టీఆర్‌ఎస్ దూకుడు

Thu,September 20, 2018 01:49 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:టీఆర్‌ఎస్ అభ్యర్థులు స్పీడ్ పెంచారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. హుజూరాబాద్ అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్ బుధవారం జమ్మికుంటలో మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. గ్రామాలవారీగా పరిష్కరించిన స్థానిక సమస్యలు, ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చించారు. వివిధ సంఘాల నాయకులతో కూడా రాత్రి వరకు సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ గెలుపునకు దోహద పడతాయని అన్నారు. మరోసారి మీ ముందుకు వస్తున్నానీ. ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా 26 గ్రామాలకు చెందిన 1500 మంది ఎస్సీ(మాదిగ)లు ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై వీణవంక మండల కేంద్రానికి తరలివచ్చారు. బస్టాండ్ ఆవరణలో గులాబీ కండువాలు మెడలో వేసుకొని, జెండాలు చేతిలో పట్టుకొని బస్టాండ్ నుంచి ఫంక్షన్‌హాల్ వరకు భారీ ర్యాలీ తీశారు. మహిళలు కోలాటాలతో, యువకులు డప్పుచప్పుళ్లతో టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. ఈటల రాజేందర్‌కు మద్దతు తెలిపారు. ఎన్నికల ఖర్చు కోసం 1.50 లక్షలు విరాళంగా ప్రకటించారు.

రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ అభ్యర్థి ఒడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి ఎంపీ బీ వినోద్‌కుమార్ సైదాపూర్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపెప్ స్కూల్ నుంచి పాత బస్టాండ్ వరకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమావేశానికి హాజరై, దిశానిర్దేశం చేశారు. వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీకి చెందిన ఎక్లాస్‌పూర్ ఎంపీటీసీ సభ్యురాలు గుండేటి వనిత తమ అనుచరులతోపాటు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐకి చెందిన కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెప్టెన్, సతీశ్‌తో కలిసి కండువాలు కప్పి ఎంపీ ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారనీ, కేసులు వేసేందుకు తిరుగుతూ కోర్టు పక్షుల్లా మారారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసిన జనం ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారని అన్నారు. ఇన్నాళ్లు కనిపించకుండా పోయి ఎన్నికల సమయంలో మళ్లీ వస్తున్న ఆ నాయకులకు టీఆర్‌ఎస్ పథకాలను వివరిస్తూ నిలదీయాలని విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు మద్దతుగా కరీంనగర్ ఉమ్మడి మండలంలోని బీజేపీ, బీజేవైఎం నుంచి 200 మందికిపైగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల మాట్లాడారు. గడిచిన నాలుగున్నరేళ్లలో కరీంనగర్ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశాననీ, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి నిధులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనను గెలిపిస్తే జిల్లా కేంద్రానికి ఐటీ కంపెనీలను రప్పించి యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, కరీంనగర్ మండలం చేగుర్తిలో సమావేశమైన వివిధ కుల సంఘాల నాయకులు గంగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్ శంకరపట్నం మండలంలోని ఎరడపల్లి, ఇప్పలపల్లి, వంకాయగూడెం, గద్దపాక, కాచాపూర్, లింగాపూర్, మెట్‌పల్లి, చింతలపల్లి గ్రామాల్లో రసమయి బాలకిషన్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయనకు స్థానికులు డప్పు చప్పుల్లు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. పలు గ్రామాల నుంచి 200 మందికిపైగా వివిధ కుల సంఘాలు, పలు పార్టీల నాయకులు రసమయి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో రసమయి మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని తానెంతో అభివృద్ధి చేశాననీ, అభివృద్ధిని చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మరో సారి తాను గెలిస్తే నియోజవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు.

343
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles