అర్హులందరినీ ఓటరుగా నమోదు చేస్తాం


Thu,September 20, 2018 01:48 AM

- కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
- రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
టవర్‌సర్కిల్: జిల్లాలో అర్హులైన వారందరినీ గుర్తించి ఓటరుగా నమోదు చేస్తామని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చేందుకు వీలుగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ పట్టణంలో ముఖ్యంగా 25 మంది జిల్లా అధికారులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఇంటింటా సర్వే చేస్తున్నామని చెప్పారు. నగరంలో పది ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. జిల్లాలో ఇంతవరకు కొత్త ఓటరు నమోదుకు 27,829 దరఖాస్తులు వచ్చాయనీ, చనిపోయిన వారి ఓట్ల తొలగింపునకు 4,141, ఓటర్ల సవరణకు 5 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈనెల 25న దాదాపు 50వేలకు పైగా ఓటరు నమోదు దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షి షా, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి భిక్షునాయక్, ఆర్డీఓలు చెన్నయ్య, ఆనంద్‌కుమార్, పార్టీల ప్రతినిధులు కే రాజేందర్, జీ సతీశ్, పీ రాజు, జీ సత్యం, మోహన్, అన్వరొద్దీన్, పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...