ప్రజల కోసమే సీఎం ఆలోచన

Thu,September 20, 2018 01:48 AM

-వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే ప్రాజెక్టుల నిర్మాణం
-చంద్రబాబు, వైఎస్సార్ కపటప్రేమ చూపారు
-ఎంపీ బీ వినోద్‌కుమార్
-రాంచంద్రాపూర్, నార్లాపూర్ చెక్‌డ్యాంలకు శంకుస్థాపన
చిగురుమామిడి/కోహెడ/బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర, ప్రజల భవిష్యత్‌ను ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని ఎంపీ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాంచంద్రాపూర్, బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామాల మధ్యగల మోయతుమ్మెద వాగుపై రూ. 11.81 కోట్లతో, కోహెడ మండలం నారాయణపూర్, చిగురుమామిడి మండల ఇందుర్తి గ్రామాల మధ్యగల ఎల్లమ్మ వాగుపై రూ. 6.70 కోట్లతో నిర్మించనున్న చెక్‌డ్యాంలకు ఆయన శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, పార్టీ గెలుపు, ఓట్లు, రాజకీయ అవసరాల కోసం తాత్కాలిక నిర్ణయాలు తీసుకునే నాయకుడు సీఎం కేసీఆర్ కాదన్నారు. రాంచంద్రాపూర్ చెక్‌డ్యాం నిర్మాణం వల్ల మోయతుమ్మెద వాగులో అరకిలోమీటర్ మేర నాలుగున్నర మీటర్ల ఎత్తులో నీరు ఉంటుందని పేర్కొన్నారు. చెక్‌డ్యాం నిర్మాణం వల్ల 300 ఎకరాలకు సాగు నీరు లభిస్తుందని తెలిపారు.

అలాగే, నారాయణపూర్ ఎల్లమ్మ వాగులో నిర్మిస్తున్న చెక్‌డ్యాం వల్ల మూడు మీటర్ల ఎత్తులో నీరు ఉండి 200 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. రాంచంద్రాపూర్ చెక్‌డ్యాం వల్ల బెజ్జంకి మండలం గాగిల్లపూర్, కోహెడ మండలం రాంచంద్రాపూర్ గ్రామాల రైతులకు, నారాయణపూర్ చెక్‌డ్యాం నిర్మాణంతో కోహెడ మండలం నారాయణపూర్, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామాల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఏడాది క్రితం వరద కాలువ పనులను పరిశీలించేందుకు వచ్చిన తమకు మండల సీనియర్ నాయకుడు కర్ర శ్రీహరి మోయతుమ్మెద వాగులో నీటి లభ్యత ఉందనీ, చెక్‌డ్యాం నిర్మిస్తే మండల రైతులకు మేలు చేకూరుతుందని చెప్పాడన్నారు. వెంటనే తాజామాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా, చెక్‌డ్యాం మంజూరు చేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని తెలిపారు.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విషయంలో మోసపూరితంగా వ్యవహరించాయనీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబానాయుడు, వైఎస్సార్ కపట ప్రేమ చూపారని పేర్కొన్నారు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్, ఇతర నిర్మాణాలతో రాష్ట్రంలో ముందు తరాల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల నిర్మాణంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. తోటపల్లి రిజర్వాయర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 3000 ఎకరాల భూసేకరణ చేసే ప్రయత్నం చేసి, 1600ఎకరాలు సేకరించి, ఐదు గ్రామాలను ముంపునకు గురిచేసే ప్రయత్నాలు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తోటపల్లి చెరువునే బలోపేతం చేసి, ముంపు ముప్పును తప్పించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, కోహెడ బెజ్జెంకి మండలాల ఎంపీపీలు ఉప్పుల స్వామి, ఒగ్గు దామోదర్, జడ్పీ సభ్యులు తన్నీరు శరత్‌రావు, పొన్నాల లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆవుల మహేందర్, రామకృష్ణారెడ్డి, ఎంపీడీవోలు శ్రీనివాస్, పవన్‌కుమార్, తహసీల్దార్ నాగజ్యోతి, వైస్ ఎంపీపీ నాగలక్ష్మి, ఎంపీటీసీలు అందె సుజాత, ఆకుల మొగిలి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ బద్దం నర్సింహారెడ్డి, ఎస్సీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు చంద్రయ్య, ఎస్‌కే సిరాజ్, నాయకులు అందె పోశయ్య, చింతపూల ఆంజనేయులు, విష్ణమాచారి, చెప్యాల సంతోష్, అప్పాల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

248
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles