ఇది దుర్దినం

Thu,September 13, 2018 01:21 AM

జగిత్యాల రూరల్ : కొండగట్టు ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగిన రోజు దుర్దినమనీ, ఇలాంటి రోజు చరిత్రలో మరొకటి ఉండొద్దనీ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అందరూ పేదలే మృత్యువాత పడ్డారన్నారు. ఎక్కువ శాతం మంది వైద్యం కోసమే వెళ్తూ చనిపోయారని చెప్పారు. ఆర్టీసీ అధికారుల తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందనీ, గతంలోనే ఈ ఘాట్ రోడ్డుపై భారీ వాహనాల ప్రయాణాలకు నిషేధం విధించారనీ, అయినా ఆర్టీసీ అధికారులు బస్సులో 100 మంది ప్రయాణికులతో నడపడం వల్లే అదుపు తప్పి లోయలో పడిందన్నారు. ప్రమాదానికి పూర్తి బాధ్యత ఆర్టీసీ అధికారులదేనని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 60 మందికి సీఎం కేసీఆర్ రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాతో పాటు, ఆర్టీసీ నుంచి రూ.3లక్షలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రూ.2లక్షల చొప్పున అందిస్తున్నామన్నారు. మృతుల్లో 9 మంది రైతులకు రైతుబీమా పథకం వర్తిస్తుందనీ, వారికి రూ.5లక్షల చొప్పున బీమా సొమ్ము అందిస్తామన్నారు. ఘాట్ రోడ్డులో పూర్తిగా వాహనాలను నిషేధించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరుతామనన్నారు. బాధిత కుటుంబాలకు టీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలకు మరింత సా యం కోసం సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభు త్వం మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తుందన్నారు. అనంతరం జగిత్యాల జిల్లా దవాఖాన, ఓం సా యి వైద్యశాల, గీత నర్సింగ్‌హోం, అన్విశ్రీ దవాఖానలకు వెళ్లి చికిత్ప పొందుతున్న వారిని పరామర్శించారు. వారివెంట జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఆర్డీఓ ఘంటా నరేందర్, కొడిమ్యాల ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలు మెన్నేని స్వర్ణలత, పునుగోటి ప్రశాం తి, టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవి శంకర్, నాయకులు గట్టు సతీష్, నక్కల రవీందర్‌రెడ్డి, అల్లాల దామోదర్ రావు, చిర్ర నరేశ్, కుడుకల లక్ష్మణ్, నాడెం శంకర్ ఉన్నారు.

మెరుగైన వైద్యం అందించండి..
కరీంనగర్ హెల్త్ : జిల్లా కేంద్రంలోని వివిధ దవాఖానాల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాతను ఎంపీ బీ వినోద్‌కుమార్ కోరారు. బుధవారం సాయంత్రం క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్‌కు తరలించిన క్షతగాత్రుల్లో మంగళవారం రాత్రి వరకు ఐదుగురు మరణించగా మరో ఇద్దరు బుధవారం మృతిచెందారు. నగరంలోని అఖీర, సన్‌షైన్, ప్రతిమ, చల్మెడ దవాఖానల్లో ఇంకా కొంత మంది చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితిపై ఎంపీ వైద్య, ఆరోగ్య అధికారిని అడిగి తెలుసుకున్నారు. వీరికి ఇక్కడే మెరుగైన వైద్యం లభిస్తే చికిత్స చేయాలనీ, లేదంటే హైదరాబాద్ తరలించి వైద్యం చేయించాలని ఆదేశించారు. కాగా కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరిని, జగిత్యాలలో చికిత్స పొందుతున్న మరొకరిని ఎంపీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అలాగే జగిత్యాలలో చికిత్స పొందుతున్న ఐదుగురిని నగునూర్‌లోని ప్రతిమ దవాఖానకు తరలించారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యులను ఎంపీ సూచించారు.

176
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles