ్లలో ముందుకు దూసుకెళ్తోంది. మొత్తంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధ్ది పరుగులు పెడుతోంది. గడిచిన నాలుగేళ్లలో వచ్చిన నిధులు, చేపట్టిన పనులన్నీ పూర్తయితే.. కరీంనగర్ రూపురేఖలు మారనున్నాయి.

హ్యాట్రిక్ కోసం అడుగులు..
కరీంనగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేసి తన సత్తాను చాటుకునేందుకు గంగుల కమలాకర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ అన్ని వర్గాల మద్దతు పొందుతున్నారు. ఇప్పటికే అన్ని కుల సంఘాల మద్దతు పొందిన ఆయన ప్రస్తుతం ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ.. భవిష్యత్తులో చేయబోయే పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటున్నది. గంగుల చేస్తున్న ప్రచారానికి భారీగా తరలి వచ్చి ఆశీర్వాదం ఇస్తున్న ప్రజల తీరు చూసి ప్రతిపక్షాలు కళ్లు చెదురుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధ్ది పనులే తనను గెలిపిస్తాయన్న ధీమాను గంగుల కమలాకర్ వ్యక్తం చేస్తుండగా.. ఈసారి ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలోనే హ్యాట్రిక్ సాధించిన మొదటి ఎమ్మెల్యేగా ఆయన చరిత్రపుటల్లోకి ఎక్కుతారు.

219
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles