ఊరూరా ఉధృతంగా..


Wed,November 14, 2018 01:10 AM

- జోరుగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం
- ర్యాలీలతో గులాబీమయమవుతున్న వాడలు
- ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్న నేతలు
- జమ్మికుంటలో మంత్రి ఈటలకు ఆశీర్వాద సభలు
- కరీంనగర్‌లో దూసుకు పోతున్న గంగుల
- తిమ్మాపూర్‌లో రసమయికి మద్దతుగా ప్రచారం
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ ప్రచారం ఊరూరా ఉధృతంగా సాగుతోంది. ఇంటింటా ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు జనం నీరాజనాలు పడుతున్నారు. నేతలకు మద్దతుగా చేపడుతున్న ర్యాలీలతో వాడలన్నీ గులాబీమయమవుతున్నాయి. మంగళవారం జమ్మికుంటలో మంత్రి ఈటలకు మద్దతుగా నాయీబ్రాహ్మణ, మేర కులస్థులు, టీఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకులు ఆశీర్వాద సభలు నిర్వహించారు. కరీంనగర్‌తో పాటు రూరల్ మండలంలో గంగుల కమలాకర్ విస్తృత ప్రచారం నిర్వహించగా, రసమయి బాలకిషన్‌కు మద్దతుగా తిమ్మాపూర్‌లో టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటా తిరుగుతూ ఓటు అభ్యర్థించారు.

జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. మంగళవారం కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ విస్తృతంగా పర్యటించారు. ఉదయం నగరంలోని కలెక్టరేట్‌లో గల హెలీప్యాడ్ మైదానంలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి ఓటు అభ్యర్థించారు. వారితో కొద్దిసేపు క్రికెట్ ఆడారు. అనంతరం కరీంనగర్‌రూరల్ మండలం జూబ్లీనగర్, ఫకీర్‌పేట గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ గ్రామాల్లో గంగులకు మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ ఎడ్ల బండిపై ఎక్కి గ్రామస్తుల్లో ఉత్సాహం నింపారు. అన్ని కులాల వారు తమ వృత్తులను ప్రదర్శించారు. నగరంలోని 1వ, 2వ డివిజన్ల మహిళలు గంగులకు మద్దతుగా స్థానిక వరలక్ష్మి గార్డెన్‌లో సదస్సు నిర్వహించారు.

ఈ రెండు డివిజన్ల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి గంగులను ఆశీర్వదించారు. మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో జరిగిన నాయీబ్రాహ్మణ, మేర కులస్థుల ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ మహిళా విభాగం నిర్వహించిన మరో ఆశీర్వాద సభలోనూ పాల్గొని తనను అధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రికి మద్దతుగా హుజూరాబాద్ పట్టణంలో బీసీ జాగృతి, ఎంబీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ హుజూరాబాద్ మండల నాయకులు రాంపూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌కు మద్దతుగా తిమ్మాపూర్‌లో నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్‌లో అభ్యర్థి సతీశ్‌కుమార్‌కు మద్దతుగా గిరిజనులు ఆశీర్వాద సభ నిర్వహించారు. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ హాజరై ప్రసంగించారు. ప్రముఖ గాయకురాలు, టీవీ యాంకర్, తీన్మార్ ఫేం మంగ్లీ సభలో తన ఆటపాటతో అలరించింది.

229
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...