ప్రచార జోరు

Thu,November 15, 2018 01:12 AM

-నయాజోష్‌తో టీఆర్‌ఎస్ అభ్యర్థులు
-హుజూరాబాద్‌లో ముస్లింమైనార్టీల పాదయాత్రను ప్రారంభించిన ఈటల
-నామినేషన్ వేసి ప్రచారంలోకి గంగుల
-47డివిజన్‌లో ఇంటింటా ఓట్ల అభ్యర్థన
-మానకొండూర్ మండలంలో రసమయి..
-కొండగట్టులో సుంకె పూజలు.. నామినేషన్
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: జిల్లావ్యాప్తంగా నామినేషన్ల హోరుతోపాటు ప్రచార జోరు కనిపించింది. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కారుగుర్తుకే ఓటేసి, టీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టంకట్టాలని ప్రజలను కోరారు. హుజూరాబాద్ పట్టణంలో టీఆర్‌ఎస్ శాసనసభ అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్ ఆరోసారి లక్షకుపైగా మెజార్టీతో గెలవాలని ముస్లిం మైనార్టీ నాయకులు హుజూరాబాద్ నుంచి జమ్మికుంటలోని బిజిగిరిషరీఫ్ దర్గా వరకు పాదయాత్ర చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తాలో మంత్రి ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమునారెడ్డితో కలిసి, పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. తనపై, పార్టీపై ఉన్న ప్రేమతో ముస్లిం మైనార్టీ నాయకులు ఎంఏ గఫార్, బీఎస్ ఇమ్రాన్, ఎస్టీ కౌన్సిలర్ బర్మావత్ యాదగిరినాయక్ ఆధ్వర్యంలో 116 మందితో బిజిగిరిషరీఫ్ వరకు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు అమలుచేసిన పథకాలను దారిపొడవునా ప్రజలకు వివరించాలని సూచించారు. టీఆర్‌ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ బుధవారం రాత్రి స్థానిక 47వ డివిజన్‌లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు, స్థానిక ప్రజలు కమలాకర్‌కు డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గంగుల డివిజన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. గంగుల మాట్లాడుతూ, గత పాలకుల హయాంలో బొందల గడ్డగా మారిన కరీంనగరాన్ని గత నాలుగేళ్లుగా క్రమక్రమంగా అభివృద్ధ్ది చేసుకుంటూ వస్తున్నామన్నారు. ఈ అభివృద్ది మరింత వేగంగా, నిరంతరాయంగా సాగాలంటే మరోసారి ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని కోరారు. అలాగే, మానకొండూర్ మండలంలో ఆ నియోజకవర్గ అభ్యర్థి రసమయి బాలకిషన్ విస్తృత ప్రచారం నిర్వహించారు. శ్రీనివాస్‌నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, రంగపేట, లక్ష్మీపూర్, వేగురుపల్లి గ్రామాల్లో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి, ఇంటింటికీ తిరుగుతూ కారుగుర్తుకే ఓటేసి, అభివృద్ధి కొనసాగేలా చూడాలని కోరారు. ఆయా గ్రామాల్లో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చొప్పదండి టీఆర్‌ఎస్ జెండా మరోసారి రెపరెపలాడాలని కోరుకున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే అంజన్న ఆలయానికి మాస్టర్ ప్లాన్ అమలయ్యేలా సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానన్నారు.

193
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles